రెగ్యుల‌ర్ నుంచి డైరెక్ట్ లోకి మారండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల స్విచ్చింగ్ ప్ర‌క్రియ‌ను ఆన్ లైన్ , ఆఫ్ లైన్ రెండు విధాలుగా మ‌దుప‌ర్లు చేసుకోవ‌చ్చు.

రెగ్యుల‌ర్ నుంచి డైరెక్ట్ లోకి మారండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోని డైరెక్ట్ ప్లాన్ల‌లో బ్రోక‌ర్ క‌మీష‌న్ ఛార్జీలు ఉండ‌వు. అదే రెగ్యుల‌ర్ ప్లాన్ ఇందులో బ్రోక‌ర్ల‌కు క‌మీష‌న్ ఛార్జీలు క‌లిసి ఉంటాయి. కాబ‌ట్టి మీ పెట్టుబ‌డుల‌ను రెగ్యుల‌ర్ నుంచి డైరెక్ట్ ప్లాన్ల‌లోకి మార్చుకోవ‌డం వ‌ల్ల క‌మీష‌న్ ఛార్జీల బాధ త‌ప్ప‌డ‌మే కాకుండా మీ రాబ‌డులు పెరిగే అవ‌కాశ‌మూ ఉంది. డిస్ట్రిబ్యూట‌ర్ అవ‌స‌రం లేకుండా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ నుంచి నేరుగా కొనే ప‌థ‌కాల‌ను డైరెక్ట్ ప్లాన్లు అంటారు. ఇందులో ఏజెంట్ క‌మీష‌న్ ఛార్జీల రూపేణా మిగిలిన మొత్తాన్ని పెట్టుబ‌డిలో భాగం చేస్తారు. దీంతో ఒకే ప‌థ‌కానికి చెందిన‌ డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ రెగ్యుల‌ర్ ప్లాన్ ఎన్ఏవీ కంటే ఎక్కువ‌గా ఉంటుంది. దీని వ‌ల్ల రెగ్యుల‌ర్ ప్లాన్ల‌తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లు కొంత‌ శాతం అధిక రాబ‌డుల‌నిస్తాయి. సొంతంగా మీ ప‌థ‌కాల‌ను నిర్వ‌హించుకోగ‌ల నైపుణ్యం ఉంద‌ని భావిస్తే రెగ్యుల‌ర్ ప్లాన్ల నుంచి డైరెక్ట్ ప్లాన్ల‌లోకి మార‌టం మేలు.

ఏఎమ్‌సీల‌తో లావాదేవీలు జ‌రిపేందుకు మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట‌ర్ అయి ఉంటే మీ మ్యూచువ‌ల్ ఫండ్ ఖాతాలోకి లాగిన్ అవండి. ఈ ఖాతాను మీరు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ నుంచి లేదా డైరెక్ట్ ఆన్‌లైన్ మ్యూచువ‌ల్ ఫండ్ ప్లాట్‌ఫాంలైన కార్వీ, సీఏఎమ్ఎస్‌, ఎమ్ఎఫ్ యుటిలిటీల నుంచి పొందవ‌చ్చు. కొనుగోలుకు లేదా రిడీమ్ చేసుకునేందుకు/ ప‌థ‌కం మార్పు(స్విచ్చింగ్‌) కొర‌కు లావాదేవీల పేజీకి వెళ్లండి. ఇందులో స్విచ్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి స్విచ్ ఫారంలో మీరు మార్చుకోవాల‌నుకుంటున్న ఫండ్ ప‌థ‌కం పేరును న‌మోదు చేయండి. మీరు మార్చుకోవాల‌నుకుంటున్న ప‌థ‌కం పేరును స్విచ్ టు ఆప్ష‌న్‌లోనూ సెల‌క్ట్ చేసుకుని ఫండ్ పేరు ఆప్ష‌న్ తర్వాత‌ డైరెక్ట్ ప్లాన్ అని రాసి ఉందో లేదో నిర్థారించుకోండి. నాలుగురోజుల త‌రువాత‌ మ‌ళ్లీ లాగిన్ అయ్యి మీ ప‌థ‌కం డైరెక్ట్ ప్లాన్ కింద ఉందో లేదో స‌రిచూసుకోండి. ఆన్‌లైన్‌లో రిజిస్ట‌ర్ కాక‌పోయి ఉంటే ఆఫ్ లైన్ లో చేసేందుకు మ్యూచువల్ ఫండ్ కార్యాల‌యానికి వెళ్లండి. మీ ప‌థ‌కాన్ని మార్చుకునేందుకు అవ‌స‌ర‌మైన స్విచ్ ఫారంని అడ‌గండి. అనంత‌రం మీరు మార్చుకోవాల‌నుకుంటున్న ప‌థ‌కం వివ‌రాల‌తో నింపండి. అన్ని వివ‌రాలు నింపిన త‌ర్వాత సంత‌కం చేసి ఆఫీసులో ఇవ్వండి.

ఒకే ఫండ్ లో రెగ్యుల‌ర్ నుంచి డైరెక్ట్ కి మార్చుకున్న‌ప్ప‌టికీ ఆ లావాదేవీల క్ర‌య‌విక్ర‌యాల‌కు సంబంధించిన రుసుములు ఉంటాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకునేట‌ప్పుడు దీనిని వ‌సూలు చేస్తారు. ఈక్విటీ ప‌థ‌కాల‌లో ఏడాది తర్వాత‌ ఉప‌సంహ‌రించుకుంటే ఎలాంటి రుసుములు ఉండ‌వు. అయితే ఏడాది లోపు ఉప‌సంహ‌రించుకున్న‌ట్ల‌యితే మొత్తం ప‌థ‌కం విలువ‌లో 1 శాతం ఛార్జీ విధించే అవ‌కాశ‌ముంటుంది. డెట్ ప‌థ‌కాల‌లో ఫండ్ ర‌కాన్ని బ‌ట్టి నిష్క్ర‌మ‌ణ రుసుములు 0-2 శాతం వ‌ర‌కు ఉంటాయి. ఈ ఖ‌ర్చుల భారం ప‌డ‌కుండా ఉండేందుకు నిష్క్ర‌మ‌ణ రుసుములు లేన‌పుడు మాత్ర‌మే స్విచ్ చేయండి. లేదా రుసుములు వ‌ర్తించ‌ని కాలం వ‌ర‌కూ వేచి ఉండండి.

డిస్ట్రిబ్యూట‌ర్‌పై ఆధార‌ప‌డ‌కుండా మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను మీరే నిర్వ‌హించుకునేలారెగ్యుల‌ర్ ప్లాన్ల నుంచి డైరెక్ట్ ప్లాన్ల‌లోకి మారటం మంచిదే. అయితే దీర్ఘ‌కాలానికి గ‌ణ‌నీయ‌మైన మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెట్టే మ‌దుప‌ర్లు ఫండ్ల ఎంపిక‌లో స‌ల‌హాదారులను సంప్ర‌దించ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly