ఏటీఎంలో క్రెడిట్ కార్డును వినియోగింస్తున్నారా?

అత్యవసర పరిస్థితిలో క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది

ఏటీఎంలో క్రెడిట్ కార్డును వినియోగింస్తున్నారా?

ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఫిబ్రవరి 2018 నుంచి ఫిబ్రవరి 2019 మధ్య క్రెడిట్ కార్డులను వాడుతున్న వారి సంఖ్య దాదాపు 25 శాతం పెరిగింది. అదే సమయంలో, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంల ద్వారా నగదును ఉపసంహరించుకునే వారి సంఖ్య కూడా 15 శాతం పెరిగింది. అత్యవసర పరిస్థితిలో క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అయితే చాలా మంది ఏటీఎం ద్వారా ఉపసంహరించుకున్న మొత్తాన్ని వడ్డీ రహిత సమయంలోగా తిరిగి చెల్లించవచ్చుననే భావనలో ఉంటారు. కానీ అందులో నిజం లేదు.

మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏదైనా దుకాణంలో చేసిన లావాదేవీపై వర్తించే వడ్డీ రేటు, ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణపై విధించే వడ్డీ రేటు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది.

వడ్డీ ఎలా విధిస్తారు?

మీరు ఏదైనా వ్యాపార దుకాణాల్లోని పాయింట్ అఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్ల వద్ద గానీ లేదా ఆన్ లైన్ లావాదేవీల కోసం మీ క్రెడిట్ కార్డును వినియోగించినట్లైతే, దానికి సంబంధించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వడ్డీ రహిత సమయం ఉంటుంది. సాధారణంగా వడ్డీ రహిత సమయం అనేది 45 రోజుల వరకు ఉండవచ్చు. ఒకవేళ ఈ సమయం ముగిసేలోగా చెల్లింపు చేయకపోతే, అప్పుడు వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు వ్యయం ఆధారంగా చాలా బ్యాంకులు నెలకు 2 నుంచి 3 శాతం వడ్డీని వసూలు చేస్తాయి, ఇది సంవత్సరానికి 24 నుంచి 36 శాతంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒక నెలలో రూ. 10,000 ఖర్చు చేశారనుకుందాం, మీరు సదరు బకాయిలను గడువు తేదీలోగా చెల్లించినట్లైతే, అదనపు చార్జీలు లేదా వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అయితే, మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించుకున్న సందర్భంలో మాత్రం ఈ 45 రోజుల వడ్డీ రహిత సమయం వర్తించదు. మీరు నగదును ఉపసంహరించుకున్న రోజు నుంచి వడ్డీ విధిస్తారు. ప్రతి నగదు ఉపసంహరణపై చార్జీలను కూడా బ్యాంకులు వసూలు చేస్తాయి. సాధారణంగా ఈ చార్జీలు మీరు ఉపసంహరించుకున్న మొత్తంలో 2 నుంచి 3 శాతం వరకు ఉంటాయి లేదా ఒకటే మొత్తం కూడా ఉండవచ్చు. అలాగే, నగదు ఉపసంహరణలపై రివార్డ్ పాయింట్లు కూడా లభించవు.

పైన తెలిపిన ఉదాహరణ ప్రకారం, మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా రూ. 10,000 ఉపసంహరించుకుని, నెల రోజుల తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లైతే, మీరు కనీసం రూ. 500 నుంచి రూ. 600 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అదే సంవత్సరానికి అయితే, ఈ మొత్తం రెట్టింపు కావచ్చు.

ఉపసంహరణ :

సాధారణంగా నగదు ఉపసంహరణ పరిమితి అనేది మీ మొత్తం క్రెడిట్ కార్డు పరిమితిపై ఆధారపడి ఉంటుంది. మీ కార్డు రకం, క్రెడిట్ పరిమితి ఆధారంగా నగదు ఉపసంహరణ పరిమితిని బ్యాంకు నిర్ణయిస్తుంది. సాధారణ క్రెడిట్ కార్డులు 10 శాతం కంటే తక్కువ నగదు ఉపసంహరణ పరిమితిని కలిగి ఉంటాయి. అదే ప్రీమియం క్రెడిట్ కార్డులైతే సుమారు 30 శాతం వరకు నగదు ఉపసంహరణ పరిమితిని కలిగి ఉంటాయి. మీరు చేసే ఖర్చులు లేదా క్రెడిట్ ప్రొఫైల్ లోని మార్పుల ఆధారంగా బ్యాంకు మీ క్రెడిట్ పరిమితిని పెంచడం లేదా తగ్గించడం చేయవచ్చు.

మీరు ఏమి చేయాలి?

కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీకు నగదు అవసరమైనప్పుడు, క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించుకోవడం సాధ్యమవుతుంది. కానీ ఒకవేళ అవకాశం ఉంటే నగదు ఉపసంహరణకు బదులుగా మీ క్రెడిట్ కార్డును స్వైప్ చేయడానికి ప్రయత్నించండి.

ఇప్పటికీ మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదును ఉపసంహరించుకోవాలని అనుకున్నట్లైతే, బిల్లు జనరేట్ అయ్యే వరకు వేచి ఉండకుండా, వీలైనంత త్వరగా చెల్లింపు చేయడం మంచిది. ఒకవేళ మీరు ఉపసంహరించుకున్న మొత్తం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, మీరు బ్యాంకును సంప్రదించి మీ క్రెడిట్ కార్డు బకాయిని వ్యక్తిగత రుణంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది వాస్తవానికి పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి కొత్త రుణం తీసుకున్నట్లుగా ఉంటుంది, కానీ వ్యక్తిగత రుణ వడ్డీ రేటు, క్రెడిట్ కార్డుపై విధించే వడ్డీ రేటుతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు సంవత్సరానికి 10 నుంచి 12 శాతంగా ఉంటుంది. అదే క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు సంవత్సరానికి 24 నుంచి 36 శాతంగా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly