మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం ఎంత‌?

స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్లు మార్కెట్ వృద్ధి చెందితే మంచి రాబ‌డిని అందిస్తాయి. కానీ మార్కెట్ల ప‌త‌నం అయితే న‌ష్ట‌భ‌యం వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఎక్కువ‌గానే ఉంటుంది

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం ఎంత‌?

పెట్టుబ‌డి చేసే ముందు మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం అంచ‌నా వేసుకోవాలి. దీనికి వివిధ సంస్థ‌లు అందించే రిస్క్ ప్రొఫైల‌ర్ (న‌ష్ట‌భ‌యం అంచ‌నా వేసే అప్లికేష‌న్)ల‌ను నింప‌డం ద్వారా మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం అంచ‌నావేసుకోవ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఈక్విటీ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. అయితే ఈక్వీటీ ఫండ్లన్నింటిలో రిస్క్ ఒకే విధంగా ఉండ‌దు. కొన్ని ఈక్విటీ పండ్ల‌లో రిస్క్ త‌క్కువ‌గాను, మ‌రికొన్నింటిలో ఎక్కువ‌గానూ ఉంటుంది.

యాక్టివ్, ప్యాసివ్ ఫండ్లు:

యాక్టివ్ ఫండ్ల మేనేజ‌ర్లు మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా షేర్ల‌ను ఎంపిక చేసి పోర్టుఫోలియోను రూపొందిస్తార‌ని మ‌నం భావిస్తాం. వారి ప‌నిత‌నం ఆధారంగా ఫండ్ రాబ‌డి ఉంటుంది. కాని కొన్ని సంద‌ర్భాల‌లో వారి అంచానాలు త‌ప్పు కావ‌చ్చు. మంచి ప‌థ‌కాలుగా కొన‌సాగుతున్న‌వి కూడా ఫండ్ మేనేజ‌ర్ల నిర్ణ‌యాల త‌ప్ప‌డం వ‌ల్ల రాబ‌డిలో హెచ్చ‌త‌గ్గులు ఉండొచ్చు. కాబ‌ట్టి వీటిలో న‌ష్ట‌భ‌యం
కాస్త ఎక్కువ‌గా ఉంటుంది.

ప్యాసివ్ ఫండ్ల విష‌యం చూస్తే ఈక్వీటీ ఫండ్ల‌లో ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌) త‌క్కువ రిస్క్ ఉండే ఫండ్లు. ఫండ్ మేనేజ‌ర్లు సంబంధిత సూచీలో ఉన్న విధంగానే మదుపు చేయడం వ‌ల్ల అవి బెంచ్‌మార్క్ సూచినీ ప్ర‌తిబింబిస్తాయి. వీటిలె వివిధ కేట‌గిరీల‌కు చెందిన ఫండ్లు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ను తీసుకుంటే పెట్టుబ‌డి నిఫ్టీ ఇండెక్స్‌లో ఉండే కంపెనీల్లో పెట్టుబ‌డి చేస్తుంది. నిఫ్టీ, సెన్సెక్స్ మార్కెట్ ఇండెక్స్ ల‌కు అనుగుణంగా పెట్టుబ‌డి చేసే ఇండెక్స్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం స్వ‌ల్పంగానే ఉంటుంది.

క్యాపిట‌లైజేష‌న్ ఆధారంగా పెట్టుబ‌డి చేసే మ్యూచువ‌ల్ ఫండ్లు: మ్యూచువ‌ల్ ఫండ్లు లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఎక్కువ మొత్తంలో పెట్ట‌బ‌డులు పెట్ట‌డం వ‌ల్ల‌ త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉంటాయి. మార్కెట్ క్యాపిలైజేష‌న్ లో తొలి 100 సంస్థ‌ల‌ను లార్జ్ క్యాప్ కంపెనీలుగా ప‌రిగ‌ణిస్తారు. సాధారంగా ఇవి మార్కెట్ సూచీల‌కు అనుగుణంగా క‌ద‌లిక‌ల‌ను క‌లిగి ఉంటాయి. వీటిలో అస్థిర‌త కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం కొంత అధికంగా ఉంటుంది. వీటిలో అస్థిర‌త అధికంగా ఉంటుంది. వీటిలో మార్కెట్ అనుకూలంగా ఉన్న‌పుడు లాభాలు అధిక‌మే, ప్ర‌తికూలంగా ఉన్న‌పుడు న‌ష్టాలు అధికంగానే ఉంటాయి.

థిమేటిక్, సెక్టార్ పండ్లు:మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌లో థిమేటిక్, సెక్టార్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గానే ఉంటుంది. మౌళిక స‌దుపాయ‌ రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంబంధింత రంగాల్లో పెట్టుబ‌డి చేసే వాటిని సెక్టార్ ఫండ్లు అంటారు. సెక్టార్ ఫండ్ ఒక‌టి లేదా రెండు రంగాల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెడుతుంది. ఒక థీమ్ ఆధారంగా పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌ను థిమాటిక్ ఫండ్లు అంటారు. సెక్టార్ ఫండ్లలోలా నిర్ధిష్ట రంగాల‌లోనే కాకుండా వివిధ రంగాల‌కు చెందిన కంపెనీల్లో మ‌దుపుచేసేందుకు వీలుంటుంది. ఎంచుకున్న రంగాలు,కంపెనీల షేర్లు బాగా రాణిస్తే సెక్టార్, థిమేటిక్ ఫండ్లు అధిక రాబ‌డి నిచ్చే అవ‌కాశం ఉంది. వీటిలో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. అయితే వీటిలో పెట్టుబడి చేసే వారు ఈ త‌ర‌హా ఫండ్ల‌లో ఎప్ప‌డు పెట్టుబ‌డి పెట్టాలి? ఎప్పుడు విర‌మించుకోవాలి అనే విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. స‌ద‌రు రంగం అభివృద్ధి చెందితే మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు రాబ‌డి బావుంటుంది. లేదంటే అధికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం కూడా ఉంటుంది.

ప్రతి మ్యూచువల్ ఫండ్ ఫ‌థ‌కంలోనూ కొంత రిస్క్ ఉంటుంది. అధిక రాబ‌డులు పొందాల‌నుకునే వారు కొంచెం రిస్క్ తీసుకోక త‌ప్ప‌దు. అయితే ఈక్వీటీ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తూ న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. దీర్ఘ కాలం పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా వీటిలో న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly