ఆన్‌లైన్ షాపింగ్‌లో కొన్ని జాగ్ర‌త్త‌లు

త్వ‌ర‌గా కొనుగోళ్లు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను సేవ్ చేసి ఉంచుతున్నారా?

ఆన్‌లైన్ షాపింగ్‌లో కొన్ని జాగ్ర‌త్త‌లు

పండ‌గ సీజ‌న్ వ‌చ్చేసింది… దీంతో ఇప్ప‌టికే వివిధ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ‌లు డిస్కౌంట్ సేల్ మొద‌లు పెట్టాయి. పండ‌గ షాపింగ్ గురించి ఎక్క‌డైనా చ‌ర్చ జ‌రిగితే ఈ వెబ్‌సైట్ లో డిస్కౌంట్ 20 శాతం, అంటే మ‌రొక దానిలో 40 శాతం అని అనుకుంటున్నారు. దీంతో ఎప్పుడూ ఆన్‌లైన్ షాపింగ్ ప్ర‌క‌ట‌నలు చూసి వ‌దిలేయ‌డం త‌ప్ప షాపింగ్ చేయ‌ని రాజుకి ఒక్క‌సారి ఆ రాయితీలేంటో చూసి బావుంటే పండ‌గ షాపింగ్ ఇంటినుంచే చేసేద్దామ‌ని అనుకున్నాడు. ఒక షాపింగ్ వెబ్‌సైట్ తెరిచాడు… త‌న‌కు కావ‌ల్సిన వ‌స్తువును ఎంచుకున్నాడు… రాజుకి కొంత అనుమానం క‌లిగి అదే వ‌స్తువును వేరే వెబ్‌సైట్ లో ధ‌ర‌ను చెక్ చేసుకున్నాడు. అందులో కంటే ఇక్క‌డే త‌క్కువ ధ‌ర ఉండ‌టంతో రాజు కాస్త ఆనందంతో ఆన్‌లైన్ ఆఫ‌ర్ల‌న్నీ అయిపోతాయేమో అన్నంత ఆతుర‌త‌గా అంగ‌ట్లో అన్నింటిని జ‌ల్లెడ ప‌ట్టి కొన్నింటిని ఎంచుకున్నాడు. ఆన్ లైన్ లో కొనాలంటే క్యాష్ ఆన్ డెలివ‌రీ ఆప్ష‌న్ ఉన్నా దానికి ఆఫ‌ర్లు వ‌ర్తించ‌ట్లేద‌ని అర్థం అయింది. అప్ప‌టివ‌ర‌కూ ఎవ్వ‌రికీ చూపించ‌ని త‌న డెబిట్ కార్డును బ‌య‌టికి తీసి వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి షాపింగ్ చేశాడు. ఇక్క‌డి వ‌ర‌కూ ఒక లెక్క‌… ఇక్క‌డి నుంచి ఇంకో లెక్క‌… లెక్కంటే డ‌బ్బు గురించి సంబంధించిందే. రాజులాగే చాలా మంది వినియోగ‌దారులు ఆన్‌లైన్ కొనుగోళ్లు చేస్తుంటారు. డెబిట్ కార్డు ద్వారా ఏటీఎమ్ లో న‌గ‌దు లావాదేవీలు చేయ‌డంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఆన్‌లైన్ లావాదేవీల్లో మోసాల‌కు గుర‌వుతున్నారు. అయితే పెరుగుతున్న సైబ‌ర్ నేరాలు చూస్తుంటే ఆన్‌లైన్ షాపింగ్ విష‌యంలో కొంత జాగ్ర‌త్త అవ‌స‌ర‌మ‌ని తెలుస్తోంది.

ఆన్ లైన్ కొనుగోలు దార్లు తీసుకోవాల్పిన జాగ్ర‌త్త‌లు:

  • అన్నిఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ల లో డెబిట్, క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను సేవ్ చేయ‌కండి. సుర‌క్షిత‌మైన వెబ్‌సైట్ల లోనే లావాదేవీలు చేయండి. https:// లేదా లాక్ సింబ‌ల్ ఉన్న యూఆర్ఎల్ ప్రారంభంలో ఉంటే వాటిని సుర‌క్షిత‌మైన వాటిగా ప‌రిగ‌ణించాలి.
  • క్రెడిట్ కార్డు లేదా డెబిట్ లావాదేవీల‌ను గ‌మ‌నిస్తుండండి. అందులో మీకు సంబంధంలేకుండా ఏవైనా లావాదేవీలు జ‌రిగాయ‌ని గుర్తిస్తే వెంట‌నే బ్యాంకు వారిని సంప్ర‌దించి కార్డును బ్లాక్ చేయించండి. స‌ద‌రు లావాదేవీల‌కు సంబంధించి పోలీసు క్లంప్లైంట్ చేయండి.

విలియ‌మ్ డే గ్రూట్ డ‌చ్ సైబ‌ర్ సెక్యురిటీ ప‌రిశోధ‌కుడు ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ల ద్వారా చేసే విక్ర‌యాలు, స‌మాచార భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌తో కూడిన నివేదిక‌ను రూపొందించారు. నివేదిక‌లో అంశాలు.

సేవ్ చేసి ఉంచుతున్నారా?

చాలా మంది త్వ‌ర‌గా కొనుగోళ్లు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని త‌మ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను సేవ్ చేసి ఉంచుతున్నారు. ఆ వెబ్‌సైట్ లో మాల్వేర్ ఉన్న‌ట్ల‌యితే మీ కార్డు స‌మాచారం అప‌హ‌ర‌ణ‌కు గుర‌వుతుంది. కార్డు వివ‌రాలు సేవ్ చేయ‌కున్నా వినియోగ‌దార్లు షాపింగ్ చేసే వెబ్‌సైటులో మాల్వేర్ ఉన్న‌ట్ట‌యితే స‌ద‌రు కార్డు వివ‌రాలు అప‌హ‌ర‌ణ‌కు గుర‌వుతాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 7000 ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ల లో డేటాను త‌స్క‌రించే మాల్వేర్ ఉన్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.

ఈ కామ‌ర్స్ సైట్లే ల‌క్ష్యంగా:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ర‌కాల ఈ కామ‌ర్స్ సైట్లను ల‌క్ష్యంగా చేసుకుని సైబ‌ర్ నేరాలు చేస్తున్నారు.చాలా వెబ్‌సైట్ల‌లో ఈ మాల్వేర్ ను చొప్పించి వినియోగ‌దారుల యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్ త‌దిత‌ర ముఖ్య‌మైన వివ‌రాల‌ను అప‌హ‌రిస్తుంటారు. మెజెంటో సాఫ్ట్ వేర్ ద్వారా మెజెంటాకోర్ మాల్వేర్ గ‌త ఆరు నెల‌ల కాలంలో 7,339 ఆన్ లైన్ స్టోర్ల లోకి చేరింద‌ని వెల్ల‌డించింది. ప్ర‌తీ రోజు స‌గ‌టున 50 వెబ్‌సైట్లు ఈ మాల్వేర్ బారిన ప‌డుతున్న‌ట్లు ఈ నివేదిక వెల్ల‌డించింది.

ఎలా ప‌నిచేస్తుందంటే:

ఈ మాల్వేర్ అడ్మిన్ ప్యానెల్ మీద దాడిచేసి దాని పాస్ వ‌ర్డ్ ను క్రాక్ చేస్తుంది. అనంత‌రం ఈ మాల్వేర్ హెచ్‌టీఎమ్ఎల్ కోడ్ ద్వారా వెబ్ సైట్ లోకి వెళ్తుంది. ఇది వినియోగ‌దారులు కీ స్ట్రోక్స్ ( వినియోగ‌దార్లు కీబోర్డు పై నొక్కిన పూర్తి వివ‌రాలు) ను హ్యాక‌ర్ మెయిన్ స‌ర్వ‌ర్ కు చేర‌వేస్తుంది. దీంతో వినియోగ‌దార్ల వివ‌రాల‌న్నీ తెలుసుకుంటారు. 2,20,000 వెబ్‌సైట్ల లో 4.2శాతం వినియోగ‌దార్ల డేటాను లీక్ అయి ఉండొచ్చ‌ని ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు

ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ల లో వివ‌రాలు సేవ్ చేసుకోవ‌డం మంచిది కాదా? వినియోగ‌దార్ల భ‌ద్ర‌త ప‌రంగా చూస్తే తాము షాపింగ్ చేసే వెబ్‌సైట్ విశ్వ‌స‌నీయ‌త‌, బ్రాండ్ త‌దిత‌ర అంశాల‌ను దృష్టిలో ఉంచుకోవాలి. సైబ‌ర్ సెక్యూరిటీ ప‌రంగా నిబంధ‌న‌లు పాటించే ఈ కామ‌ర్స్ కంపెనీల్లో వినియోగ‌దార్లు త‌మ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివ‌రాల‌ను సేవ్ చేసుకున్నా ఫ‌ర్వాలేద‌ని నిపుణులు అంటున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly