పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

ఎస్‌బీఐ పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీరేట్ల‌ను 4 నుంచి 3.5శాతానికి త‌గ్గించింది. ఖాతాదారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించుకోవాల్సిన తరుణం ఆస‌న్న‌మైందా?

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

జులై 31న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రూ.కోటి లోపు నిల్వ‌లున్న పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేటును అర శాతం త‌గ్గిస్తూ ఉత్త‌ర్వులిచ్చింది. రూ.కోటిపైన నిల్వ ఉన్న నిధుల‌పై య‌ధావిధిగా 4శాతం వ‌డ్డీరేటునే కొన‌సాగించింది. 90శాతం మేర పొదుపు ఖాతాల్లోని సొమ్ము రూ.కోటి లోపే ఉంటాయి.

వ‌డ్డీ రూపంలో ఖాతాలో జ‌మ అయ్యే సొమ్ము ఇకపై కాస్త త‌గ్గ‌నుంది. ఈ నేప‌థ్యంలో వ‌డ్డీ రూపంలో ఎక్కువ రాబ‌డి ఆశించేవారు ఏం చేయాలో తెలుసుకుందాం.

అప్పుడు 3.5శాత‌మే…

2010-11 దాకా పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేటు 3.5శాత‌మే ఉండేది. పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను నియంత్రించుకునే అధికారం బ్యాంకుల‌కే ఇస్తూ అక్టోబ‌ర్ 2011లో ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసింది. 2011-12 నుంచి క్ర‌మంగా పెద్ద వాణిజ్య బ్యాంకుల‌న్నీ డిపాజిట్ సొమ్ముతో సంబంధం లేకుండా… ఎంత జ‌మ‌చేసినా 4శాతం వ‌డ్డీనే అందిస్తూ వ‌స్తున్నాయి.

ఆ రెండు బ్యాంకులు మాత్రం…

యెస్ బ్యాంక్‌, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ లిమిటెడ్ లాంటి కొన్ని బ్యాంకులు అధిక వ‌డ్డీ రేటును ఇవ్వ‌డం ప్రారంభించాయి. త‌మ ఖాతాదారుల‌కు 6-7శాతం వ‌డ్డీరేటును ఈ బ్యాంకులు నిర్ణ‌యించాయి. ఇప్ప‌టికీ ఈ రెండు బ్యాంకులు అధిక వ‌డ్డీనే ఇస్తుంటాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా లాంటి బ‌డా బ్యాంకుల‌తో పోలిస్తే ఈ రెండు బ్యాంకులు అధిక వ‌డ్డీరేటును ఇవ్వ‌డం చెప్పుకోద‌గ్గ విశేషం.

ఎయిర్‌టెల్ పేమెంట్స్‌ బ్యాంక్@ 7.25శాతం

ఎయిర్‌టెల్ చెల్లింపుల బ్యాంకు పొదుపు డిపాజిట్ల‌పై 7.25శాతం వ‌డ్డీనందిస్తోంది. మ‌రో వైపు ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ.ల‌క్ష దాకా డిపాజిట్ చేసిన సొమ్ముపై 5.5శాతం వ‌డ్డీని ఇస్తోంది.

జులై 31 వ‌ర‌కు… ఇదే ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ.కోటి నుంచి రూ.5కోట్ల దాకా డిపాజిట్ సొమ్ము ఉంటే 7.1శాతం వ‌డ్డీని ఇచ్చేది. దాన్ని స‌వ‌రిస్తూ ఆగ‌స్టు 1 నుంచి వ‌డ్డీ రేటును 6.75శాతానికి ప‌రిమితం చేసింది.

అర శాతం తగ్గితే…?

పొదుపు ఖాతాలో రూ.ల‌క్ష పెట్టి సంవ‌త్స‌రం దాకా అలాగే ఉంచార‌నుకుందాం. 3.5శాతం వార్షిక వ‌డ్డీతో రోజుకు రూ.9.50 ల‌భిస్తాయి. అదే 4శాతం వార్షిక వ‌డ్డీ రేటుతో రోజుకు రూ.10.95 అందుకోగ‌లుగుతాం. ఖాతాలో రోజువారీ నిల్వ‌పైనే వ‌డ్డీ జ‌మ అవుతుంద‌న్న సంగ‌తిని గ‌మ‌నించాలి. బ్యాంకు పొదుపు ఖాతాలో సొమ్మును అలాగే ఉంచ‌మ‌ని దాదాపు ఏ ఆర్థిక ప్ర‌ణాళిక‌దారు చెప్ప‌రు.

లిక్విడ్ ఫండ్స్ ఇలా…

పొదుపు ఖాతాల‌తో పోలిస్తే లిక్విడ్ ఫండ్స్ మంచి రాబ‌డిని అందిస్తాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లిక్విడ్ ఫండ్ల ద్వారా సుమారు 6.5శాతం వ‌డ్డీ వ‌స్తోంది. కాబ‌ట్టి 1 లేదా 2 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిపోను పొదుపు ఖాతాలో ఉంచుకోవాలి. మిగ‌తా సొమ్మును అధిక వ‌డ్డీనిచ్చే లిక్విడ్ ఫండ్స్ లాంటివాటికి మ‌ళ్లించడం మంచిది.

ఎంత ఎక్కువ సొమ్మును పొదుపు ఖాతాలో ఉంచితే… త‌క్కువ‌ వ‌డ్డీ రూపంలో అంత ఎక్కువ‌గా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా మంచి రాబ‌డిని కోల్పోయే అవ‌కాశం ఉంటుంది. పొదుపు ఖాతాలో సొమ్మును ఉంచే బ‌దులు ఏదైనా మంచి ఆర్థిక ప‌థ‌కాల‌ను ఎంచుకొని వాటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం మేలు.

(Source: LiveMint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly