నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ (ఎన్‌.ఆర్‌.ఓ) అకౌంట్ అంటే ఏంటి?

దేశాల్లో అపరిమిత కాలం పాటు జీవించాల‌నే ఉద్దేశంతో బ‌య‌ట‌కు వెళ్లిన‌వారు ఎన్ఆర్ఐగా గుర్తింపుపొందుతారు

నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ (ఎన్‌.ఆర్‌.ఓ) అకౌంట్ అంటే ఏంటి?

మ‌న దేశం వెలుప‌ల నివ‌సించే భార‌త పౌరుల‌ను, భార‌తీయ మూలాలున్న వారిని క‌లిపి ప్ర‌వాస భార‌తీయులుగా సంబోధిస్తాం. భార‌త్‌లో వీరు మూడు ర‌కాల బ్యాంకు ఖాతాల‌ను క‌లిగి ఉండ‌వ‌చ్చు. అవి

 • నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ (ఎన్‌.ఆర్‌.ఓ)
 • నాన్ రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ (ఎన్‌.ఆర్‌.ఈ)
 • ఫారిన్ క‌రెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌)

ముందుగా నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ (ఎన్‌.ఆర్‌.ఓ) అకౌంట్ గురించి తెలుసుకుందాం.

ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాను ఎవ‌రు తెర‌వ‌వ‌చ్చు?

 • విదేశాల్లో అపరిమిత కాలం పాటు జీవించాల‌నే ఉద్దేశంతో బ‌య‌ట‌కు వెళ్లిన‌వారు ఎన్ఆర్ఐగా గుర్తింపుపొందుతారు. బ్యాంకు అధికారికి తాను విదేశాల‌కు వెళుతున్న‌ట్టు, త‌న ఖాతాను ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాగా మార్చ‌వ‌ల‌సిందిగా తెలియ‌జేయాలి. అలా వ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ను స‌మ్మ‌తించి ప్ర‌స్తుతం ఉన్న ఖాతాను ఎన్.ఆర్‌.ఓ ఖాతాగా మార్పు చేస్తారు. ఇలా కుద‌ర‌ని ప‌క్షంలో త‌ర్వాత ఎప్పుడైనా కొత్త‌ ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు.
 • ఎన్.ఆర్‌.ఐ కాని వ్య‌క్తి (విదేశీయులు) ఎవ‌రైనా భార‌త్‌కు వ‌చ్చినా తాత్కాలిక అవ‌స‌రాల నిమిత్తం ఎన్‌.ఆర్‌.ఓ ఖాతా తెరిచే వ‌స‌తి అందుబాటులో ఉంది.
 • ఎవ‌రైనా స్థానికుడితో (రెసిడెంట్‌) క‌లిసి, లేదా మ‌రో ప్ర‌వాస భార‌తీయుడితో (ఎన్‌.ఆర్‌.ఐ) క‌లిసి ఉమ్మ‌డిగా ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు.
 • పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులు ఇక్క‌డ ఎన్‌.ఆర్‌.ఓ ఖాతా తెరిచేందుకు ముంద‌స్తు అనుమ‌తులు తీసుకోవాల్సి ఉంటుంది.
 • సేవింగ్స్‌, క‌రెంటు, రిక‌రింగ్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాను తెరిచేందుకు అవ‌కాశం ఉంది.
 • భార‌తీయ మూలాలున్న వ్య‌క్తులు సైతం ఎన్‌.ఆర్‌.ఓ ఖాతా తెరిచేందుకు అర్హులు.
 • ఈ ఖాతాను నిర్వ‌హించేందుకు స్థానికులకు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఇవ్వ‌వ‌చ్చు.

ఎలాంటి లావాదేవీల‌కు అనుమ‌తి ?

 • విదేశాల నుంచి భార‌త్‌కు స‌రైన బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా ఎంతైనా సొమ్ము ఎన్ఆర్ఓ ఖాతాకు బ‌దిలీ చేసేందుకు అనుమ‌తి ఉంది.
 • భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఎన్.ఆర్‌.ఐ 5వేల డాల‌ర్ల వ‌ర‌కు విదేశీ క‌రెన్సీని ఖాతాలో జ‌మ‌చేయ‌వ‌చ్చు. ఇందుకు విధిగా క‌రెన్సీ డిక్ల‌రేష‌న్ ఫామ్‌ను జ‌త‌చేయాల్సి ఉంటుంది.
 • ఓ ఎన్.ఆర్‌.ఓ ఖాతా నుంచి మ‌రో ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేసే అవ‌కాశం ఉంది.
 • స్థిరాదాయాన్నిచ్చే అద్దె, డివిడెండ్లు, పింఛ‌ను లాంటివేవైనా స‌రే, ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాల్లోకి జ‌మ‌చేసుకునేందుకు అనుమ‌తి.
 • ఎన్‌.ఆర్‌.ఐ కు ద‌గ్గ‌రి బంధువులైన స్థానికులెవ‌రైనా బ‌హుమ‌తి రూపంలో ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాలో సొమ్మును భార‌త క‌రెన్సీలో జ‌మ‌చేయ‌వ‌చ్చు.
 • స్థిరాస్తులేమైనా ఉంటే దాన్ని అమ్మ‌డం ద్వారా వ‌చ్చే లాభాల‌ను సైతం ఎన్ఆర్ ఓ ఖాతాకు జ‌మ‌చేసుకోవ‌చ్చు.
 • ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాలోని న‌గ‌దును ఏటా రూ.10ల‌క్ష‌ల వ‌ర‌కు విదేశాలకు త‌ర‌లించే వీలుంది. కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి మాత్ర‌మే ఇది సాధ్యం.
 • ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాలోని సొమ్మును ఉప‌యోగించి సాధార‌ణ ఖ‌ర్చులైన అద్దె , ప‌న్ను చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చు.
 • ఈ ఖాతాలోని సొమ్మును పెట్టుబ‌డుల‌కు సైతం వినియోగించ‌వ‌చ్చు. విదేశాలకు త‌ర‌లించ వీలులేని వాటిపైనే అన్న సంగ‌తి గుర్తుంచుకోవాలి.

వ‌డ్డీపై ప‌న్ను వివ‌రాలు :

 • స్థానికులైన వారి బ్యాంకు పొదుపు ఖాతాల్లో జ‌మ అయ్యే వ‌డ్డీపై ప‌న్ను విధిస్తారు. అయితే మూలం వ‌ద్ద ప‌న్ను కోత జ‌రిపే వెసులుబాటు ఇప్ప‌టికైతే లేదు.
 • ఎన్.ఆర్‌.ఓ పొదుపు ఖాతాకు జ‌మ అయ్యే వ‌డ్డీపై 20శాతం ప‌న్నుతో పాటు అద‌నంగా స‌ర్‌ఛార్జీ విధిస్తారు. దీన్ని మూలం వ‌ద్ద టీడీఎస్ రూపంలో వ‌సూలు చేస్తారు.
 • స్థానికులు, ప్ర‌వాసులు ఖాతా ర‌కానికి సంబంధం లేకుండా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 TTA ను అనుస‌రించి రూ.10వేల వ‌డ్డీపై ప‌న్నుచెల్లించాల్సి వ‌స్తుంది.
 • ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్ల రూపంలో ఉన్న ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాల‌పై జ‌మ‌య్యే వ‌డ్డీపై స్థానికులకూ, ప్ర‌వాసుల‌కు ఇద్ద‌రికీ ఒకే విధంగా ప‌న్ను వ‌ర్తిస్తుంది.
 • స్థానికులకున్న వెసులుబాటు ఏమిటంటే వారు ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను స‌మ‌ర్పించి మూలం వ‌ద్ద ప‌న్ను కోత ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. ఇదే వెసులుబాటు ఎన్‌.ఆర్‌.ఐల‌కు ఉండదు. ఎన్‌.ఆర్‌.ఐల‌కు టీడీఎస్ 20శాతం ప‌డితే, స్థానిక భార‌తీయుల‌కు మాత్రం 10 శాత‌మే.

భార‌త‌దేశం వెలుప‌లికి న‌గ‌దు బ‌దిలీ?

 • ఎన్‌.ఆర్‌.ఓ ఖాతా నుంచి ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేయ‌డాన్ని విదేశాల‌కు న‌గ‌దు త‌ర‌లించ‌డంతో(రెమిటెన్స్‌) స‌మానంగా ప‌రిగ‌ణిస్తారు.
 • సంబంధిత విధానాల‌ను పాటించి మాత్ర‌మే ఇలా న‌గ‌దును త‌ర‌లించాలి.
 • ఇందుకు చార్ట‌ర్డ్ అకౌంటెంట్ (సీఏ) వ‌ద్ద నుంచి ధ్రువీక‌ర‌ణ పొంది బ్యాంకుకు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
 • బ‌దిలీ చేయ‌ద‌ల్చుకున్న న‌గ‌దుకుగాను భార‌త్‌లో ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తే, స‌ద‌రు సొమ్ము పైన స‌రిపోను ప‌న్ను చెల్లించిన‌ట్లుగా సీఏ ధ్రువీక‌రించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly