కార్డు వాడే తీరు మారాలి!

బాధ్యతాయుతంగా వాడితే కార్డుతో ఉపయోగాలే కానీ, నష్టాలు లేవని గుర్తించాలి

కార్డు వాడే తీరు మారాలి!

క్రెడిట్‌ కార్డు… ప్రస్తుతం మన జీవితంలో ఇదో నిత్యావసరం. వస్తువుల కొనుగోలు దగ్గర్నుంచి, ఎన్నో అవసరాలకు ఇది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. నగదుకు ప్రత్యామ్నాయంగా మారిపోయింది. అయితే, దీన్ని మనం ఎలా వాడుతున్నాం అనేదాన్నిబట్టే మన ఆర్థిక అలవాట్లను తెలుసుకోవచ్చు. క్రెడిట్‌ స్కోరునూ పెంచుకోవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్రెడిట్‌ కార్డు వినియోగిస్తున్న వారి సంఖ్య 7.12శాతం వృద్ధి చెందింది. అయినప్పటికీ కొంతమంది క్రెడిట్‌ కార్డుతో వ్యవహారాలు నిర్వహించడానికి ఇబ్బందిగా భావిస్తున్నారు. చెల్లింపులు సరిగా చేయకపోవడం వల్ల రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం తదితర వాటివల్ల వారు కార్డును ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అయితే, బాధ్యతాయుతంగా వాడితే కార్డుతో ఉపయోగాలే కానీ, నష్టాలు లేవని గుర్తించాలి. క్రెడిట్‌ కార్డుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు దాదాపు అందరికీ తెలుసు. కార్డును ఎవరికీ ఇవ్వొద్దు! పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పొద్దు! కార్డును సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి! ఇలాంటి అనేక జాగ్రత్తలు ఎప్పుడూ చెప్పేవే. దాదాపు అందరూ ఇప్పుడు వీటిని పాటిస్తున్నారు కూడా. అయితే, దీనికన్నా ముఖ్యంగా మనం చూడాల్సింది మనం కార్డు ద్వారా వస్తున్న రుణ వినియోగం ఎలా ఉందన్నదే.

ఎలా వినియోగిస్తున్నారు?

రుణ వినియోగ నిష్పత్తి ఎలా ఉందనేది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీకు అందుబాటులో ఉన్న పరిమితి ఎంత? దానిలో మీరు ఎంత మొత్తాన్ని వాడుకుంటున్నారు? అనేదే ఈ రుణ వినియోగ నిష్పత్తి. ఉదాహరణకు మీ క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.లక్ష ఉందనుకుందాం. అందులో నుంచి రూ.80,000 వాడారనుకుందాం. అంటే, మీరు 80 శాతం వరకూ రుణాన్ని వినియోగించుకుంటున్నట్లు లెక్క. ఇందులో పొరపాటు ఏముంది? 100శాతం వాడుకున్నా ఇబ్బంది లేదు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. నిజమే. దీనివల్ల ఏ సమస్యా లేదు. పైగా బ్యాంకుకు మీరు ఇష్టమైన ఖాతాదారు అవుతారు. ఎటొచ్చీ… క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలకే మీమీద నమ్మకం పోతుంది. ఎక్కువగా రుణ వినియోగం అంటే అప్పుల మీదే ఆధారపడి జీవిస్తున్నారని అర్థం చేసుకుంటాయి.

సాధారణంగా రుణ వినియోగ నిష్పత్తి 30శాతం లోపే ఉండటం ఎప్పుడూ మంచిది. అంటే, మీ క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.1,00,000 ఉంటే అందులో నుంచి రూ.30వేలకు మించి వాడకూడదు. అయితే, ఒక నెల ఇది ఎక్కువగా, మరో నెల తక్కువగా ఉండొచ్చు. కానీ, ఎల్లప్పుడూ 30శాతానికి మించి ఉంటే మాత్రం రుణం కోసం ఆరాటపడే వ్యక్తులుగా పరిగణిస్తాయి. మీరు జీవించడానికి క్రెడిట్‌ కార్డులు మినహా ఇంకో దారి లేదన్నట్లు భావిస్తాయి. ఇలాంటి వారందరినీ రుణాలు ఇచ్చే విషయంలో అంత నమ్మదగ్గ వ్యక్తులు కారు అనే జాబితాలోకి చేరుస్తాయి.

ఇక్కడ ఒక కార్డు విషయమే కాదు… మీ మొత్తం కార్డుల వినియోగం కూడా ఈ పరిధి దాటకుండా చూసుకోవాలి.

మీ దగ్గర రూ.లక్ష పరిమితితో రెండు కార్డులు ఉన్నాయనుకుందాం. ఒక కార్డులో నుంచి రూ.90వేల వరకూ ఖర్చు చేశారు. రెండో కార్డు నుంచి రూ.10వేలు ఖర్చు పెట్టారు. అంటే, మొదటి కార్డు నుంచి 90శాతం, రెండో కార్డు నుంచి 10శాతం రుణాన్ని వినియోగించుకున్నారు. స్థూలంగా చూస్తే రెండు కార్డులపైన కలిపి మీకున్న రుణ పరిమితిలో 50శాతం మాత్రమే వాడుకున్నారు. కానీ, క్రెడిట్‌ బ్యూరోలు ఈ విషయాన్ని పట్టించుకోకుండా, 90శాతం వాడినట్లుగానే చూస్తాయి. ఫలితంగా మీ క్రెడిట్‌ స్కోరు తగ్గే ఆస్కారం ఉంది.

మార్కులు పెరగాలంటే…

క్రెడిట్‌ కార్డులు వాడటం ఎటూ తప్పదు. మరి ఉన్నంతలో మన క్రెడిట్‌ స్కోరు ప్రభావితం కాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. చాలామంది నేరుగా నగదు ద్వారా లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కార్డు బిల్లులు చెల్లిస్తుంటారు. కొన్నిసార్లు దీనివల్ల కూడా క్రెడిట్‌ స్కోరు తగ్గుతూ ఉంటుంది. కారణం మీ బ్యాంకు ఖాతాలో ఇదో తప్పనిసరి ఖర్చుగా కనిపించడమే.

సాధ్యమైనంత వరకూ అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. దీనివల్ల క్రెడిట్‌ కార్డుపై ఒత్తిడి తగ్గుతుంది.

మీ కార్డు సంస్థను సంప్రదించి, రుణ పరిమితి పెంచాల్సిందిగా కోరడం ఒక మార్గం. చాలామంది తమ ఆదాయం పెరిగినప్పటికీ… ఇంతే చాలులే అంటూ… తక్కువ పరిమితి కార్డులతోనే కొనసాగుతూ ఉంటారు. సాధ్యమైనప్పుడుల్లా మీ కార్డు పరిమితిని పెంచుకోవడమే ఉత్తమం.

రెండు కార్డులు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ రెండింటినీ సమానంగా వాడటానికి ప్రయత్నించండి. దీనివల్ల కార్డులు, మీ వ్యక్తిగత రుణ వినియోగ నిష్పత్తి కూడా ఒకేలా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర రూ.50వేల పరిమితితో రెండు కార్డులు ఉన్నాయనుకోండి. అప్పుడు ఒక్కో కార్డులో రూ.25వేలు వాడితే అటు కార్డుల్లో 50శాతం, మీ మొత్తం పరిమితిలో 50శాతం వాడినట్లు లెక్కకు వస్తుంది.

ఇలాంటివి చూడ్డానికి సాధారణంగానే కనిపించినా భవిష్యత్తులో మీ రుణ చరిత్రను, క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తాయి. నిజంగా ఏదైనా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే, ముందు నుంచే అప్రమత్తంగా ఉండటం మేలు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly