ఇకపై నామినేషన్ కు ఆధార్ తప్పనిసరి..

నామినేషన్ లో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆధార్ నెంబర్ తప్పనిసరి అని ఈపీఎఫ్ఓ తెలిపింది

ఇకపై నామినేషన్ కు ఆధార్ తప్పనిసరి..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఈ-నామినేషన్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం, నామినీలు అందరూ తమ ఆధార్ కార్డు నంబర్లను తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ లో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆధార్ నెంబర్ తప్పనిసరి అని ఈపీఎఫ్ఓ విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది.

ఈపీఎఫ్ఓ తన వెబ్‌సైట్‌లో కొత్త ఈ-నామినేషన్ కార్యాచరణను ప్రారంభించింది, దీనిలో మీ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం ఒక్కటే కాకుండా, మీరు నమోదు చేసే నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు నంబర్‌ను కూడా సమర్పించాలి.

ఆధార్‌తో పాటు మీ నామినీ స్కాన్డ్ ఫోటో, వారి పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను కూడా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నామినీకి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను కూడా సమర్పించవచ్చు, కానీ ఇది తప్పనిసరి కాదు.

యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ను ఆధార్‌తో అనుసంధానించిన వారికి మాత్రమే ఈ-నామినేషన్ సౌకర్యం లభిస్తుంది.

నోటిఫికేషన్ ను జారీ చేసిన రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి. రంగనాథ్ మాట్లాడుతూ, ఈ కార్యాచరణను పెన్షన్ క్లెయిమ్ ఫారం, నామినీ క్లెయిమ్ ఫారమ్‌కు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు.

ఉద్యోగుల పెన్షన్ పథకం కింద, నెలవారీ పింఛను పొందటానికి ఫారం 10డీ ని ఉపయోగిస్తారు, అలాగే కాంపోసిట్ క్లెయిమ్ ఫారం 10డీ/20/51ఎఫ్ లను ఈపీఎఫ్ ఖాతాదారుడి మరణం తరువాత క్లెయిమ్ వేయడానికి నామినీలు ఉపయోగిస్తారు.

సిస్టంలో నమోదైన నామినేషన్, ఆన్‌లైన్ పెన్షన్ క్లెయిమ్ ను సులభంగా దాఖలు చేసే వీలు కల్పిస్తుందని, అలాగే ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించినట్లైతే, అతను లేదా ఆమె నామినీ, అతను లేదా ఆమె ఆధార్ తో లింక్‌ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్ క్లెయిమ్ ను దాఖలు చేయవచ్చునని నోటిఫికేషన్ తెలిపింది.

ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో కొత్త ఈ-నామినేషన్ సౌకర్యం కింద, మీ కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డులు ఉన్నట్లయితే, వాటి వివరాలను అందించవచ్చు.

ఒకవేళ మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేనప్పటికీ, ఈపీఎస్ నామినేషన్ ను నమోదు చేయవచ్చు.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ వర్చువల్ ఆధార్ ఐడీని ఉపయోగించి ఈ-సైన్ చేయమని అడుగుతుంది, అది యూఐడీఏఐ పోర్టల్‌ పై ఆన్‌లైన్‌లో జనరేట్ అవుతుంది. మీరు జనరేట్ చేసిన పీడీఎఫ్ ఫైల్ ప్రింటౌట్ ను తీసుకొని, దానిపై సంతకం చేసి యజమానికి సమర్పించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly