ఏఎమ్‌సీ విలీనం..మ్యూచువ‌ల్ మ‌దుప‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

సెబీ, మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలను వ‌ర్గీక‌రణ ప్ర‌కారం, మ్యూచువ‌ల్ ఫండ్లు ప్ర‌తీ వ‌ర్గంలోనూ ఒకే ఓపెన్‌-ఎండ‌డ్ ప‌థ‌కాన్ని క‌లిగి ఉండాలి

ఏఎమ్‌సీ విలీనం..మ్యూచువ‌ల్ మ‌దుప‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

బ‌రోడా మ్యూచువ‌ల్ ఫండ్‌, బీఎన్‌పీ ప‌రిభాస్ మ్యూచువ‌ల్ ఫండ్లు రెండూ విలీనం అవుతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించాయి. ఈ ప్ర‌తిపాద‌నకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఆమోదం రావాల్సి ఉంది. మ‌రి ఈ విలీనం ఆ సంస్థ‌ల పెట్టుబ‌డి దారుల‌ను ప్ర‌భావితం చేస్తుందా?

విలీన ప్ర‌క్రియ పూర్తైన త‌రువాత మేనేజ్‌మెంట్ మారుతుంది. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల మ‌ధ్య విలీనం అంటే ఒకేలా ఉన్న రెండు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ విలీనంగా చెప్పుకోవ‌చ్చు. సెబీ, మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలను వ‌ర్గీక‌రించిన త‌రువాత‌, మ్యూచువ‌ల్ ఫండ్లు ప్ర‌తీ వ‌ర్గంలోనూ ఒకే ఓపెన్‌-ఎండ‌డ్ ప‌థ‌కాన్ని క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల విలీనం అయిన త‌రువాత ఒకే కోవ‌లోకి వ‌చ్చే ప‌థ‌కాల‌ను విలీనం చేయ‌డానికి సంస్థ చ‌ర్య‌లు తీసుకోవాలి.

ఒక ప‌థ‌కం ప్రాథ‌మిక ల‌క్ష‌ణాల‌లో మార్పు చేసిన‌ప్పుడు, ప్ర‌తిపాదిత మార్పుల గురించి మ‌దుప‌ర్ల‌కు ముందుగానే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక‌వేళ పెట్టుబ‌డిదారుడు స‌ద‌రు మార్పులను ఆమోదించ‌క‌పోతే, ప్ర‌స్తుత నిక‌ర ఆస్తి విలువ‌(ఎన్ఏవీ) వ‌ద్ద ప‌థ‌కం నుంచి నిష్క్ర‌మించే వీలుక‌ల్పించాలి. ఇందుకు గానూ ఎటువంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌దు. ప‌థ‌కంలో మార్పు చేసేందుకు పెట్టుబ‌డి దారుల అనుమ‌తి అవ‌స‌రం లేదు. ఏఎమ్‌సీ బోర్డు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి అనుమ‌తితో సంబంధిత ప్ర‌తిపాద‌న‌పు సెబీకి పంపుతారు. ఒక‌సారి సెబీ ఆమోదం పొందితే యూనిట్ హోల్డ‌ర్ల‌కు నోటీసులు పంపాల్సి ఉంటుంది. ఈ నోటీసులో విలీనానికి కార‌ణాలు, దాని వ‌ల్ల ఏర్ప‌డే ప‌ర్య‌వ‌సానాలు వంటి పూర్తి స‌మాచారం ఇవ్వాలి. త‌ద్వారా మ‌దుప‌ర్లు ఈ ప‌థ‌కంలో కొన‌సాగాలా…వ‌ద్దా…అనే నిర్ణ‌యం తీసుకుంటారు.

మీరు కొన‌సాగించాలా?

విలీనం లేదా సముపార్జన విషయంలో, విలీనం చేసిన సంస్థ బలాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం. బరోడా మ్యూచువ‌ల్ ఫండ్‌, బీఎన్‌పీ ప‌రిబాస్ మ్యూచువ‌ల్ ఫండ్లు ఒక‌దానితో మ‌రొక‌టి విలీనం అయితే బీఎన్‌పీ ప‌రిభాస్ నిర్వ‌హ‌ణ‌లో బ‌రోడా మ్యూచువ‌ల్ ఫండ్ ఎంత వ‌ర‌కు ప్ర‌భావితం అవుతుందో చూడాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను విలీనం చేసిన‌ప్పుడు మ్యూచువ‌ల్ ప‌థ‌కం ప‌నితీరు, దాని స్ట్రాట‌జీ, పెట్టుబ‌డుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

విలీనం త‌ర్వాత రెండు ప‌థ‌కాల‌లో ఒక‌టి మాత్ర‌మే ప‌నిచేస్తుంది. రెండోది ర‌ద్ద‌వుతుంది. విలీనం త‌రువాత కొన‌సాగుతున్న ప‌థ‌కంలో పెట్టుబ‌డి దారుల‌కు ఇప్ప‌టికే ఉన్న యూనిట్ల‌కు బ‌దులుగా కొత్త‌ యూనిట్ల‌ను జారీ చేస్తారు. వీటికి ప‌న్ను వ‌ర్తించ‌దు. బ‌దిలీ చేసే ప‌థ‌కం ప్రాథ‌మిక ల‌క్ష‌ణాల‌లో మాత్ర‌మే మార్పు ఉంటుంది. అందువ‌ల్ల అందులో పెట్టుబ‌డి పెట్టిన మ‌దుప‌ర్ల‌కు మాత్ర‌మే నిష్క్ర‌మించే అవ‌కాశం ఉంటుంది. బ‌దిలీ ప‌థ‌కంలో వ‌చ్చిన మార్పులు, ప‌థకం ప‌నితీరు, పెట్టుబ‌డి ల‌క్ష్యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌థ‌కాన్ని కొన‌సాగించాలా… లేదా… అనేది నిర్ణ‌యించుకోవాలి.

పెట్టుబ‌డిదారులు ప‌థ‌కంలో కొన‌సాగాలా… లేదా… అని నిర్ణ‌యించుకునేందుకు 30 రోజుల నోటీస్ పిరియ‌డ్ ఉంటుంది. ఒక‌వేళ ప‌థ‌కం నుంచి నిష్క్ర‌మించాలి అనుకుంటే ఎటువంటి చార్జీలు లేకుండా వైదొల‌గ‌వ‌చ్చు. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ నుంచి వైదొలిగే నాటికి ఏదైనా మూల‌ధ‌న రాబ‌డి ఉంటే, వాటిపై పెట్టుబ‌డిదారునికి ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ ప‌థ‌కంలో కొన‌సాగితే, కొత్త‌గా జారీ చేసే యూనిట్ల‌పై హోల్డింగ్ పిరియ‌డ్ ప్ర‌భావం ఉండ‌దు. విలీనం చేసేనాటికి ఉన్న యూనిట్లు జారీచేసిన అస‌లు తేదీ ఇప్ప‌టికీ చెల్లుబాటులో ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly