బ్యాంకులు ఇక‌పై ఫారం 15హెచ్‌ను అనుమతించాల్సిందే - సీబీడీటీ

వ‌డ్డీ ఆదాయంపై టీడీఎస్ డిడ‌క్ట్ కాకుండా సీనియ‌ర్ సిటిజ‌న్లు బ్యాంకులు /ఫోస్టాఫీసుల‌కు ఫారం 15హెచ్ ఇవ్వాలి

బ్యాంకులు ఇక‌పై  ఫారం 15హెచ్‌ను అనుమతించాల్సిందే - సీబీడీటీ

కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ) నోటిఫికేషన్ ప్రకారం, రూ.5 లక్షల లోపు పన్ను వ‌ర్తించే ఆదాయం ఉన్న సీనియర్ సిటిజ‌న్లు, వ‌డ్డీ ఆదాయంపై విధించే టీడీఎస్‌(మూలం వ‌ద్ద ప‌న్ను) నుంచి మినహాయింపు పొందేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల‌కు ఫార‌మ్ 15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో రూ.2.5 లక్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే టీడీఎస్ మిన‌హాయింపు ప‌రిధి ఉండేది.

మధ్యంతర బడ్జెట్‌లో వెలువడిన ప్రకటనకు అనుగుణంగా 15హెచ్‌ ఫారంలో ఈ సవరణ చేస్తూ, కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ) నోటీఫికేష‌న్ జారీ చేసింది. 2019-20 యూనియ‌న్ బ‌డ్జెట్‌లో ప‌న్ను వ‌ర్తించే వార్షిక ఆదాయం రూ.5 ల‌క్ష‌ల లోపు ఉన్న వ్య‌క్తుల‌కు పూర్తి ప‌న్ను రాయితీని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా 3 కోట్ల మంది మ‌ధ్య‌త‌రగ‌తికి చెందిన ప‌న్ను చెల్లింపుదారులకు ప్ర‌యోజ‌నం చేకూరింది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 సెక్ష‌న్ 87ఏ ప్ర‌కారం రిబేటును ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న త‌రువాత, పూర్తి ప‌న్ను మిన‌హాయింపు పొందిన వారి వ‌ద్ద నుంచి బ్యాంకులు, పోస్టాఫీసులు ఫార‌మ్ 15హెచ్‌ను అనుమ‌తించాల‌ని సీబీడీటీ తెలిపింది.

60 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు వ‌డ్డీ ఆదాయంపై మూలం వ‌ద్ద ప‌న్ను డిడ‌క్ట్ చేయ‌కుండా ఉండేందుకు ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే ఫార‌మ్ 15హెచ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

ఒక ఆర్థిక సంవత్స‌రంలో రూ. 5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న ప‌న్ను చెల్లింపు దారుల‌కు సెక్ష‌న్ 87ఏ కింద ఇచ్చే రిబేట్‌ను రూ.2500 నుంచి రూ. 12500కి పెంచింది. అంటే రూ. 5 లక్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప‌న్ను చెల్లింపుదారులు ఎటువంటి ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

సెక్ష‌న్ 87ఏ కింద రిబేట్ పొందిన త‌రువాత కూడా పూర్తి ప‌న్ను మిన‌హాయింపు పొందిన ప‌న్ను చెల్లింపుదారులు ఇచ్చే 15హెచ్‌ ఫారంను బ్యాంకులు అనుమతించాల్సిందేన‌ని నంగియా అడ్వైజర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నేహా మల్హోత్రా అన్నారు.

రూ. 5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప‌న్ను చెల్లింపు దారులు ఈ మార్పు గ‌మ‌నించాలి. లేదంటే బ్యాంకులు వ‌డ్డీ ఆదాయంపై టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేస్తాయి. టీడీఎస్ రిఫండ్ కోసం ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా ప‌న్ను చెల్లింపుదారులు రిఫండ్ క్లెయిమ్ చేయ‌న‌వ‌స‌రం లేదు. అంతే కాకుండా సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌(సీపీసీ) పై అద‌న‌పు భారాన్ని కూడా త‌గ్గిస్తుంద‌ని మల్హోత్రా పేర్కొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly