రోజు రోజుకి పెరుగుతున్న సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్..

2019 ఆర్ధిక సంవత్సరంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పరిమాణం 4 మిలియన్ల యూనిట్ల మార్క్ ను నమోదు చేసింది

రోజు రోజుకి పెరుగుతున్న సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్..

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కు చెందిన ప్రీ - యూస్డ్ కార్ల సంస్థ అయిన మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ లిమిటెడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2022 సంవత్సరం నాటికి మన దేశంలో ప్రీ ఓన్డ్ లేదా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పరిమాణం 6.7 మిలియన్ యూనిట్ల నుంచి 7.2 మిలియన్ యూనిట్ల మధ్య ఉండవచ్చునని తెలిపింది. అలాగే దాని విలువ రూ. 50 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. సంస్థ నివేదిక ప్రకారం, సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల్లో వ్యవస్థీకృత రిటైల్ ఛానల్స్ వాటా 30 శాతంగా ఉండగా, అసంఘటిత రిటైల్ ఛానల్స్ వాటా 40 శాతంగా ఉంది. అలాగే మిగిలిన 30 శాతం మంది వినియోగదారులు మొదటి యజమాని నుంచి నేరుగా కారును కొనుగోలు చేస్తున్నారు. 2019 ఆర్ధిక సంవత్సరంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పరిమాణం 4 మిలియన్ల యూనిట్ల మార్క్ ను నమోదు చేసింది. ఇది కొత్త కార్ల మార్కెట్ పరిమాణం కంటే 1.2 రెట్లు అధికం. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు ఇంకా పెరగాల్సి ఉంది, కానీ 2019 లోక్ సభ ఎన్నికల ముందు అనిశ్చితి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) లిక్విడిటీ క్రంచ్ ను ఎదుర్కొంటున్న కారణంగా కార్ల అమ్మకాలు కొంత మేర తగ్గాయి. మొదటిసారి 2016 సంవత్సరంలో నోట్ల రద్దు కారణంగా సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. అలాగే 2017 సంవత్సరంలో అమలు చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) కారణంగా కూడా సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయం దెబ్బతినింది. అప్పట్లో కొత్త, సెకండ్ హ్యాండ్ వాహనాలకు ఒకేవిధమైన పన్ను స్లాబ్ ను విధించారు. అయితే, 2018 సంవత్సరంలో, జీఎస్టీ కౌన్సిల్ సెకండ్ హ్యాండ్ కార్లపై పన్ను స్లాబ్ ను తగ్గించడంతో పాటు, అదనపు సెస్ ను కూడా తొలగించింది.

గత దశాబ్ద కాలంలో (ఆర్ధిక సంవత్సరం 2011 నుంచి 2019 వరకు) ప్రీ - ఓన్డ్ కార్ల మార్కెట్ దాదాపు 10 శాతం నుంచి 18 శాతం వరకు పెరిగింది. అంటే దాదాపు రెండింతలు అయ్యిందని దీని అర్ధం. గత నాలుగు సంవత్సరాలుగా, ఈ రంగంలో అన్ని కంపెనీలు పెట్టిన పెట్టుబడి రూ. 5,000 కోట్ల వరకు ఉంటుందని సంస్థ ప్రకటనలో పేర్కొంది.

మార్కెట్లో అమ్ముడవుతున్న మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 17 శాతం కార్లను మాత్రమే వినియోగదారులు రుణం తీసుకుని కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన వారు నేరుగా నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని సంస్థ తెలిపింది. అదే కొత్త కారు విభాగంలో అయితే, దాదాపు 85 శాతం కార్లను రుణం తీసుకునే కొనుగోలు చేస్తున్నారని తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly