ఏటీఎమ్‌లో డ‌బ్బులు పోయాయా... మ‌ళ్లీ రావా?

ఏటీఎమ్‌లో డ‌బ్బులు డ్రా చేసేట‌ప్పుడు అకౌంట్‌లో డెబిట్ అయిన‌ట్టు చూపిస్తుంది. కానీ, చేతికి సొమ్ము అంద‌దు. ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే ఎవ‌రికి ఫిర్యాదుచేయాలో తెలుసుకుందాం.

ఏటీఎమ్‌లో డ‌బ్బులు పోయాయా... మ‌ళ్లీ రావా?

ఏటీఎమ్‌ల్లో ఒక్కోసారి డ‌బ్బు విత్‌డ్రా చేసిన‌ప్పుడు ఖాతాలో డ‌బ్బు డెబిట్ అవుతుంది కానీ మ‌న‌కు న‌గ‌దు రాక‌పోవ‌చ్చు. ఇలాంటి స‌మ‌స్య‌లు మ‌న‌కూ అప్పుడ‌ప్పుడు ఎదుర‌వుతూ ఉంటాయి. కానీ దీని గురించి ఎవ‌రికి ఫిర్యాదు చేయాలో తెలియ‌దు. ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఏం చేయాలో ఇక్క‌డ తెలుసుకుందాం.

బ్యాంకుకు ఫిర్యాదు చేయ‌డం

ఖాతా క‌లిగిన మాతృశాఖ‌కు వెళ్లి ఫిర్యాదు చేయవ‌చ్చు. లేదా ఏటీఎమ్‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న సద‌రు బ్యాంకు శాఖ‌కు వెళ్లి విష‌యాన్ని తెలియ‌జేయాలి.
ప్ర‌తి బ్యాంకు వారి వారి వెబ్‌సైట్ల‌లో వినియోగ‌దారులు ఎవ‌రికి ఫిర్యాదు చేయాలో వెల్ల‌డిస్తాయి. ఒక్కోసారి ఆన్‌లైన్ కంప్లైంట్ చేసేందుకు అవ‌స‌ర‌మైన లింక్‌ల‌ను ఇస్తారు. అయితే ఎలా ఫిర్యాదు చేసినా ఫిర్యాదుకు సంబంధించిన కాపీని ద‌గ్గర ఉంచుకోవడం మంచిది. ఆర్‌బీఐ ఆదేశాల ప్ర‌కారం ఇటువంటి ఫిర్యాదుల‌ను 7 రోజుల్లోగా ప‌రిష్క‌రించాలి. అలా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే త‌దుప‌రి స్థాయిలో అంబుడ్స్‌మెన్‌కు వెళ్ల‌వ‌చ్చు.

వినియోగ‌దారుడు త‌ప్ప‌క రాసి ఉంచుకోవాల్సిన వివ‌రాలు

  1. ఏటీఎమ్‌ కార్డు జారీ చేసిన బ్యాంకు, శాఖ‌
  2. స‌మ‌స్య త‌లెత్తిన ఏటీఎమ్ బ్యాంక్ శాఖ‌
  3. లావాదేవీ జ‌రిగిన స‌మ‌యం, తేదీ
  4. విత్‌డ్రా చేసేందుకు ప్ర‌య‌త్నించిన న‌గ‌దు వివ‌రాలు
  5. లావాదేవీకి సంబంధించిన ఏదైనా ర‌సీదు ఉంటే అది

బ్యాంకు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే…

బ్యాంకుకు మీ స‌మ‌స్య గురించి వివ‌రంగా చెప్పినా, అన్ని స్థాయిల్లో ఫిర్యాదు చేసినా స‌రైన స‌మాధానం రాక‌పోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ దృష్టికి తీసుకెళ్ల‌వ‌చ్చు. ఆర్‌బీఐ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌లో లేదా పోస్ట్ ద్వారా సైతం ఫిర్యాదును అంబుడ్స్‌మెన్‌కు పంప‌వ‌చ్చు. అయితే బ్యాంకుకు రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేసిన 30 రోజుల త‌ర్వాత మాత్ర‌మే అంబుడ్స్‌మెన్‌ను ఆశ్ర‌యించే వీలుంటుంది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు కింది లింక్‌ను చూడ‌వ‌చ్చు.
https://secweb.rbi.org.in/BO/precompltindex.htm

బ్యాంకులో లావాదేవీకి సంబంధించి ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ ఏటీఎమ్ సంబంధిత శాఖ‌లో తీసుకోవ‌చ్చు. అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేసే స‌మ‌యంలో దీని అవ‌స‌రం ఉంటుంది.

సంఘట‌న జ‌రిగి 7 రోజులైనా డ‌బ్బు తిరిగి పొంద‌క‌పోతే…

ఘ‌ట‌న జ‌రిగి 7 రోజులు దాటినా వినియోగదారుడికి రావాల్సిన డ‌బ్బును బ్యాంకు తిరిగి చెల్లించ‌క‌పోయి ఉంటే, అప్ప‌టి నుంచి రోజుకు రూ. 100 చొప్పున స‌ద‌రు బ్యాంకు ప‌రిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేసి అక్క‌డ కూడా త‌గిన న్యాయం జ‌ర‌గ‌లేద‌ని భావించిన త‌రుణంలో వినియోగ‌దారుల ఫోరంను ఆశ్ర‌యించ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly