ఏ ఫండ్ ఎవ‌రికి అనుకూలం?

పెట్టుబ‌డిచేసేందుకు ఉండే అనుకూల‌త‌ను బ‌ట్టి మూడు కేట‌గిరీల్లో మ్యూచువ‌ల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి.

ఏ ఫండ్ ఎవ‌రికి అనుకూలం?

పెట్టుబ‌డుల‌కు సంబంధించి ప్రాథ‌మిక అవ‌గాహ‌న‌ క‌లిగి ఉండ‌టం మ‌దుప‌ర్ల‌కు చాలా ముఖ్యం. ఏయే ప‌థ‌కాల్లో ఎంతెంత న‌ష్ట‌భ‌యం ఉంటుంది. ఏవిధ‌మైన ప‌థ‌కాలు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌కు క‌చ్చితంగా స‌రిప‌డ‌తాయి లాంటి విష‌యాల‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు సంబంధించి మూడు ర‌కాల ప‌థ‌కాలు అందుబాటులో ఉంటాయి.

  1. ఓపెన్ ఎండెడ్ ఫండ్లు
  2. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లు
  3. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు

ఓపెన్ ఎండెడ్ ఫండ్లు:

ఓపెన్ ఎండెడ్ స్కీము ఫండ్ యూనిట్ల‌ను కొనుగోలు లేదా అమ్మ‌కాలు చేసేందుకు వీలుగా ఉంటుంది. ఎవ‌రైనా ఎప్పుడైనా ఆరోజు ఎన్ఏవీ ధ‌ర‌కు కొనొచ్చులేదా అమ్మోచ్చు. ఈ ఫండ్ కి నిర్ణీత కాల‌ప‌రిమితి ఉండ‌దు. ఓపెన్ ఎండెడ్ ఫండ్ల లో పెట్టుబ‌డి చేసేందుకు మ‌దుప‌ర్లు మార్కెట్ స‌మ‌యంలో ఎప్పుడైనా చేయ‌వ‌చ్చు. దీనికి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానాన్ని ఎంచుకోవ‌చ్చు.

క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లు:

క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లు నిర్ణీత కాల‌ప‌రిమితిని క‌లిగి ఉంటాయి. ఉదాహార‌ణ‌కు 6 ఏళ్లు కాల వ్య‌వ‌ధి క‌ల్గిన  క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ ఆరేళ్ల వ‌ర‌కూ కొన‌సాగుతాయి. అనంత‌రం మ‌దుప‌ర్ల‌కు వారికున్న యూనిట్ల ప్ర‌కారం నిధులు చెల్లిస్తారు. ఫండ్ ఆఫ‌ర్ స‌మ‌యంలో ఈ యూనిట్లు కొనుగోలు చేయాలి.మ‌ధ్య‌లో యూనిట్ల విక్ర‌యం చేయాల‌నుకునేవారు ఎక్స్చేంజీ ద్వారా చేయాలి. కొన్ని ఫండ్ల‌ నిర్వాహ‌కులు మదుప‌ర్ల నుంచి నిర్ణీత స‌మ‌యాల్లో ఎన్ ఏవీ ప్ర‌కారం కొనుగోలు చేస్తారు. సెబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం మ‌దుప‌ర్ల పెట్టుబ‌డి ఉప‌సంహార‌ణ‌కు ఎక్చ్చేంజీ లేదా ఫండ్ నిర్వాహకులు తిరిగి కొనుగోలు ఏదో ఒక‌టి అందుబాటులో ఉండాలి.

ఈటీఎఫ్‌లు:

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను ఏదైనా సూచీని అనుక‌రిస్తూ పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌ను ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌)లు అంటారు. నిఫ్టీ-50, సెన్సెక్స్-30 లాంటి మార్కెట్ సూచీల‌తో పాటు బ్యాంకింగ్ నిఫ్టీ, ఆటో నిఫ్టీ , బీఎస్ఈ మిడ్‌క్యాప్ లాంటి ప్ర‌త్యేక రంగానికి చెందిన‌ సూచీల‌లో కూడా మ‌దుపు చేస్తుంటాయి. సాధార‌ణంగా స‌ద‌రు సూచీ ఏయే రంగాల‌కు చెందినవైతే వాటి పేరును ఈటీఎఫ్ పేరులో క‌లిపి పెడుతుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు నిఫ్టీ బ్యాంకింగ్ ఈటీఎఫ్, బ్యాంకింగ్ సూచీ ని అనుక‌రిస్తూ పెట్టుబ‌డి చేస్తుంది ఇది. వ్య‌వ‌హారికంగా దీన్ని బ్యాంకింగ్ ఈటీఎఫ్ అంటారు. మ్యూచువ‌ల్ ఫండ్లతో పోలిస్తే ఇవి త‌క్కువ నిర్వ‌హాణ రుసుమును వ‌సూలు చేస్తాయి. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ‌వుతుంటాయి. కాబ‌ట్టి వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు అంటారు.

ఎవ‌రికి ఏ ఫండ్ స‌రిపోతుంది?

మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం బ‌ట్టి ఎంచుకోవాలి. ఓపెన్ ఎండ్ ఫండ్లు సాధార‌ణంగా క్రియాశీల‌కంగా నిర్వ‌హించే ఫండ్లు వీటిలో రాబ‌డి ఎక్కువ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. దీని నిర్వ‌హ‌ణ‌కు రుసుము కొంత ఎక్కువ‌గా ఉంటుంది. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లు ఇవి నిర్ణీత కాలం వ‌ర‌కూ కొన‌సాగుతాయి. పెట్టుబ‌డి కొంత కాలంపాటు స్థిరంగా ఉంచాల‌నుకునే మ‌దుప‌ర్లు ఇవి ఎంచుకోవ‌చ్చు. వీటిలో న‌ష్ట‌భ‌యం కాస్త త‌క్కువ‌గా ఉంటుంది. నిర్వ‌హ‌ణ రుసుము కూడా తక్కువ‌గా ఉంటుంది. ఈటీఎఫ్ లు అన్నింటికంటే త‌క్కువ నిర్వ‌హ‌ణ రుసుమును క‌లిగి ఉంటాయి. ఇవి సాధార‌ణంగా సూచీల‌ను అనుక‌రిస్తూ పెట్టుబ‌డులు చేస్తుంటాయి. కాబ‌ట్టి దాదాపు సంబంధిత సూచీకి ద‌గ్గ‌ర‌గా రాబ‌డి అందుతుంది. వీటిలో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly