మిలీనియ‌ల్ కార్డుల‌ను ఎంచుకుంటున్నారా?

ఆఫర్‌లను పొందడానికి మీరు ఎంత ఖర్చు చేయాలో లెక్కించుకోండి. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చు అనిపిస్తే దూరంగా ఉండ‌ట‌మే మంచిది.

మిలీనియ‌ల్ కార్డుల‌ను ఎంచుకుంటున్నారా?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మిలినియా కార్డుల‌ను గ‌తంలోనే ప్రారంభించింది. దేశంలోని మిలీనియ‌ల్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్డుల‌ను రూపొందించింది. బ్యాంకు ప్రీపెయిడ్ కార్డ్‌, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌, ఈఎమ్ఐ కార్డుల‌ను అందిస్తుంది. యువ‌త‌కు న‌చ్చే విధంగా కార్డుల‌ను అందిస్తున్న‌ట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. దేశంలో యువ‌త శాతం ఎక్కువ‌గా ఉంది. వ‌స్తు, సేవ‌ల కొనుగోళ్ల‌లో ప్రాధాన పాత్ర వారిదే ఉంటుంది. మ‌రి యువ‌త‌కు మిలీనియ కార్డుల‌తో ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌నం … తెలుసుకుందాం…

క్రెడిట్ కార్డు:
యువ‌త చేసే ఖ‌ర్చుల‌ను దృష్టిలో పెట్టుకొని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇత‌ర కార్డులకు కాస్త వ్య‌త్యాసంగా మిలీనియా కార్డుల‌ను రూపొందించింది. ఇప్పుడు డిజిట‌ల్ చెల్లింపుల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్న నేప‌థ్యంలో, ఈ కార్డుపై వ‌చ్చే క్యాష్‌బ్యాక్‌తో తిరిగి లోడ్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఇత‌ర కార్డుల్లో ఇలాంటి స‌దుపాయం లేదు. ప్ర‌తీ రూ.2000 పైన చేసే లావాదేవీల‌కు 2.5 శాతం క్యాష్‌బ్యాక్‌, ఆఫ్‌లైన్ కొనుగోళ్ల‌కు 1 శాతం అంటే క‌నీసం వంద రూపాయ‌లు వెన‌క్కి వ‌స్తాయి. అయితే పెట్రోల్ కోసం కార్డును ఉప‌యోగిస్తే ఇది ల‌భించ‌దు. దీంతో పాటు గ‌రిష్ఠ క్యాష్‌బ్యాక్ పై కూడా ప‌రిమితులు ఉన్నాయి. ఇందులో ఉన్న ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నం ఏంటంటే రివార్డుల‌కు బ‌దులుగా క్యాష్‌బ్యాక్ రావ‌డం. ఇవి క్యాష్‌పాయింట్ల రూపంలో ఉంటాయి, షాపింగ్ చేసుకునేందుకు, విమాన‌, హోటల్ బుకింగ్స్ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు.

అయితే ఈ క్యాష్ పాయింట్ల‌కు గ‌డువు తేది ఉంటుంది. ఆ లోపు ఉప‌యోగించుకోవాలి. ఇత‌ర కార్డులు రివార్డు పాయింట్ల‌కు రెండు నుంచి మూడేళ్ల గ‌డువు ఉండ‌గా, హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌పాయింట్ల‌ను వినియోగించేందుకు ఏడాది స‌మ‌యం ఉటుంది. ఒక పాయింట్‌కు 30 పైస‌ల చొప్పున ల‌భిస్తాయి. దీనికి మొద‌టి ఏడాదిలో ల‌క్ష‌కు పైగా ఖ‌ర్చు చేస్తే రినీవ‌ల్ ఫీజు ఉండ‌దు, మొద‌టి 90 రోజుల్లో రూ.30 వేల‌కు పైగాఖ‌ర్చు చేస్తే ప్ర‌వేశ రుసుము కూడా లేదు.

ఇలాంటి వాటిపై యువ‌త ఎక్కువ మ‌క్కువ చూపిస్తారు. క్రెడిట్ కార్డును స్మార్ట్‌గా ఉప‌యోగించుకోగ‌లిగితే కార్డును వినియోగించ‌డం మంచిది. గ‌డువులోపు బిల్లులు చెల్లించాలి. స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే రుణాలు పెరిగిపోతాయి. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను చూసి క్రెడిట్ కార్డుల‌ను ఎంచుకోవ‌ద్ద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

ఈజీ ఈఎమ్ఐ కార్డు
ఇది కూడా క్రెడిట్ కార్డులాగే ప‌నిచేస్తుంది. అయితే రూ.10 వేల కంటేఎక్కువ కొనుగోళ్లు ఆటోమేటిక్‌గా 9 నెల‌ల‌ ఈఎమ్ఐగా మార‌తాయి. సంవ‌త్స‌రానికి 20 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ రూపంలో వ‌చ్చిన‌వి కూడా ఈఎమ్ఐలోకి చేర‌తాయి. వ్య‌క్తిగ‌త రుణాలు, క్రెడిట్ కార్డుల‌పై వ‌డ్డీ కంటే ఈ వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. కేవ‌లం 9 నెల‌ల ఈఎమ్ఐ ఆప్ష‌న్ మాత్ర‌మే ఇక్క‌డ ల‌భిస్తుంది. ఇత‌ర కార్డులకు 3 నుంచి 48 నెల‌ల వ‌ర‌కు ఈఎమ్ఐ ఆప్ష‌న్ ఉంటుంది.

ప్రాసెసింగ్ ఫీజు రూ.99 తో పాటు జీఎస్‌టీ కూడా వ‌ర్తిస్తుంది. రూ.10 వేల‌కు 99 ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు ఏడాదికి 24.90 శాతం వ‌డ్డీ ప‌డుతుంది. రూ.40 వేల‌కు 22.70 శాతం వ‌డ్డీ ఉంటుంది. గ‌డువులోపు చెల్లించాలి. మ‌రి ఈ కార్డు ఎందుకు కొనుగోలు చేయాలంటే ఒకే నెల‌లో ఎక్కువ సార్లు కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. వ‌డ్డీ రేటు ప్ర‌భావం త‌గ్గుతుంది.

ప్రీపెయిడ్ , డెబిట్ కార్డులు
ప్రీపెయిడ్ కార్డులో ముందే డబ్బు స్టోర్ చేసి పెట్టుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా ప్రీపెయిడ్ కార్డుల మాదిరిగా మార్కెట్‌లో ఇత‌రు కార్డులు లేవు. యాక్సిస్ బ్యాంక్ గిఫ్ట్ కార్డ్ రూ.50 వేల వ‌ర‌కు లోడ్ చేసుకోవ‌చ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రీపెయిడ్ కార్డ్‌లో రూ.10 వేల వ‌ర‌కు ప‌రిమితి ఉంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లో ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు లోడ్ చేసుకోవ‌చ్చు. దీంతో పాటు బీమా క‌వ‌రేజ్‌, క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కూడా ల‌భిస్తాయి. వ్య‌క్తిగ‌త బీమా క‌వ‌రేజ్ ల‌క్ష రూపాయ‌లు లభిస్తుంది. అయితే ఈ హామీ ల‌భించాలంటే గ‌త 30 రోజుల్లో ఆ కార్డుతో షాపింగ్ చేసి ఉండాలి. అయితే అవి ఏటీఎం నుంచి డ‌బ్బు తీసుకుంటే వ‌ర్తించ‌దు.

ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం ప్రారంభిస్తున్న యువ‌త‌కు ప్రీపెయిడ్ కార్డు కోసం వెళ్లడం మంచి ఎంపిక అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మీ వద్ద ఉన్నదాన్ని మాత్రమే ఖర్చు చేయడానికి అనుమతిస్తుంది. ప్రయాణాలు ఎక్కువ చేసే మిలీనియల్స్ కోసం ప్రీపెయిడ్ కార్డును సిఫారసు చేస్తున్నారు నిపుణులు. ఇందులో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించే అవ‌సం లేదు, అదేవిధంగా లావాదేవీల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవు.

క్రెడిట్ కార్డు పొందటానికి క్రెడిట్ చ‌రిత్ర‌, డెబిట్ కార్డు కోసం బ్యాంకు ఖాతా లేనివ‌రాకి ఇది ప్ర‌యోజ‌క‌రంగా ఉంటుంది. ప్రీపెయిడ్ కార్డులను స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతిగా కూడా ఇవ్వ‌వ‌చ్చు. డెబిట్ కార్డుతో ఒక‌రోజు షాపింగ్ పరిమితి రూ. 3.5 లక్షలు, నగదు ఉపసంహరణ పరిమితి రూ. 50,000, వార్షిక క్యాష్‌బ్యాక్ రూ. 4,800, కార్డ్ రీలోడ్ చేసేందుకు 1% క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. కార్డుదారులు పేజాప్ లేదా స్మార్ట్‌బై ద్వారా షాపింగ్ చేస్తే 5% క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు.

నాలుగు కార్డులతో సుల‌భ చెల్లింపు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ కార్డ్ తీసుకునేముందు నిబంధనలు, షరతులను పోల్చి చూసుకోవ‌డం, అర్థం చేసుకోవడం మంచిది. రివార్డులు, క్యాష్‌బ్యాక్ మొదట ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కాని వాటిని పొందటానికి మీరు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో అంచనా వేయడం చాలా ముఖ్యం. మీరు చేయగలిగినదానికంటే ఎక్కువ ఖర్చు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తే వీటికి దూరంగా ఉండటం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly