గ్రూప్ బీమా పాలసీ అంటే ఏమిటి?
గ్రూప్ బీమా ప్లాన్ కు సంబంధించిన ప్రీమియంను ముందుగా సంస్థ చెల్లించి, అనంతరం ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది
ఒకే బీమా పాలసీ కింద అనేక మందికి కవరేజ్ ను అందించడానికి గ్రూప్ బీమా పాలసీలను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. రెండు రకాల గ్రూప్ బీమా పాలసీలు ఉన్నాయి. మొదటిది మీరు పని చేస్తున్న సంస్థ ద్వారా బీమా సంస్థ మీకు గ్రూప్ బీమా పాలసీలను అందిస్తుంది. రెండవది బీమా సంస్థ నేరుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులకు విక్రయిస్తుందని కోటాక్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ బాల సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఉదాహరణకు, మీరు పనిచేస్తున్న సంస్థ మీకు ఆరోగ్య బీమా కవరేజ్ ను అందించినట్లైతే, దానికి సంబంధించిన ప్రీమియంను మీ జీతం నుంచి వసూలు చేయడం లేదా ఉచితంగా అందించడం చేయవచ్చు. అలాగే ఒకవేళ మీరు బీమా క్లెయిమ్ చేసుకున్నట్లైతే, అది మీకు క్యాష్ లెస్ రూపంలో లభించవచ్చు లేదా రీఎంబెర్స్మెంట్ రూపంలో లభించవచ్చు. ఇటువంటి ప్లాన్ లకు ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదు. గ్రూప్ బీమా పాలసీలలో జీవిత బీమా, ఆరోగ్య బీమా లేదా కొన్ని ఇతర రకాల సాధారణ బీమాలు ఏవైనా ఉండవచ్చని టాఫీ ఇన్సూరెన్సు సీఈఓ రోహన్ కుమార్ తెలిపారు.
ఎందుకు ఇవి తక్కువ ప్రీమియంకే లభిస్తాయి?
సాధారణంగా గ్రూప్ బీమా పాలసీలు ఎక్కువ మందికి కవరేజ్ ను అందిస్తాయి, కావున అవి తక్కువ ప్రీమియంకే లభిస్తాయి. గ్రూప్ బీమా ప్లాన్ కు సంబంధించిన ప్రీమియంను ముందుగా సంస్థ చెల్లించి, అనంతరం ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఉద్యోగులు వారి తల్లిదండ్రులను కూడా గ్రూప్ బీమా ప్లాన్ కవరేజ్ కిందకు తీసుకొస్తారు. అలాంటి సందర్భంల్లో ప్రీమియం కొంచం ఎక్కువగా ఉంటుంది. దానిని ఉద్యోగి, యజమాని సమంగా చెల్లించవచ్చునని రెన్యూబై. కామ్ సీఈఓ బాలచందర్ శేఖర్ తెలిపారు.
మీరు కేవలం గ్రూప్ హెల్త్ బీమా ప్లాన్స్ పై మాత్రమే ఆధారపడడం మంచిది కాదు. దానితో పాటు మీ కుటుంబ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వ్యాధులను కవర్ చేసే వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ను కూడా తీసుకోవడం మంచిది.
అంతేకాకుండా, గ్రూప్ హెల్త్ ప్లాన్ లను ఒక వ్యక్తి లేదా కుటుంబ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం కుదరదు. ఎందుకంటే గ్రూప్ పాలసీలు పరిమిత కవరేజ్ ను మాత్రమే కలిగి ఉంటాయి. దీనిలో కేవలం బీమా మొత్తాన్ని మాత్రమే సవరించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కేవలం గ్రూప్ బీమా ప్లాన్ పై మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే, మీరు ఉద్యోగం నుండి నిష్క్రమించినప్పుడు లేదా మీ సంస్థ హెల్త్ కవర్ ను నిలిపివేయాలని నిర్ణయించినప్పుడు, మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా జరిగినట్లయితే, మీరు హెల్త్ కవర్ ను కోల్పోవాల్సి ఉంటుంది.
సిరి లో ఇంకా:
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
Comments
0