గృహ‌రుణాన్ని ముందుగా తీర్చాల‌నుకుంటున్నారా? అయితే ఇది చ‌ద‌వండి

ముంద‌స్తు బ్యాంకు రుణాల చెల్లింపుల‌పై విధివిధానాలు, ప్ర‌యోజ‌నాల‌పై ఆస‌క్తిక‌ర క‌థ‌నం.

గృహ‌రుణాన్ని ముందుగా తీర్చాల‌నుకుంటున్నారా? అయితే ఇది చ‌ద‌వండి

గృహ రుణాలను తిరిగి చెల్లించేట‌ప్పుడు సుల‌భ వాయిదా విధానాన్ని ఎంచుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఎటొచ్చీ వాయిదాలు చెల్లించేట‌ప్ప‌డే క‌ష్టంగా అనిపిస్తుంటుంది. జీవ‌న విధానం ఎప్పుడూ ఒకే విధంగా ఉండ‌దు క‌దా! ఒక్కోసారి మ‌న ద‌గ్గ‌ర ఎక్కువ డ‌బ్బు చేతిలో ఉండ‌వ‌చ్చు. మ‌రో సారి క‌నీసం వాయిదా చెల్లించేందుకు త‌గినంత సొమ్ము అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలా మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడే రుణాన్ని త్వ‌ర‌గా తీర్చుకొని రుణ‌భారాన్ని త‌గ్గించుకోవాల‌నే ఆశ స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవికి ఉంటుంది. రుణ వాయిదాల చెల్లింపు మొద‌లైన 6 నెల‌ల త‌ర్వాత నుంచి ముంద‌స్తు రుణ చెల్లింపుల‌ను బ్యాంకులు అంగీక‌రిస్తాయి. అయితే ష‌ర‌తుల‌తోనే సుమా!

ముంద‌స్తు రుణ చెల్లింపు కోసం :

  1. ఆన్‌లైన్ ద్వారా ముంద‌స్తు రుణ‌చెల్లింపుపై అభ్య‌ర్థన చేసుకునే సానుకూల‌వకాశాలు.
  2. బ్యాంకు శాఖ‌కు నేరుగా వెళ్లి మేనేజ‌ర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు
  3. బ్యాంకు మేనేజ‌ర్‌కు ఫోన్ చేసి ముంద‌స్తు రుణ చెల్లింపు గురించి అడ‌గ‌వ‌చ్చు

ఈ సంద‌ర్బాల్లో ముంద‌స్తు రుణ చెల్లింపు కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు

  • మీ ద‌గ్గ‌ర త‌గినంత డ‌బ్బు ఉండి సంపాద‌న సామ‌ర్థ్యం బాగా ఉన్న‌ప్పుడు
  • దీర్ఘకాలంలో చెల్లించే వ‌డ్డీ ఎక్కువ అని భావించి నిక‌ర వ‌డ్డీని త‌గ్గించుకోవాల‌ని భావించిన‌ప్పుడు
  • అనుకున్న‌ గ‌డువు కంటే ముందే ఆస్తిని మీ స్వాధీనంలోకి తెచ్చుకోవాల‌ని భావించిన‌ట్ల‌యితే

ముంద‌స్తు చెల్లింపున‌కు పెనాల్టీ:

బ్యాంకులు దీర్ఘ‌కాలిక రుణాలివ్వ‌డంలో ఉన్న ప్ర‌ధాన ఉద్దేశం వ‌డ్డీ ద్వారా ఆదాయం స‌మ‌కూర్చుకోవ‌డం. దీర్ఘ‌కాలిక రుణాల మీద వ‌డ్డీ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల బ్యాంకుకు లాభం అదే స్థాయిలో ఉంటుంది. రుణ గ్ర‌హీత ముందే రుణం చెల్లించాల‌నుకుంటే బ్యాంకు లాభ‌దాయ‌క‌త మీద ప్ర‌భావం ప‌డుతుంది. అందుకే బ్యాంకులు ముంద‌స్తు చెల్లింపుల‌ను నిరుత్సాహ‌ప‌రిచేందుకు చెల్లింపు మొత్తంలో కొంత శాతాన్ని పెనాల్టీగా విధిస్తాయి.

ముంద‌స్తు చెల్లింపు వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు:

  • ముంద‌స్తు రుణ చెల్లింపు కార‌ణంగా వ‌డ్డీరూపంలో చెల్లించాల్సిన అధిక మొత్తాన్ని పొదుపు చేయ‌వ‌చ్చు.
  • కాల‌ప‌రిమితి త‌గ్గుతుంది.
  • రుణాన్ని ముంద‌స్తుగా చెల్లించ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోర్ పెరిగే అవ‌కాశం

ముంద‌స్తు చెల్లింపు చేయాలా… వ‌ద్దా…

ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డ‌బ్బు స‌మ‌కూరిన‌ప్పుడు ముంద‌స్తు చెల్లింపు చేయాలా, లేక మ‌రో విధంగా పెట్టుబ‌డులు పెట్టాలా అనే విష‌యంలో సందేహం త‌లెత్తడం స‌హ‌జ‌మే. ఇలాంటి స‌మ‌యంలో గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను, పెట్టుబ‌డి మీద వ‌చ్చే వ‌డ్డీ రేట్ల‌ను(ప‌న్నులు తీసివేసి) పోల్చుకోవాలి.

అన్ని బ్యాంకులు ముంద‌స్తు చెల్లింపున‌కు అనుమ‌తించే అవ‌కాశం లేదు. రిజ‌ర్వ్ బ్యాంకు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫ్లోటింగ్ వ‌డ్డీ రేటు క‌లిగిన గృహ రుణాల విష‌యంలో పెనాల్టీ లేకుండా ముంద‌స్తు చెల్లింపున‌కు అనుమ‌తించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరు నెల‌ల స్టేట్‌మెంట్‌ల‌ను బ్యాంకుకు చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా ముంద‌స్తు చెల్లింపు ద్వారా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly