పీఎఫ్ ఉపసంహరణకు అవసరం అయ్యే ఫారంలు

అనారోగ్యం, నిరుద్యోగం, ఉద్యోగం పోవడం వంటి కారణాల వలన నిధులను ఉపసంహరించుకున్నట్లైతే, దానిపై పన్ను వర్తించదు.

పీఎఫ్ ఉపసంహరణకు అవసరం అయ్యే  ఫారంలు

ఈపీఎఫ్ (ఉద్యోగ భవిష్య నిధి) అనేది ఒక పదవీ విరమణ పొదుపు పథకం, ప్రతి నెలా ఉద్యోగులు వారి ప్రాథమిక జీతం నుంచి 12 శాతం మొత్తాన్ని ఈపీఎఫ్ కు చెల్లిస్తారు. ఇదే మొత్తాన్ని యజమాని కూడా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తారు. ఇద్దరూ చెల్లించిన మొత్తం ఉద్యోగి పదవీ విరమణ కోసం ఒక కార్పస్ ను ఏర్పరుస్తుంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వివిధ రకాల పీఎఫ్ ఉపసంహరణలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్, పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ, పెన్షన్ ఉపసంహరణ ప్రయోజనం ఉన్నాయి. ఐదు సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి కాకముందే, ఈపీఎఫ్ఓ ​​నుంచి నిధులను ఉపసంహరించుకున్నట్లైతే, దానిపై పన్ను విధిస్తారు. ప్రధాన, పెరిగిన వడ్డీ పన్నుకు లోబడి ఉంటుంది. అనారోగ్యం కారణంగా, నిరుద్యోగం కారణంగా, ఉద్యోగం పోవడం వంటి కారణాల వలన నిధులను ఉపసంహరించుకున్నట్లైతే, దానిపై పన్ను వర్తించదు. ఒకవేళ ఎవరైనా తమ పీఎఫ్ ఖాతాను జాతీయ పింఛను పథకానికి బదిలీ చేసి, అనంతరం నగదు ఉపసంహరణ చేసినట్లయితే దానిపై పన్ను వర్తించదు. ఈపీఎఫ్ నిబంధనలలోని సవరణల ప్రకారం, ఈపీఎఫ్ఓ చందాదారులు పాక్షిక లేదా పూర్తి నగదును ఉపసంహరించుకోడానికి వారి యజమాని నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని కోసం చందాదారులు ఆధార్ కార్డు వివరాలను, యూఏఎన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ చట్టం పరిధిలో ఉన్న అందరు ఉద్యోగులకు యూపీఎఫ్ఓ యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబరు) ను కేటాయించింది.

ఈపీఎఫ్ నియమాల ప్రకారం, ఒక వ్యక్తి తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసినప్పుడు లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలల పాటు నిరుద్యోగిగా ఉన్న సందర్భంలో పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకోడానికి అనుమతిస్తారు. అయితే, రెండు నెలల కంటే ఎక్కువ సమయం నిరుద్యోగిగా ఉన్నట్లు గెజిటెడ్ అధికారి నుంచి సర్టిఫికేట్ తీసుకుని ఈపీఎఫ్ఓ కు సమర్పించాల్సి ఉంటుంది. వివాహం, విద్య, భూమి కొనుగోలు, ఇంటి నిర్మాణం లేదా గృహ రుణాల చెల్లింపు వంటి సందర్భాల్లో మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.

పాక్షిక లేదా పూర్తి నగదు ఉపసంహరణల అభ్యర్థనకు కాంపోజిట్ క్లెయిమ్ ఫారంలను చందాదారులు పూరించవచ్చు. ఆధార్ కార్డు వివరాలు యూఏఎన్ తో లింకై ఉన్నట్లయితే, యజమాని ధృవీకరణ అవసరం లేదు. గతంలో ఫారం 19, ఫారం 31, ఫారం 10సీ లను నగదు ఉపసంహరణ చేయడానికి ఉపయోగించారు. ఈ ఫారంలను ఇటీవల కాంపోజిట్ క్లెయిమ్ ఫారం భర్తీ చేసింది. ఉద్యోగుల యూఏఎన్ వివరాలకు బదులుగా, కాంపోజిట్ క్లెయిమ్ ఫారంలకు ఉద్యోగి ఆధార్ వివరాలు అవసరం. ఒక వ్యక్తి నేరుగా దరఖాస్తును అందించడం ద్వారా లేదా ఆన్ లైన్ దరఖాస్తును సమర్పించడం ద్వారా ఉపసంహరణ అభ్యర్థనను చేయవచ్చు.

ఉపసంహరణ అభ్యర్థనను నేరుగా దరఖాస్తు చేసుకోవడం :

  1. epfindia.gov.in వెబ్ సైట్ ను సందర్శించి, అందులో డౌన్ లోడ్ ఆప్షన్ లోకి వెళ్లి కాంపోజిట్ క్లెయిమ్ ఫారంను డౌన్ లోడ్ చేయండి. యజమాని ధృవీకరణ లేకుండా ఆధార్ నెంబర్ సహాయంతో కాంపోజిట్ క్లెయిమ్ ఫారంను నింపి సంబంధిత ఈపీఎఫ్ఓ ​​కార్యాలయంలో సమర్పించవచ్చు, అయితే కొత్త నాన్ ఆధార్ కాంపోజిట్ క్లెయిమ్ ఫారంను నింపి యజమాని ధృవీకరణతో సమర్పించవచ్చు.

  2. ఉపసంహరణ ఫారంను ఆన్ లైన్ లో సమర్పించడానికి మీ యూఏఎన్ యాక్టివేట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది. యూఏఎన్ యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పని చేస్తూ ఉండాలి.

  3. ఐఎఫ్ఎస్సీ కోడ్ తో పాటు, కేవైసీ, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలతో యూఏఎన్ ని అనుసంధానించాలి.

ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ :

  1. unifiedportal-mem.epfindia.gov.in ను సందర్శించండి.

  2. యూఏఎన్, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయ్యి, క్యాపచ్చీ ని నమోదు చేయండి.

  3. “మేనేజ్” అనే ట్యాబ్ పై క్లిక్ చేసి, కేవైసీ ఆప్షన్ ను ఎంచుకుని ఆధార్, పాన్, బ్యాంక్ వివరాల వంటి కేవైసీ వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.

  4. కేవైసీ ధృవీకరణ తర్వాత, ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ కు వెళ్లి ‘క్లెయిమ్’ ఆప్షన్ ను ఎంచుకోండి. అనంతరం స్క్రీన్ పై సభ్యుడి వివరాలు, కేవైసీ వివరాలతో పాటు ఇతర సర్వీస్ వివరాలు కనిపిస్తాయి.

  5. క్లెయిమ్ ఫారం ను సమర్పించడానికి ‘ప్రొసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్’ ట్యాబ్ పై క్లిక్ చేయండి.

  6. క్లెయిమ్ ఫారంలో, మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న క్లెయిమ్ (పూర్తి ఈపీఎఫ్ సెటిల్మెంట్, ఈపీఎఫ్ పార్ట్ సెటిల్మెంట్ లేదా పెన్షన్ ఉపసంహరణ) ను ఎంచుకోండి.

ఆన్ లైన్ ఉపసంహరణ క్లెయిమ్ ను ఫైల్ చేస్తున్నప్పుడు, మూడు రకాల ఫారంలు ఉన్నాయి.

కేవలం పీఎఫ్ ఉపసంహరణ (ఫారం 19) - ఇది సేకరించిన మొత్తం పీఎఫ్ ను తిరిగి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

కేవలం పెన్షన్ ఉపసంహరణ (ఫారం 10సీ) - పింఛను మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకోవదానికి దీనిని ఉపయోగిస్తారు. పెన్షన్ మొత్తాన్ని ఉద్యోగుల పెన్షన్ పథకం, 1950 నియంత్రిస్తుంది. అలాగే పీఎఫ్ నియమావళిని ఉద్యోగ భవిష్య నిధి స్కీం 1952 నియంత్రిస్తుంది.

పాక్షిక పీఎఫ్ ఉపసంహరణ (ఫారం 31) - ఈ ఫారం పాక్షిక ఉపసంహరణ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly