త‌ప్పు చెప్తే రూ.10 వేల జ‌రిమానా..

పాన్ నెంబ‌రుకు బ‌దులుగా ఆధార్ నెంబ‌రు ఇచ్చేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అనుమ‌తిస్తుంది

త‌ప్పు చెప్తే రూ.10 వేల జ‌రిమానా..

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేప్పుడు ఇత‌ర వివ‌రాల‌తో పాటు మీ పాన్ కార్డు నెంబ‌రును ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 10 డిజిట్స్‌తో కూడిన ఆల్ఫా న్యూమ‌రిక్ పాన్ సంఖ్య‌ను ఇచ్చేప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. లేదంటే రూ. 10 వేల జ‌రిమానా ప‌డ‌వ‌చ్చు.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, 272బీ ప్ర‌కారం ఎవ‌రైనా త‌మ పాన్ నెంబ‌రు త‌ప్పుగా ఇచ్చిన‌ట్లు తేలితే రూ.10 వేల వ‌ర‌కు జ‌రిమానా విధించే అధికారం ఆదాయ‌పు ప‌న్ను శాఖకు ఉంది. మీరు, మీ ఆదాయపు పన్ను రిటర్నుల‌ను (ఐటీఆర్) ను దాఖలు చేస్తున్నప్పుడు లేదా నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు పాన్ కార్డ్ నంబర్‌ను ఇవ్వ‌డం తప్పనిసరి అయినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుంది.

రూ.50వేల‌ కంటే ఎక్కువ విలువైన బ్యాంక్ లావాదేవీల నిర్వ‌హ‌ణ‌, మోటారు వాహనాల కొనుగోలు లేదా అమ్మకం, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, డిబెంచర్లు, బాండ్లు మొదలైన 20 ర‌కాల ప‌నులు చేసేప్పుడు పాన్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డు ఒక‌సారి ద‌ర‌ఖాస్తు చేస్తే స‌రిపోతుంది. ఇది మొత్తం జీవిత‌కాలం ప‌నిచేస్తుంది.

బ్యాంకులు పాన్ కార్డు నెంబ‌రుతో పాటు ఫోటో కాపీనీ అడుగుతాయి. ఒక‌వేళ పాన్ నెంబ‌రు త‌ప్పుగా ఎంట‌ర్ చేస్తే… ధృవీక‌రించుకునేందుకు ఫోటో కాపీనీ ఇవ్వ‌డం మంచిది.

ఒక‌వేళ మీరు పాన్ నెంబ‌రు మ‌ర్చిపోతే దానికి బ‌దులుగా ఆధార్ నెంబ‌రును ఇవ్వ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం పాన్‌, ఆధార్ నెంబ‌ర్లు రెండూ ఒక‌దాని స్థానంలో మ‌రొక‌టి ప‌నిచేస్తున్నాయి. పాన్ నెంబ‌రుకు బ‌దులుగా ఆధార్ నెంబ‌రును ఇచ్చిన‌ప్పుడు, త‌ప్పు ఆధార్ నెంబ‌రు ఇస్తే కూడా రూ.10 వేల జ‌రిమానా వ‌ర్తిస్తుంది.

లావాదేవీల నిర్వ‌హ‌ణ‌లో పాన్ లేదా ఆధార్ నెంబ‌రు్లు ఇవ్వ‌డంలో మీరు విఫ‌ల‌మైతే జ‌రిమానా ప‌డే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ మీరు ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధిలోకి రాక‌పోతే, మీ వ‌ద్ద‌ పాన్ కార్డు లేక‌పోతే ఫారం 60 డిక్లరేష‌న్ ఇవ్వ‌డం మంచిది.

రెండు పాన్ కార్డులు ఉంటే…
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 272బీ ప్ర‌కారం ఒక వ్య‌క్తికి ఒకే పాన్ నెంబ‌రు ఉండాలి. ఒక పాన్ నెంబ‌రుతో అనేక కాపీలు క‌లిగి ఉండ‌వ‌చ్చు. కానీ ఒక‌టి కంటే ఎక్కువ పాన్‌నెంబ‌ర్లు ఉండ‌కూడ‌దు. ఒక‌టి కంటే ఎక్కువ పాన్ నెంబ‌ర్లు క‌లిగి ఉన్న సంద‌ర్భంలో కూడా రూ. 10 వేల జ‌రిమానా వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ ఒక‌టి కంటే ఎక్కువ పాన్ నెంబ‌ర్లు ఉంటే వీలైనంత తొంద‌రగా ఒక పాన్‌ను ర‌ద్దు చేసుకోవ‌డం మంచిది. డిసెంబ‌రు 31 త‌రువాత ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్ కార్డులు చెల్ల‌వ‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌క‌టించింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly