జాతీయ పొదుపు ప‌త్రాలు-తాజా వ‌డ్డీ రేట్లు, ప‌న్ను ప్ర‌యోజ‌నాల వివ‌రాలు

జాతీయ పొదుపు ప‌త్రాల పెట్టుబ‌డుల‌పై, పీపీఎఫ్‌తో స‌మానంగా వ‌డ్డీ ల‌భిస్తుంది

జాతీయ పొదుపు ప‌త్రాలు-తాజా వ‌డ్డీ రేట్లు, ప‌న్ను ప్ర‌యోజ‌నాల వివ‌రాలు

నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్(ఎన్ఎస్‌సీ)… పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో ఇదీ ఒక‌టి. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కంపై ప్ర‌స్తుతం 7.9 శాతం వ‌డ్డీని చెల్లిస్తున్నారు. ప్ర‌సిద్ధి చెందిన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కం అయిన పీపీఎఫ్‌తో స‌మానంగా ఈ ప‌థ‌కంలో కూడా వ‌డ్డీ ల‌భిస్తుంది. రాబ‌డిపై ఖ‌చ్చిత‌మైన హామీ ఉంటుంది. 5 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ క‌లిగిన ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పీపీఎఫ్‌తో పాటు మిగిలిన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌పై వర్తించే వ‌డ్డీ రేట్ల‌ను ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధ‌రిస్తుంది. అయితే ఎస్ఎస్‌సీలో పెట్టుబ‌డి పెట్టిన రోజున ఏ వ‌డ్డీ అమ‌లులో ఉందో… అదే వ‌డ్డీ రేటును కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కు కొన‌సాగిస్తారు.

జాతీయ పొదుపు ప‌త్రాల గురించి 10 ముఖ్య విష‌యాలు:

 1. కొత్త‌గా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టే వినియోగ‌దారుల‌కు తాజా వ‌డ్డీ 7.9 శాతం వ‌ర్తిస్తుంది. వార్షికంగా వ‌డ్డీ కాంపౌండ్ అవుతుంది.

 2. ఎన్ఎస్‌సీలో రూ.100 పెట్టుబ‌డి పెడితే 5 ఏళ్ళ కాల‌ప‌రిమితి అనంత‌రం రూ.146.25 ల‌భిస్తుంది.

 3. ఒక జాతీయ పొదుపు ప‌త్రం కొనుగోలుకు క‌నీసం రూ.100 పెట్టుబ‌డి పెట్టాలి. 100 గుణిజాల‌లో ఎంతైనా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.
  అక్టోబ‌రు-డిసెంబ‌రు2019 మ‌ధ్య జారీ చేరిన రూ. 100 డినామినేష‌న్ స‌ర్టిఫికేట్‌పై 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి ఈ దిగువ‌ ప‌ట్టిక‌లో చూపించిన విధంగా రాబ‌డి శాతం వ‌స్తుంది.
  nsc.jpg

 4. గ‌రిష్ట ప‌రిమితి లేదు.

 5. పెట్టుబ‌డి దారుల‌కు ప్ర‌తీ సంవ‌త్స‌రం వ‌డ్డీ చెల్లించ‌రు. అయితే వ‌డ్డీ మొత్తం అస‌లుకు క‌లుపుతారు. 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్‌-పిరియడ్ ఉంటుంది. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో(పెట్టుబ‌డి దారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు లేదా జ‌ప్తు వంటి స‌మ‌యంలో కోర్టు ఆదేశించిన‌ప్పుడు) మాత్ర‌మే ముందుస్తు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌ను అనుమ‌తిస్తారు.

 6. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1.5లక్ష‌ల వరకు చేసే డిపాజిట్లకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. స్థూల ఆదాయం నుంచి ప‌న్ను వ‌ర్తించ‌ని ఆదాయాన్ని తీసివేయ‌గా మిగిలిన ప‌న్ను వ‌ర్తించే ఆదాయంపై మిన‌హాయింపు ల‌భిస్తుంది.

 7. ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం ఎన్ఎస్‌సీలో వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు. అయితే వార్షికంగా వ‌చ్చే వ‌డ్డీ ఆదాయాన్ని త‌రువాతి సంవ‌త్స‌రానికి తిరిగి పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు చూపిస్తారు. ఈ మొత్తంపై కూడా సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే గ‌రిష్ట మిన‌హాయింపు ప‌రిమితి రూ.1.5 ల‌క్ష‌లకు మించ‌కూడదు.

 8. ఎన్ఎస్‌సీ, ఆఖ‌రి లేదా ఐద‌వ సంవ‌త్స‌రం వ‌డ్డీని తిరిగి పెట్టుబ‌డి పెట్టేందుకు వీలులేదు. అందువ‌ల్ల ఈ వ‌డ్డీపై సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు క్లెయిమ్ చేసేందుకు వీలులేదు.

 9. ఆఖ‌రి సంవ‌త్స‌రం వ‌డ్డీని ఎన్ఎస్‌సీ పెట్టుబ‌డిదారుల ఆదాయానికి చేర్చి, వారికి వ‌ర్తించే స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు.

 10. జాతీయ పొదుపు ప‌త్రాల‌ను సెక్యూరిటీగా ఉంచి రుణ స‌దుపాయం పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly