నిండా మునగకుండా!

స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడే అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇటువంటి ఇక్కట్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు

నిండా మునగకుండా!

అహర్నిశలు శ్రమించి కూడబెట్టిన సొమ్ముతో సొంత ఇల్లు కొనుగోలు చేస్తుంటారు. తీరా వానాకాలంలో ఆ ఇల్లు కాస్త నీట మునిగితే ఎంత మనోవేదనని… ఆర్థిక నష్టమూ ఎక్కువే. నగరంలో పలు వెంచర్లలో ఇల్లు కట్టుకున్నవారు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ కొన్నవారు ఏటా ఈ కాలంలో వరదలో చిక్కుకోవడంతో నివాసాల్లోంచి బయటకు రాలేని పరిస్థితి. మరికొన్నిచోట్ల కొన్నాళ్లపాటు ఇంటిని వదిలి వెళ్లక తప్పని దుస్థితీ కనిపిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడే అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇటువంటి ఇక్కట్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. కొత్తగా స్థలం, ఇళ్లు, ఫ్లాట్‌ కొంటుంటే ఆయా ప్రాంతాలను ఒకసారి చూశాక ఏం చేయాలనేది నిర్ణయానికి వస్తారు. సహజంగా ఎవరైనా చేసేది ఇదే. వానాకాలంలో తప్ప మిగతా కాలాల్లోనే ఆయా ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఇక్కడే కొనుగోలుదారులు నష్టపోతున్నారు. వాస్తు ప్రకారం ఉందా? తక్కువ ధరకు వస్తుందా అనే విషయాలకు ప్రాధాన్యమిస్తున్నారే తప్ప ఎక్కడ కడుతున్నారనేది రాజీ పడిపోతుండడంతో తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్థిరాస్తి వెంచర్ల అసలు రూపం, నిర్మాణ నాణ్యత, ఆ ప్రాంతం స్థితిగతులన్నీ వర్షాకాలంలోనే బయటపడతాయి. ఈ కాలంలో చూడటం ద్వారా ఆయా స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. కొంతమంది రియల్టర్లు చెరువు పరిధి, వరద కాలువ మార్గం, ఎఫ్‌టీఎల్‌, 111 జీవో పరిధిలో చాలా వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. ఇటువంటి భూముల్లో కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముంపు తప్పదని తాజా పరిస్థితులు మరోసారి రుజువు చేశాయి. ఇప్పటికీ ఇటువంటి ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నాయి.

వీటిలో కొనవద్దని అధికారులు సూచిస్తున్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే ముఖ్యంగా చెరువులు, నాలాల పక్కన ఆక్రమించి కట్టిన వాటిలో భారీ వర్షాలు పడినప్పుడు నీటమునిగే ప్రమాదం ఉంది. ఆస్తినష్టం సరేసరి. తక్కువ ధరకని మధ్యవర్తులు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. మార్కెట్‌ కంటే తక్కువకు వస్తుందని కొనుగోలుదారులూ తీసుకుంటుంటారు. నీట మునిగే ప్రాంతాల్లో ఆస్తుల విలువ పడిపోతుందని నగర అనుభవాలు చెబుతున్నాయి. శివార్లలో కొనేటప్పుడు… గ్రేటర్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ… శివార్లలో హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి ఉన్న లే అవుట్లలోనే కొనుగోలు చేయాలి. శివారు ప్రాంతాల్లో జీపీ లేఅవుట్‌ పేరుతో ఇప్పటికీ నీటి వనరుల ప్రాంతాల్లో వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. పంచాయతీలకు అసలు లేఅవుట్‌ అనుమతి ఇచ్చే అధికారం లేదని, అలాంటి వాటిలో కొనొద్దని హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంటి అనుమతి కూడా జీ+2 వరకు పంచాయతీలకు అధికారాలున్నాయి. ఇటువంటి చోట కొనేటప్పుడు అన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. భారీ వర్షాల సమయంలో మునుగుతున్నవి ఎక్కువ ఇక్కడే ఉంటున్నాయనే విషయం గుర్తించాలి. ఉండొచ్చా? లేదా? సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో రహదారులు, రవాణా సదుపాయాల పరిస్థితి కూడా కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది. ఆయా ప్రాంతాల్లో వెంటనే నివాసం ఉండొచ్చా? లేదా? సిద్ధంగా ఉన్నవి కొనడమా? నిర్మాణంలో ఉన్న వాటిని తీసుకోవాలా అనేది నిర్ణయించుకోవచ్చు. వరద ముంపు లేదు… అభివృద్ధికి కొన్నేళ్లు పడుతుంది… ఆ ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుందనుకుంటే’ నిర్మాణంలో ఉన్న వాటిని కొనుగోలు చేయొచ్చు. ఇల్లు సిద్ధమయ్యేసరికి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

చూసుకుంటే:
నిర్మాణంలో నాణ్యత లోపించడం, కారడం… స్నానాలగదుల వద్ద పైకప్పు తడి వంటి లోపాలు వర్షాకాలంలో బయటపడతాయి. అపార్ట్‌మెంట్లలో చివరి అంతస్తులో ఉండేవారికి నీరు కారడం, కింది అంతస్తులో ఉండేవారికి వరద వస్తే సెల్లారు మునుగుతుందా అనేది ఇప్పుడే బయటపడతాయి. ః లోతట్టు ప్రాంతాల్లో అయితే వరద ముప్పు లేకుండా పునాది ఎత్తుగా ఉన్న ఇళ్లను, అపార్ట్‌మెంట్‌లలో అయితే సెల్లార్‌ లేనివాటిని కొనుగోలు చేయడం మేలు. పార్కింగ్‌ కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌ వదిలిన వాటికి ప్రాధాన్యమివ్వాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly