వ్యాపారం మొదలు పెట్టే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

స్వల్ప ఆదాయం నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల చదువుల కోసం కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు

వ్యాపారం మొదలు పెట్టే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ధనవంతులు కావాలని ఎవరికి ఉండదు. కొంతమంది ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి మంచి ఆదాయంతో తగిన పథకాలలో మదుపు చేయటం ద్వారా ధనవంతులు కాగలుగుతున్నారు. వీరికి కచ్చితమైన నెలసరి ఆదాయం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆదాయంలో వృద్ధి ఉంటుంది. కొంత మంది వచ్చిన స్వల్ప ఆదాయం నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల చదువుల కోసం కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. మరికొంతమంది వ్యాపారంలో కష్టపడి సంపాదించడం ద్వారా ధనవంతులు కాగలుగుతున్నారు.

అయితే వ్యాపారంలో రాణించటానికి అనేక కారణాలు ఉంటాయి. కృషి, పట్టుదల వంటి అంశాలతో పాటు ఈ కింది వాటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణలో పెట్టడం ద్వారా వ్యాపారాన్ని దీర్ఘకాలం పాటు లాభదాయకంగా నిర్వహించవచ్చు.

అభిరుచి :

మీరు ఎంచుకున్న పనిలో అభిరుచి ఉండాలి. దీనివలన ఎంతటి కష్టమైన పని కూడా సులభంగా చేయగలుగుతారు. ఎన్ని గంటలు కష్టపడ్డా కూడా మీకు అలసట, విసుగు అనిపించదు. అలా కాకుండా, ఎవరో చెప్పారని ఆ పని చేయటం వలన ఆనందం రాదు, ఫలితం దక్కదు. కొంత కాలానికి విసుగువచ్చి, మధ్యలోనే ఆపేసి అవకాశాలు ఉంటాయి.

అనుభవం :

మీరు ఎంచుకున్న రంగంలో కొంతైనా విషయం పరిజ్ఞానం, అనుభవం ఉండాలి. మీరు ఆ రంగంలో ఉన్న ఎవరి దగ్గరైనా కొంతకాలం పనిచేసి, అందులో ఉన్న లోతుపాటులను గ్రహించడం చాలా ముఖ్యం. దీని వలన మీరు స్వంతంగా వ్యాపారం పెట్టినపుడు, ఇటువంటి సమస్యలను సునాయాసంగా పరిష్కరించగలుగుతారు.

ప్రదేశం :

వ్యాపారం చేయదలచిన ప్రదేశం చాలా ముఖ్యం. మీరు అందించే వస్తు సేవల కొరకు వినియోగదారులు మీ వద్దకు రావటానికి గానీ, మీరు వినియోగదారుల వద్దకు
చేరటానికి గానీ మీ వ్యాపార ప్రదేశం ఎంతో ముఖ్యమైనది. ఇందులో ముఖ్యమైనవి అద్దె, విద్యుత్, నీటి, రవాణా సదుపాయం వంటివి ఎంతో వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తాయి.

ఖర్చుల నియంత్రణ :

ఏవి ముఖ్యమైనవో, ఏవి కావో గ్రహించడం ద్వారా అనవసరపు ఖర్చులను నివారించవచ్చు. ఈ ప్రక్రియ రోజువారీ కార్యక్రమంలో భాగం కావాలి .
దీనికోసం, ప్రతి వస్తువు సేవల కొనుగోలులో ప్రత్యామ్న్యాయాలను వెతుకుతూ ఉండాలి. దీని వలన సరఫరాదారుల బెదిరింపులకు భయపడవలసిన అవసరం ఉండదు.

మూల ధనం :

ముందు కొద్ది పెట్టుబడి మొత్తంతో ఆరంభించాలి. వ్యాపారం అభివృద్ధి చెందేకొలదీ పెట్టుబడి పెంచాలి. అవసరమైతే బంధువుల, స్నేహితుల దగ్గర వడ్డీ లేని రుణాన్ని తీసుకోవచ్చు. అలాగే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి తక్కువ మొత్తంలో రుణం తీసుకోవచ్చు. అయితే, చెల్లింపుల విషయంలో కచ్చితంగా ఉండాలి. బ్యాంకులకు చెల్లించే విషయంలో ఎంత నిబద్దతతో ఉంటామో, అట్లాగే బంధువుల, స్నేహితులకు చెల్లించే విషయంలో కూడా ఉండాలి. మీ వద్ద ఉన్నసొమ్ము లేదా అప్పు చేసిన మొత్తాన్ని ఒకేసారి పెట్టకూడదు. ఎందుకంటే, అప్పు తీసుకుంటే అసలుకన్నా ముందు నెలనెలా వడ్డీ చెల్లించాలి.

క్రెడిట్ స్కోర్ :

బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి తీసుకునే రుణాలపై క్రెడిట్ స్కోర్ ప్రభావం ఉంటుంది. అడిగిన పత్రాలను సమర్పించడం, గడువుకు ముందే నెలవారీ చెల్లింపులను సక్రమంగా చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ ను మెరుగు పర్చుకోవచ్చు. తద్వారా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందవచ్చు.

సమాచారం :

ప్రస్తుత రోజులలో మొబైల్ ఫోన్ వాడకంతో ఎన్నో పనులు చౌకగా, సులభంగా జరుగుతున్నాయి. వినియోగదారులతో, సరఫరాదారులతో సరైన సమయంలో సమాచారం పెంచుకోవడం ద్వారా వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దీని వలన వ్యక్తిగతంగా కలవడానికి అయ్యే సమయం, డబ్బును వ్యాపార అభివృద్ధికి వినియోగించవచ్చు.

సమయానికి చెల్లింపులు :

సరఫరాదారులకు గానీ, పనిచేస్తున్న సిబ్బందికి గానీ సమయానికి చెల్లింపులు చేయటం ఎంతో ముఖ్యం. దీని వలన మీ పరపతి పెరగటంతో పాటు వ్యాపారాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి.

ఉద్దెర :

అర్హులు కాని వారిని మొదటి నుంచి సున్నితంగా తిరస్కరించడం ద్వారా ఉద్దెరను నివారించవచ్చు. మొదట్లో, వారికి మీ పధ్ధతి నచ్చకపోవచ్చు. కొంతమంది మళ్ళీ మీ దగ్గరకు రాకపోవచ్చు. అప్పు ఇచ్చి నష్టపోయేకంటే, మొదటి నుంచి ఇవ్వకపోవడమే నయం. దీని వలన మీ వ్యాపార పెట్టుబడికి నష్టం రాదు, ఆ అప్పులు తిరిగి రావోనన్న భయం ఉండదు.

పత్రాలు :

వ్యాపారానికి, వ్యక్తిగత పత్రాలను విడివిడిగా భద్రపరచాలి. ఎందుకంటే భవిష్యత్తులో వీటి అవసరం ఎప్పుడైనా కలగవచ్చు.

ఆదాయపు పన్ను రిటర్నులు :

వ్యాపారం ఆరంభించిన సంవత్సరం నుంచే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయటం మంచిది. అవసరమైతే ఖాతా పుస్తకాలను రాయటం ద్వారా, భవిష్యత్తులో రుణాన్ని పొందటానికి ఇవి చాలా ఉపాయోగపడతాయి. దీని కోసం ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ని సంప్రదించడం ద్వారా వ్యాపార అభివృద్ధికి అవసరమయ్యే సూచనలు, సలహాలు పొందవచ్చు.

న్యాయపరమైన విషయాలు :

సాధారణంగా వ్యాపారం చేసేటప్పుడు న్యాయపరమైన సమస్యలు వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు వీటిని ముఖాముఖిగా పరిష్కరించుకోగలిగితే మంచిది. అన్యమార్గాల ద్వారా ఆశించినట్లైతే మీ సమయం, సొమ్ము వృధా అవుతాయి.

అత్యవసర నిధి :

మీరు వ్యాపారం ఆరంభించే ముందు కనీసం రెండు సంవత్సరాలకు అవసరమయ్యే కుటుంబ ఖర్చులకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే వ్యాపారం అభివృద్ధి చెందటానికి కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు కుటుంబ ఖర్చుల కోసం వ్యాపార పెట్టుబడిని వాడకుండా, ఈ నిధి నుంచి వాడుకోవచ్చు. ఎట్టిపరిస్థితులలోనూ వ్యాపార పెట్టుబడిని ఇంటి శుభకార్యాలకు వాడరాదనే నిబంధన పెట్టుకొవాలి.

టర్మ్ జీవిత బీమా :

సాధారణంగా, జీవిత బీమా సంస్థలు వ్యక్తుల వయసు, చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తి , ఆదాయ వనరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జీవిత బీమాని అందిస్తాయి. కావున, మీరు వ్యాపారం మొదలుపెట్టక మునుపే టర్మ్ జీవిత బీమాను తీసుకోవాలి. ఎందుకంటే, ఏదైనా కారణం చేత అంగ వైకల్యం గానీ, మరణం గానీ సంభవిస్తే కుటుంబానికి ఆర్ధిక భరోసాగా ఈ జీవిత బీమా పనిచేస్తుంది. దీని కోసం ఆరోగ్య పరీక్షల నివేదిక, గడచిన మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆరోగ్య బీమా :

వ్యాపారం సక్రమంగా నడవాలంటే, మీ ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. కుటుంబంలో ఎవరు అనారోగ్యం పాలైనా చాలా డబ్బు ఖర్చుచేయాల్సి వస్తుంది.
ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మీ అవసరం ఆధారంగా ఒక బేస్ పాలసీని తీసుకుని, దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది.

ముగింపు:

అదనపు పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చు. అయితే బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు తిరిగి రుణ గ్రహీత వ్యాపార స్వభావం, ఆదాయ వనరు, తిరిగి చెల్లించే సామర్ధ్యం వంటివి చూస్తాయి. ముద్రా లోన్ ద్వారా కూడా రుణం పొందవచ్చు. వ్యాపారంలో రాణించాలంటే దీర్ఘకాలం పాటు పాటించాల్సిన పద్ధతులతో , మీరు అందించబోయే వస్తు సేవల ధరలు, ప్రత్యమ్నాయ వస్తువులు, చౌకగా దొరికే దిగుమతులు, ప్రభుత్వ విధానాలు వంటివి దృష్టిలో ఉంచుకోవాలి.

ఏదైనా సందర్భంలో అనుకోని కారణాల వలన వ్యాపారాన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వస్తే, ఎటువంటి సంశయాలకు, ఆత్మ న్యూన్యతకు లోను కాకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, జీవితం చాలా విలువైనది. ఇది కాకపొతే వేరొక వ్యాపకం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపగలిగేట్లు ఉండాలి. ఇదే జీవిత సత్యం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly