ఇకపై తక్కవ ధరకే నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్..

ఇటువంటి ప్లాన్ ను నెట్‌ఫ్లిక్స్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ప్లాన్ ను పొందిన మొదటి దేశం భారత్ కావడం విశేషం

ఇకపై తక్కవ ధరకే నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్..

భారతదేశంలో కొంతకాలంగా పరీక్ష దశలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఓన్లీ ప్లాన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ కేవలం భారతీయ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. దీని కోసం వినియోగదారులు నెలకు రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. ఇది స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డీ) రిజల్యూషన్‌లో, అలాగే ఒకేసారి ఒక స్క్రీన్‌లో మాత్రమే కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది మొబైల్, టాబ్లెట్ రెండిటిలో పనిచేస్తుంది.

ఇటువంటి ప్లాన్ ను నెట్‌ఫ్లిక్స్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ప్లాన్ ను పొందిన మొదటి దేశం భారత్ కావడం విశేషం. ప్రస్తుతానికి, ఈ ప్లాన్ ను ఇతర దేశాలలో కూడా అందుబాటులోకి సంస్థ తీసుకొస్తుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు.

కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్ దేశంలో సర్వీసును అందిస్తున్నప్పటికీ, హాట్‌స్టార్, ఏఎల్టీ బాలాజీ, అమెజాన్ (ప్రైమ్ వీడియో) వంటి స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. భారతీయ ప్రేక్షకుల కోసం ఒరిజినల్ కంటెంట్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ పెట్టుబడి పెట్టినప్పటికీ, ఇది సబ్ స్క్రైబర్ల సంఖ్యను మాత్రం పెంచలేకపోయింది.

హాట్‌స్టార్ మాదిరిగా, నెట్‌ఫ్లిక్స్ ట్రయల్ వ్యవధిలో మినహా దాని వినియోగదారులకు ఉచిత సర్వీసులను అందించడం లేదు. మరోవైపు, అమెజాన్ తన అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ప్రైమ్ వీడియోలు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో వేగంగా డెలివరీలను అందిస్తుంది. దీంతో వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ కంటే అమెజాన్, హాట్‌స్టార్‌లలో సబ్ స్క్రిప్షన్ పొందడానికి ఆసక్తి కనపరుస్తున్నారు.

ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (పీడబ్ల్యూసీ) జూన్ 2019 నివేదిక ప్రకారం, ప్రపంచంలో ఓటీటీ (ఓవర్-ది-టాప్) స్ట్రీమింగ్‌ లో భారతదేశం పదవ అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం ఇక్కడ ఈ రంగంపై వచ్చే మొత్తం ఆదాయం రూ. 4462 కోట్లు. 2023 సంవత్సరం నాటికి సబ్ స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫాంలు 23.33 శాతం సీఏజీఆర్ రేటుతో వృద్ధి చెందుతాయని, అలాగే మొత్తం ఆదాయం రూ. 10,712 కోట్లకు చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉందని తెలిపింది.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మొత్తం 34 స్ట్రీమింగ్ సర్వీసులు ఉన్నారని, వాటిలో హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఊట్, జీ5, ఈరోస్ నౌ, ఏఎల్టీ బాలాజీ తో పాటు మరికొన్ని సర్వీసులు ఉన్నాయి.

ఈ సంవత్సరం ఎఫ్ఐసీసీఐ - ఈఎఫ్ నివేదిక ప్రకారం, భారతీయులు తమ మొబైల్ డేటాలో 70 శాతం పైగా వినోదం కోసం వెచ్చిస్తున్నారని కంపెనీ తెలిపింది. అందువలన నెట్‌ఫ్లిక్స్ మన దేశంలో మొబైల్ ఓన్లీ ప్లాన్ ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly