బ్యాంక్‌ ఖాతాకు మొబైల్‌ నంబరు అనుసంధానం

బ్యాంకు ఖాతాకు మొబైల్ నెంబర్ అనుసంధానం చేయడం ద్వారా ఖాతా వివరాలు వెంటనే తెలుసుకునే వీలుతోబాటు అదనపు భద్రత పొందవచ్చు.

బ్యాంక్‌ ఖాతాకు మొబైల్‌ నంబరు అనుసంధానం

ఆన్‌లైన్‌లో మనకు ఇష్టమైన వస్తువు కొనేసి పేమెంట్‌ను ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు చేస్తాం. రెస్టారెంట్‌లో తిన్న తర్వాత బిల్లు చెల్లింపుకు కార్డ్‌ స్వైప్‌ చేస్తాం. అయితే దేనికీ ఎంత ఖర్చు చేస్తున్నామనే అవగాహన లేకుంటే ఆర్థిక నిర్వహణ కష్టం. ప్రస్తుతం బ్యాంకులన్నీ ఖాతాకు మొబైల్‌ నంబరును అనుసంధానించి సందేశాలను పంపుతున్నాయి. దీని వల్ల ఖాతా నుంచి జరిపే లావాదేవీ గురించి మన మొబైల్‌కు సందేశం వస్తుంది. బ్యాంకు వద్ద మొబైల్‌ నంబరు నమోదు, దాని వల్ల ప్రయోజనాలను ఇక్కడ చూద్దాం.

మొబైల్‌ నంబరును బ్యాంక్‌లో నమోదు చేయించడం

సాధారణంగా బ్యాంకు శాఖలో ఒక ఫారంను నింపి ఇవ్వడం వ్వారా మొబైల్‌ నమోదును పూర్తిచేయవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లడం కుదరని అనుకునే వారు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌ల ద్వారా సైతం నమోదు చేసే వీలుంది. ఒకసారి ఎస్సెమ్మెస్‌ అలర్ట్స్‌ కోసం నమోదు చేసుకుంటే ఖాతాలో లావాదేవీ జరిగినప్పుడల్లా సందేశం వస్తుంది.

బ్యాంక్‌ వద్ద మొబైల్‌ నంబరు నమోదు చేయించడం వల్ల ప్రయోజనాలు

లావాదేవీల ట్రాకింగ్‌:

సూపర్‌ మార్కెట్‌లు, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లు, షాపింగ్‌ల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ వద్ద డెబిట్‌ కార్డు స్వైప్‌ చేయడం మనందరికీ అలవాటైన విషయమే. మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ద్వారా ఎప్పటికప్పుడు లావాదేవీల ఖర్చుల వివరాలన్నీ మొబైల్‌ సందేశాల రూపంలో వస్తాయి.

అదనపు రక్షణ :

నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా, ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎమ్‌పీఎస్‌ లావాదేవీలు జరిపేటప్పుడు మొబైల్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) వస్తుంది. దీని ద్వారా లావాదేవీలు సురక్షితంగా జరిగేలా చూడొచ్చు.

డెబిట్‌ కార్డు పోగొట్టుకుంటే:

డెబిట్‌ కార్డుపోయినప్పుడు కంగారు పడటం మామూలే. అయితే లావాదేవీల వివరాలు మొబైల్‌కు సందేశరూపంలో రావడం వల్ల మనం అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంది. డెబిట్‌కార్డు పోయిందని తెలిసిన వెంటనే సంబంధిత బ్యాంక్‌కు ఫోన్‌ చేసి కార్డును పనిచేయకుండా చేయవచ్చు.

రెగ్యులర్‌ అలర్ట్స్‌:

బ్యాంకు పంపించే ముఖ్యమైన సందేశాలు నేరుగా మీ మొబైల్‌కు చేరతాయి.

ఖాతా విచారణ:

మొబైల్‌ నుంచే ఖాతాలో నగదు నిల్వను తెలుసుకోవడం కోసం బ్యాంకులు ఒక నంబరును కేటాయించాయి. ఆ నంబరుకు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా వెంటనే మొబైల్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది.

మొబైల్‌ నంబరు మారిందా?

వివిధ కారణాల రీత్యా మొబైల్‌ నంబర్లు మారుతూ ఉండవచ్చు. కొన్ని రోజుల తర్వాత మనం వాడిన పాత నంబర్లను కొత్తవారికి కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు బ్యాంక్‌లో మీరు నమోదు చేయించిన ఆ పాత నంబరుకే ఖాతా సంబంధిత సందేశాలు వెళతాయి. దీనివల్ల మీ ముఖ్యమైన ఆర్థిక సమాచారం మీకు తెలియకపోగా ఎవరికో తెలిసే అవకాశం ఉంది.

  • మొబైల్‌ నంబరు మార్చినప్పుడు వీలైనంత త్వరగా బ్యాంక్‌లో అప్‌డేట్‌ చేయించాలి.
  • బ్యాంక్‌ నుంచి వచ్చే ముఖ్యమైన సందేశాలు చేరాలంటే మొబైల్‌ నంబరు మార్చినప్పుడు వీలైనంత త్వరగా బ్యాంక్‌ వద్ద అప్‌డేట్‌ చేయించడం తప్పనిసరి.

ఉరుకుల పరుగుల జీవితంలో సమయపాలన కష్టమైపోతోంది. అందువల్ల మొబైల్‌ అలర్ట్స్‌ సదుపాయం ఉంటే చాలా ఆర్థిక లావాదేవీలు ఓటీపీ సాయంతో చేయవచ్చు. ఏటీఎమ్‌లో చేసే కొన్ని ఖాతా సంబంధిత వ్యవహారాల(ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, టికెట్‌ బుకింగ్‌) గురించి వెంటనే మొబైల్‌లో సంక్షిప్త సందేశాల రూపంలో తెలిసిపోతుంది. ఇలాంటి విస్తృత ప్రయోజనాలను అందుకోవాలంటే బ్యాంక్‌ వద్ద మొబైల్‌ అలర్ట్స్‌ కోసం మీరూ నమోదు చేసుకోండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly