కంపెనీలో ఉండే వివిధ వర్గాల పెట్టుబడిదారులు

కంపెనీలో భాగ‌స్వామ్య క‌లిగిన వారు వాటాదార్లు. వివిధ వ‌ర్గాల‌కు చెందిన వాటాదార్ల గురించి తెల‌సుకుందాం.

కంపెనీలో ఉండే వివిధ వర్గాల పెట్టుబడిదారులు

ప‌బ్లిక్ లిస్టెడ్ కంపెనీలు విభిన్న వ‌ర్గాల‌కు చెందిన మ‌దుప‌ర్లు, సంస్థ‌ల‌ నుంచి పెట్టుబ‌డుల‌ను స‌మీక‌రించి దానికి స‌మాన‌మైన షేర్ల‌ను వారికి జ‌మ‌చేస్తాయి. దీంతో ఆ మ‌దుప‌ర్లు కంపెనీలో వాటాదార్లుగా కొన‌సాగుతారు. ఒక కంపెనీలో ఏ వ‌ర్గం మ‌దుప‌ర్లు ఎంత వాటా క‌లిగి ఉన్నారో తెలిపేదాన్ని వాటాదార్ల న‌మూనా అంటారు. ఈ వాటాదారుల వివరాలు మనకు స్టాక్ ఎక్స్చేంజీల వెబ్ సైట్ల‌లో, కంపెనీ వెబ్ సైట్ల‌లో, నివేదిక‌ల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీలు త‌మ ప్ర‌ధాన వాటాదార్ల వివ‌రాల‌ను వార్షిక‌నివేదిక‌లో ప్ర‌క‌టిస్తాయి.

పెట్టుబ‌డుల ప‌రంగా మ‌దుప‌ర్ల‌ను వివిధ వర్గాలుగా చూస్తారు.

ప్ర‌మోట‌ర్లు

 • దేశీయ ప్ర‌మోట‌ర్లు
 • విదేశీ ప్ర‌మోట‌ర్లు

ప్ర‌మోట‌రేత‌రులు

 • సంస్థాగ‌త‌ మ‌దుప‌ర్లు
 • వ్య‌క్తిగ‌త మ‌దుప‌ర్లు

సంస్థాగ‌త మ‌దుప‌ర్లు

 • బ్యాంకులు
 • మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు
 • పెన్ష‌న్ ఫండ్ మొద‌లైన‌వి

వ్య‌క్తిగ‌త మ‌దుప‌ర్లు

 • రిటైల్ మ‌దుప‌ర్లు
 • కార్పోరేట్ సంస్థ‌లు
 • రిటైల్ మ‌దుప‌ర్లలో రెండు ర‌కాలుగా వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు.
  రెండు ల‌క్ష‌ల కంటే ఎక్కువ పెట్టుబ‌డి క‌లిగిన వారు (హెచ్ ఎన్ ఐ).
  రెండు ల‌క్ష‌ల కంటే త‌క్కువ పెట్టుబ‌డి కలిగిన‌వారు
SHARE-HOLDING.jpg

ప్ర‌మోట‌ర్లు :

కంపెనీ స్థాపించాల‌నే ఆలోచ‌నతో మొద‌లు దానికి అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తుల‌ను తీసుకుని కంపెనీ ప్రారంభించే వారిని ప్ర‌మోట‌ర్లు అంటారు. ఇది వ్య‌క్తులు లేదా సంస్థ‌లు కావ‌చ్చు.
కొంత మంది మ‌దుప‌ర్ల‌ను కంపెనీలోకి పెట్టుబ‌డులు చేసే విధంగా చేయ‌డంలో ప్ర‌మోట‌ర్లు కీల‌కంగా వ్య‌వహ‌రిస్తారు. వారి ఆలోచ‌న ఇత‌ర పెట్టుబ‌డిదార్ల‌తో పంచుకుని వారిని ఒప్పించి మ‌దుపుచేసే విధంగా చేస్తారు. ప్ర‌మోట‌ర్లలో కొంత మంది విదేశీ సంస్థ‌లు లేదా వ్య‌క్తులు కూడా ఉండ‌వ‌చ్చు. వారిని విదేశీ ప్ర‌మోట‌ర్లుగా ప‌రిగ‌ణిస్తారు. కంపెనీలో ప్ర‌మోట‌ర్ల వాటా ఎంతుందనేది చాలా కీల‌క‌మైన‌ది.

ప్ర‌మోట‌ర్లు కంపెనీ భాగ‌స్వాముల్లో ప్ర‌ధానమైన వారు. సాధార‌ణంగా ప్ర‌మోట‌ర్ల వాటా ఎంక్కువ ఉండ‌డం మంచిది. ఎందుకంటే నిర్ణ‌యాలు తీసుకునే ముందు త‌గు జాగ్ర‌త్తలు తీసుకుంటార‌ని ఒక అభిప్రాయం. అలా అని ప్ర‌మోట‌ర్ల వాటా త‌క్కువున్న కంపెనీల‌న్నీ మంచివి కాద‌ని చెప్ప‌లేం. కంపెనీ తీసుకునే నిర్ణ‌యాల్లో ఎక్కువ వాటా ఉన్న వారికి ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబ‌ట్టి ప్ర‌మోట‌ర్లు కీల‌క‌ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు.

ప్ర‌మోట‌రేత‌రులు :

వ‌ర్గంలోకి వ‌స్తే ప్ర‌ధానంగా సంస్థాగ‌త మ‌దుప‌ర్లు అందులోనూ విదేశీ సంస్థాగత మ‌దుప‌ర్లు (ఎఫ్ఐఐ) కీల‌క‌మైన‌వారు. ఇందులో విదేశీ పెట్టుబ‌డిసంస్థ‌లు (ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు) మొద‌లైన‌వి సెబీ ( స్టాక్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా ) అనుమ‌తి తీసుకుని ఉంటారు. వీరి ప్ర‌భావం కంపెనీల‌ పై త‌ద్వారా మార్కెట్ల‌ పైన ఉంటుంది. ఎఫ్ఐఐ వాటా ఎక్కువ క‌లిగిన కంపెనీలు రిటైల్ మ‌దుప‌ర్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి.

స్వ‌దేశీ సంస్థాగ‌త మ‌దుప‌ర్లు ప్ర‌ధానంగా మ్యూచువ‌ల్ ఫండ్లు, బీమా కంపెనీలు, పెన్ష‌న్ ఫండ్లు, బ్యాంకులు మొద‌లైన‌వి. వీరు త‌గు విశ్లేష‌ణ చేసిన త‌రువాత కంపెనీలు ఎంచుకుని వాటిలో మ‌దుపుచేస్తారు.

వ్య‌క్తిగ‌త మ‌దుప‌ర్లు

వ్య‌క్తిగ‌త మ‌దుప‌ర్లు సాధార‌ణంగా మ‌దుప‌ర్లు వ్య‌క్తి గతంగా కొంత సొమ్మును మ‌దుపుచేస్తారు. వారి సొంత విశ్లేష‌ణ లేదా వారి ఆర్థిక‌ స‌లహాదారి చెప్పిన ప్ర‌కారం కొన్ని కంపెనీలను ఎంచుకుని మ‌దుపుచేస్తారు. ఈ వ‌ర్గంలో అధిక‌ నిక‌ర‌ విలువ క‌లిగిన మ‌దుప‌ర్లు కూడా ఉంటారు. అంటే రెండు ల‌క్ష‌ల కంటే అధిక‌మొత్తాన్ని మార్కెట్లో మ‌దుపు చేసేవారిని హెచ్ ఎన్ ఐ లు అంటారు. అయితే వీరంతా రిటైల్ మ‌దుప‌ర్ల కేట‌గిరికి చెందుతారు.

వాటాదార్ల ప్ర‌భావం :

ఎక్కువ శాతం వాటా క‌లిగిన మ‌దుప‌ర్లు కంపెనీపై ప్ర‌భావం చూప‌గ‌ల‌రు. బోర్డు స‌మావేశంలో నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఓటింగ్ ఉంటుంది. ఒక్కో షేరుకు ఒక్కో ఓటు హ‌క్కు ఉంటుంది. అందుకే ఎక్కువ షేర్లు క‌లిగిన వారికి ఎక్కువ ఓట్లుంటాయి. కాబ‌ట్టి వారు కంపెనీ నిర్ణ‌యాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు. సాధార‌ణంగా కంపెనీల్లో ప్ర‌మోట‌ర్ల వాటా ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి వారి ప్ర‌భావం ఎక్కువ ఉంటుంది. వాటాదార్లు వ్య‌తిరేకించ‌డం ద్వారా కొన్ని నిర్ణ‌యాలు కంపెనీలు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మైన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

కంపెనీల్లో సాధార‌ణంగా మూడు ర‌కాల స‌మావేశాలు జ‌రుగుతాయి. వాటాదార్లు ఓటు హ‌క్కు వినియోగించ‌డం ద్వారా వారి అభిప్రాయాల‌ను తెలుప‌వ‌చ్చు.

 • వార్షిక సాధార‌ణ స‌మావేశం
 • వార్షిక అసాధార‌ణ స‌మావేశం
 • ప్ర‌త్యేక స‌మావేశం

కంపెనీ కార్య‌నిర్వాహ‌కులు త‌మ వాటాదార్ల విలువ‌ను పెంచే విధంగా ప‌నిచేయాలి. వాటాదార్లు కంపెనీకి ద‌న్ను వంటివారు. వ్యాపారంలో వ‌చ్చిన లాభన‌ష్టాల‌ను స్వీక‌రిస్తారు. ఒక సారి వాటాదారు అయిన వ్య‌క్తి కంపెనీ త‌మ‌కు న‌చ్చేరీతిలో ప‌నిచేయ‌కుంటే వారు త‌మ వాటాను సెకండ‌రీ మార్కెట్లో విక్ర‌యించ‌డం ద్వారా వైదొల‌గ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly