విద్యకు ఏపీ ప్రభుత్వ పథకాలు
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యకు సంబంధించి అమ్మఒడి పథకం, జగనన్న విద్యా దీవెన రెండు కొత్త పథకాలను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభకు రూ.2.27 లక్షల కోట్ల బడ్జెట్ ను సమర్పించింది. రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. కేటాయింపులు పెంచడంతోపాటు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్లో 34.87% నిధులను పెంచింది. మొత్తం బడ్జెట్లో 14.31% నిధులను విద్యకు కేటాయించింది. సాంకేతిక విద్య మినహా మొత్తంగా విద్యకు రూ.32,618.46 కోట్లు ఇచ్చింది.
జగనన్న అమ్మఒడి: పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు విద్యార్థులను పంపే తల్లులకు జగనన్న అమ్మఒడి కింద రూ.15వేలు ఇవ్వనున్నారు. ఇందుకు బడ్జెట్లో రూ.6,455 కోట్లను కేటాయించారు. పిల్లలను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు బడులు, జూనియర్ కాలేజీల్లో చదివించే పేద తల్లికి ఏడాదికి రూ. 15,000 ప్రోత్సాహకం అందించనున్నారు. పిల్లలను బడులకు, కాలేజీలకు పంపిస్తున్న పేద తల్లులను ఎంపిక చేసేందుకు తెల్లరేషన్ కార్డు ఉండాలి. ఈ పథకం జనవరి 26 నుంచి అమలవుతుంది. చదువుల భారం తగ్గి పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయి. చదువు మధ్యలో మానెయ్యటం తగ్గుతుంది. బాలకార్మిక సమస్యా తగ్గుతుంది.
జగనన్న విద్యా దీవెన పథకం: విద్యార్థులు ప్రైవేటు వసతిగృహాల్లో ఉంటే ఏటా రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ ఖర్చవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వసతి, ప్రయాణం, పుస్తకాలు, భోజనాలకు ప్రతి విద్యార్థికీ ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు పూర్తిగా బోధన రుసుముల చెల్లింపు, భోజనం, ప్రయాణం, వసతి, పుస్తకాలకు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.20వేలు ఇవ్వనున్నారు. ఇందుకు రూ.4,962.3 కోట్లు కేటాయించారు. వి ఈ పథకంలో ప్రైవేటు వసతి గృహాల్లోని వారికి దాదాపు సగం భారం తగ్గుతుంది.
బోధన రుసుముల పూర్తి చెల్లింపు: రుసుములను పూర్తిగా చెల్లించి, ఉన్నత చదువులను ప్రోత్సహించాలని తలపెట్టింది. ప్రస్తుతం సాధారణ డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులకు కొన్ని పరిమితులతో బోధన రుసుముల చెల్లింపు జరుగుతోంది. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా వారు ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో పది వేలకు పైగా ర్యాంకులతో కన్వీనర్ కోటా కింద సీటు తెచ్చుకుంటే ఏడాదికి రూ.35 వేలు చెల్లిస్తున్నారు. మిగతా మొత్తాన్ని విద్యార్థులే భరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రుసుము మొత్తాన్ని తానే చెల్లించి, ఉచితంగా ఉన్నత విద్య అందించేలా ఈ కొత్త పథకం తెచ్చింది.
ఇతర బడ్జెట్ కేటాయింపులు: పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులను ఇక నుంచి వైఎస్ఆర్ పాఠశాలల నిర్వహణ నిధిగా పిలవనున్నారు. ఇందుకు రూ.160 కోట్లు చూపారు. పాఠశాలల్లో రెండేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ఏడాది రూ.1500 కోట్లు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం సరఫరా బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా కేంద్రీయ వంటశాలల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు గతేడాది కంటే 6.59% నిధులను అదనంగా నిధులను కేటాయించారు. గతేడాది రూ.2,834.90 కోట్లు కేటాయించగా… ప్రస్తుతం రూ.3,021.63 కోట్లు కేటాయించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.4.29 కోట్లు, డాక్టర్. బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక వర్సిటీకి రూ.4.53 కోట్లు కేటాయించారు. రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక వర్సిటీకి రూ.41.16 కోట్లు, జేఎన్టీయూ అనంతపురానికి రూ.60 కోట్లు, జేఎన్టీయూ కాకినాడకు రూ.38.35 కోట్లు కేటాయించారు. సాంకేతిక వర్సిటీలు మినహా యూజీసీ-2016 వేతన బకాయిలు, సీపీబ్రౌన్ మెమోరియల్ గ్రంథాలయం కడపతో కలిపి మొత్తం విశ్వవిద్యాలయాలకు రూ.1,418.96 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది రూ.818.02 కోట్లు కేటాయించగా… ఈసారి రూ.580.29 కోట్లే ఇచ్చారు.
Comments
0