ఆర్థిక నిపుణుడి సలహాతో సరైన మార్గంలో మేము!!

అర‌బ్ దేశంలో ఉంటోన్న ఓ భార‌తీయ కుటుంబం నిపుణుడి స‌ల‌హాతో ఆర్థిక ప్ర‌ణాళిక‌ను తీర్చిదిద్దుకున్న వైనాన్ని చూడండి.

ఆర్థిక నిపుణుడి సలహాతో సరైన మార్గంలో మేము!!

సందీప్ యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌(యూఏఈ) దేశంలోని ఓ సంస్థలో ప‌నిచేస్తూ మంచి జీతం సంపాదిస్తున్నారు. ఆయ‌న వ‌య‌సు 37ఏళ్లు. 15ఏళ్లుగా బాగా సంపాదిస్తున్నాన‌నే భావ‌న‌లో ఉన్నా ఎక్క‌డో ఏదో వెలితి క‌నిపిస్తోంద‌ని ఆయ‌న అభిప్రాయం. ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు సంబంధిత విషయాలు చ‌ద‌వ‌డం మొద‌లుపెట్టారు. అప్పుడే భార‌త్‌లో ఉంటోన్న‌మెల్విన్ జోస‌ఫ్ అనే ఆర్థిక ప్ర‌ణాళిక‌దారు గురించి తెలిసింది.

కార్యాల‌యంలో సాంకేతిక స‌హాయానికి త‌న బాస్ నుంచిఏ విధంగా స‌ల‌హా, స‌హ‌కారాలు కోరుకుంటారో అదే విధంగా వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళికలో భాగంగా త‌న పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఓ నిపుణుడి అవ‌స‌రం ఉంద‌ని సందీప్ భావించారు.

స‌రైన వ్య‌క్తిని క‌లిశాను

సందీప్ ఆర్థిక నిపుణుడైన మెల్విన్ జోస‌ఫ్‌ను క‌లుసుకున్నారు. తొలి ప‌రిచ‌యంలోనే ఆయ‌న సందీప్‌ను కొంత స‌మాచారాన్ని అడిగారు. 30నిమిషాల‌పాటు జ‌రిగిన చ‌ర్చ‌లో జోస‌ఫ్ కొన్ని పొర‌పాట్ల‌ను గుర్తించి త‌గిన సూచ‌న‌లిచ్చారు. అప్పుడే సందీప్‌కు అర్థ‌మైంది తాను స‌రైన వ్య‌క్తినే క‌లిశాన‌ని.

సూచించిన మార్పుచేర్పులు

జీవిత బీమా పాల‌సీల‌కు సంబంధించి భారీగా మార్పుల‌ను సూచించారు నిపుణుడు. స్నేహితుడి స‌ల‌హాతో పొందిన కొన్ని పాల‌సీలు నిజానికి సందీప్ కుటుంబానికి అవ‌స‌రంలేదు. త‌క్కువ విలువ క‌లిగిన ఎన్నో పాల‌సీల‌కు బ‌దులు ప్ర‌స్తుతం రూ.కోటి విలువ క‌లిగిన ట‌ర్మ్ పాల‌సీని సందీప్ కొనుగోలుచేశారు.

సందీప్ భార్య పేరు సాధ‌న‌. వారికి ఇద్ద‌రు కూతుళ్లు. 5ఏళ్ల శాన్వి, మ‌రో పాప వ‌య‌సు 3నెల‌లు. ఆమె పేరు భాగ్య‌శ్రీ. కుటుంబ అవ‌స‌రాల‌కు త‌గినంత ఆరోగ్య బీమా తీసుకోవాల్సిందిగా ఆర్థిక నిపుణుడైన జోస‌ఫ్ సూచించారు. అయితే అది వ‌ర‌కే తాను ప‌నిచేసే సంస్థ బృంద ఆరోగ్య పాల‌సీ ఇస్తుంద‌ని సందీప్ చెప్పినా ఆర్థిక నిపుణుడు మాత్రం విడిగా ఓ ఆరోగ్య బీమా పాల‌సీ ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. ఒక‌వేళ అనుకోని కార‌ణాల వ‌ల్ల ఉద్యోగం పోతే, ఈ ఆరోగ్య బీమా త‌గిన భ‌రోసానిస్తుంద‌ని నిపుణుడు సూచించారు.

అత్య‌వ‌స‌ర‌ నిధి

ఆర్థిక నిపుణుడు ఇచ్చిన మ‌రో ముఖ్య‌మైన స‌ల‌హా అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు. ప్ర‌స్తుతం సందీప్ చేసే ఉద్యోగం బాగానే ఉన్నా అనుకోని ప‌రిస్థితులు వ‌స్తే ఉపాధి కోల్పోయే అవ‌కాశం ఉంది. సరైన ఉద్యోగం దొరికేందుకు ఆరు నెలలు కూడా పట్టవచ్చు. అలా క‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని కాదు గానీ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా క‌నీసం 6 నెల‌ల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధిని సమకూర్చుకోవ‌డం ఎంతైనా ముఖ్యం.

ప‌ద‌వీ విర‌మ‌ణ

భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌మ ప‌ద‌వీ విర‌మ‌ణ కోస‌మూ ప్ర‌ణాళిక‌లు త‌యారుచేసుకోవాల‌నుకుంటున్నారు. ఈరోజు రూ.50వేల రూపాయల విలువ కొన్నేళ్ల‌కు రూ.2లక్ష‌లుగా ఏ విధంగా మారుతుందో ఆర్థిక నిపుణుడైన జోస‌ఫ్ చ‌క్క‌గా వివ‌రించారని సందీప్ అన్నారు. దీంతో వాళ్లు పెద్ద మొత్తంలో సంప‌ద సృష్టించుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు.

పిల్ల‌ల చ‌దువుల‌కు

ప్ర‌స్తుతం సందీప్ కుటుంబం ముందున్న ల‌క్ష్యం పిల్ల‌ల చ‌దువులు. ఇందుకోసం వారు 2-3 మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను మొద‌లుపెట్టాల‌నుకుంటున్నారు.

ఆర్థిక ప‌రిభాష‌పై అవ‌గాహ‌న

సందీప్‌, సాధ‌న భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ఆర్థిక ప్ర‌ణాళిక‌దారును ఏడాదిన్న‌ర‌గా క‌లుస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారికి త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌పైన, ఆర్థిక ప‌రిభాష‌పైన మంచి అవ‌గాహ‌న వ‌చ్చింది. ఎవ‌రికైనా స‌రిపోని ఆర్థిక ప‌థ‌కాలు, బీమా పాల‌సీలు ఉంటే గుర్తించ‌గ‌లిగే నేర్ప‌రిత‌నం వ‌చ్చింద‌ని సందీప్ విశ్వాసం వ్య‌క్తంచేశారు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌ రాబడికి సంబంధించి ప్రాధమిక స‌మాచారాన్ని అడిగి తెలుసుకుంటాన‌ని చెప్పారు.

క్ర‌మానుగ‌త పెట్టుబడుల్లోనూ సందీప్ డైరెక్ట్ ప‌థ‌కాల‌నే ఎంచుకున్నారు. ప్ర‌తి చిన్న విష‌యాన్ని ఆర్థిక నిపుణుడు నాకు చెప్ప‌ద‌ల్చుకోలేదు. స్వ‌తాహాగా నాకు నేను విష‌య ప‌రిజ్ఞానం పెంచుకోవాల‌ని ఆయ‌న అభిలాష అని సందీప్ చెప్పుకొచ్చారు. సిప్‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ఫారాల‌ను స్వ‌యంగా సందీప్ నింపారు. దీర్ఘ‌కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా మంచి రాబడి ఉంటుందని నిపుణుడు చెప్పారు.

ఇంటి రుణ చెల్లింపు

సొంత దేశ‌మైన భార‌త్‌లో ఇంటి కోసం గృహ రుణాన్ని తీసుకున్నారు. ఇప్పుడు సందీప్‌ ముందుగా ఈ రుణాన్ని తీర్చాల‌నుకుంటున్నారు. కావాలంటే పెట్టుబ‌డుల‌ను మ‌రుస‌టి ఏడాదికి వాయిదా వేయాల‌ని ఆయ‌న ఉద్దేశం.

షేర్ల కొనుగోలు

పెట్టుబ‌డులకు సంబంధించి ఇదివ‌ర‌కు కొన్ని షేర్ల‌ను కొని తిరిగి దాన్ని అమ్మివేశాను. వేటిలోనైనా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు కానీ వాటి వృద్ధిని ప‌రిశీలిస్తూ ఉండాల్సిందిగా ఆర్థిక నిపుణులైన జోస‌ఫ్ సందీప్‌కు స‌ల‌హాలిచ్చారు.

ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకున్నాం

ఇదివ‌ర‌కు అన‌వ‌స‌ర‌మైన వాటికి భారీగా ఖ‌ర్చుచేసేవాళ్లం. ఇప్పుడు ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకొని పొదుపు కూడా చేయ‌డం మొద‌లుపెట్టాం. ఈ ప్ర‌క్రియ మొత్తం ఆర్థికంగా కుదురుకునేందుకు దోహ‌ద‌ప‌డింది. భ‌విష్య‌త్తు గురించి మాకిప్పుడు బెంగ లేదు. మా పిల్ల‌ల అవ‌స‌రాలు తీర్చేవిధంగా మా ప్ర‌ణాళిక‌లున్నాయ‌ని సందీప్ భార్య సాధ‌న ఆనందం వ్య‌క్తంచేశారు.

దూరం అవ‌రోధం కాదు

సందీప్ కుటుంబం యూఏఈలో స్థిర‌ప‌డింది. వాళ్ల ఆర్థిక ప్ర‌ణాళిక‌దారు భార‌త్‌లో ఉంటారు. అయితే ఈ దూరం తమ‌కెప్పుడూ స‌మ‌స్య కాలేద‌ని సందీప్‌, సాధ‌న‌లిద్దరూ చెప్పారు. దూరంగా ఉంటే స‌మ‌స్య‌ను వివ‌రించడం సాధ్యం కాద‌ని తొలుత భావించాను. అయితే అది త‌ప్ప‌ని గ్ర‌హించాను అని సందీప్ అన్నారు.

ఆర్థిక ప్ర‌ణాళిక సందీప్‌, సాధ‌న దంప‌తుల‌కు ప్ర‌స్తుతం తాము ఏ ప‌రిస్థితిలో ఉన్నారు, మున్ముందు ఎక్క‌డికి చేరాలి అనేదానిపై అవ‌గాహ‌న క‌ల్పించింది. ఇదివ‌ర‌కు ఆర్థిక విష‌యాల‌కు సంబంధించి కంగారు ఎక్కువ‌గా ఉండేది. అయితే అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న వ‌చ్చాక ఇప్పుడు సందీప్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly