నెలసరి ఆదాయాన్ని ఇచ్చే 7 పెన్షన్ పధకాలు

ఇలాంటి పథకాలకు మన దేశం లో ఢోకా లేదనే చెప్పాలి. అయితే మంచి వాటిని ఎంచుకోవడం ముఖ్యం

నెలసరి ఆదాయాన్ని ఇచ్చే 7 పెన్షన్ పధకాలు

పదవీ విరమణ తరువాత ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటప్పుడు నెల నెలా స్థిరంగా ఆదాయం ఉండాలని అందరు అనుకుంటారు, అనుకోవాలి కూడా. కొంత మంది పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న, అదనపు ఆదాయం అంటే అందరికీ ఇష్టమే. ఇలాంటి పథకాలకు మన దేశం లో ఢోకా లేదనే చెప్పాలి. అయితే మంచి వాటిని ఎంచుకోవడం ముఖ్యం. ఇలాంటి పథకాల్లో 7 ఉపయోగకరమైనవాటిని ఇప్పుడు చూద్దాం.

  1. జాతీయ పింఛను పధకం(ఎన్పీఎస్):

నేషనల్ పెన్షన్ స్కీం(ఎంపీఎస్) ప్రత్యేకంగా పింఛను కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకం. దీన్ని నిర్వహిస్తున్నది పీఎఫ్అర్డీఏ సంస్థ. ప్రభుత్వ బాండ్లు, బిల్లులు, షేర్లు, ఇలా రక రకాల పథకాల్లో మదుపు చేసి రాబడి పొందడమే దీని లక్ష్యం. ఇందులో 18 నుంచి 65 ఏళ్ళ లోపు వయసు ఉన్న ఖాతా తెరవచ్చు.

టయర్ 1 ఖాతా లో 60 ఏళ్ళ వయసు వచ్చే వరకు 20 శాతం మాత్రమే వెనక్కి తీసుకునే వీలు ఉంటుంది, మిగిలిన 80 శాతాన్ని ఒక బీమా కంపెనీ దగ్గర ఆన్యూవిటీ కోసం జమ చేయాలి. 60 ఏళ్ళ వయసు వచ్చాక ఖాతా లో మిగిలిన మొత్తం నుంచి 60 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు, మిగిలిన దాన్ని బీమా కంపెనీ దగ్గర ఉంచాలి. ఈ మొత్తం నుంచి బీమా కంపెనీ మీకు నెల నెలా ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పధకం లో కట్టిన మొత్తానికి ఏడాదికి రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.

  1. అటల్ పెన్షన్ యోజన:

ఇది అసంఘటిత రంగం లో ఉన్న వారి ఆర్ధిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2015-16 లో ప్రవేశ పెట్టిన పధకం. దీని నుంచి నెల నెలా రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పింఛను పొందే అవకాశం ఉంది. సామాజిక భద్రత పథకాల్లో లేని వారు, ఆదాయ పన్ను పరిధి లో రాని వారి కోసం ప్రభుత్వం వారి ఖాతా లో మదుపు చేసిన మొత్తానికి మరో 50 శాతం లేదా సంవత్సరానికి రూ. 1000(ఏది తక్కువైతే అది) జత చేస్తారు. 18 నుంచి 40 లోపు వయసు గల వారికి ఇందులో చేరే అర్హత ఉంటుంది, 60 ఏళ్ళ వయసు వచ్చే సరికి ఇందులో నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.

  1. స్వావలంబన పెన్షన్ యోజన:

ఈ పధకాన్ని కూడా పీఎఫ్అర్డీఏ సంస్థ నిర్వహిస్తోంది. అసంఘటిత రంగం వారి కోసం ఇది రూపొందించింది. అయితే ఇందులో చేరాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా పీఎస్యూ(పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ) సంస్థ లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. అలాగే వేరే ఏదైనా సామాజిక భద్రతా పథకాల్లో భాగం కాకూడదు. ఇందులో ఏడాదికి రూ. 1,000 నుంచి రూ. 12,000 వరకు మదుపు చేయవచ్చు.

  1. పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీం:

ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.60 శాతం. డిపాజిట్ చేసిన రోజు నుంచి ప్రతి నెలా వడ్డీ అందుతుంది. ఒక ఖాతా లో రూ. 4.50 లక్షలు, ఉమ్మడి ఖాతా లో అయితే రూ. 9 లక్షల వరకు మదుపు చేయవచ్చు. దీనికి 5 ఏళ్ళ కాల పరిమితి ఉంటుంది. ఒక పోస్ట్ ఆఫీసు నుంచి మరో బ్రాంచ్ కి బదిలీ కూడా చేసుకోవచ్చు. రూ. 4.50 లక్షలు మదుపు చేస్తే 5 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 2850 పొందొచ్చు.

  1. ప్రధాన మంత్రి వయ వందన యోజన:

పెద్దలు లేదా వయో వృద్ధుల కోసం 8.30 శాతం వడ్డీ హామీ తో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకం ఇది. గతం లో ఇందులో రూ. 7.50 లక్షల వరకు మదుపు చేసుకునే వీలు ఉండేది, ఇప్పుడు దీన్ని రూ. 15 లక్షలు చేసారు. కనీసం 60 ఏళ్ళు వయసు ఉన్న వారు ఇందులో చేరవచ్చు, పింఛను ప్రతి సంవత్సరం చివరిలో అందుతుంది. అయితే పింఛను ప్రతి నెలా, త్రైమాసికానికి, అర్ధ సంవత్సరం లేదా సంవత్సరానికి ఒక సరి ఇలా ఎప్పుడో పొందాలో ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు.

  1. మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపీ:

సిస్టమాటిక్ విత్డ్రావాల్ ప్లాన్(ఎస్డబ్ల్యూపీ) ద్వారా మ్యూచువల్ ఫండ్ల నుంచి నెల నెలా ఆదాయం పొందే వీలు ఉంది. ఉదాహరణకి ఒక ఫండ్ లో రూ. 10 లక్షలు మదుపు చేసి అందులో నుంచి నెల నెలా రూ. 6000 చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఇది సిప్ కి వ్యతిరేక పధ్ధతి. దీని వల్ల మ్యూచువల్ ఫండ్లలో ఉన్న రిస్క్ ని కొంత వరకు తగ్గించవచ్చు. మార్కెట్ లో ఏదైనా హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఒకే సరి డబ్బు మొత్తం తీసుకుంటే నష్టపోతారు కాబట్టి ఈ పధ్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసిన వారు ఆర్ధిక లక్ష్యానికి 3 ఏళ్ళ ముందు నుంచి ఈ పధ్ధతి ని పాటించవచ్చు.

  1. నెలసరి ఆదాయం తో కూడిన టర్మ్ ప్లాన్:

బీమా కంపెనీలు ఈ మధ్య కాలం లో దీన్ని ప్రవేశ పెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం పాలసీ దారుడు మరణించాక తన కుటుంబానికి ఆర్ధిక బలం కోసం బీమా హామీ తో పాటు నెల నెలా కొంత డబ్బుని అందించడం. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, మాక్స్ లైఫ్ లాంటి కంపెనీలు 10 నుంచి 20 ఏళ్ళ వరకు నెలసరి ఆదాయాన్ని అందించే పాలసీలు అందిస్తున్నాయి. అయితే ఇది ఉచితం ఏమి కాదు. పాలసీ ప్రీమియం లో దీనికి సరిపడా చార్జీలు విధిస్తారు. వ్యక్తిగత అవసరాలని బట్టి ఇలాంటి వాటిని ఎంచుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly