సిప్‌ చేయాలా.. పీపీఎఫ్‌లో నా?

ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసినప్పుడు స్వల్పకాలంలో కాస్త హెచ్చుతగ్గులు ఉండవచ్చు

సిప్‌ చేయాలా.. పీపీఎఫ్‌లో నా?
  • నేను ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ పాలసీలతో పోలిస్తే… నేరుగా తీసుకునే వాటికి ప్రీమియం అధికంగా ఉంటోంది. బ్యాంకు నుంచి పాలసీ తీసుకోవడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా?
  • మహేశ్‌

బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం బృంద ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తుంటాయి. ఈ పాలసీలతో కొన్ని ప్రయోజనాలున్నాయి. నేరుగా తీసుకునే పాలసీలతో పోలిస్తే వీటిలో ప్రీమియం తక్కువగా ఉంటుందన్నది వాస్తవం. ఖాతాదారుల్లో ఉండే వివిధ వయసుల వారూ… వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ పాలసీలను అందిస్తుంటారు. ఈ పాలసీని తీసుకునేప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలపై అవగాహన పెంచుకోండి. అనుమానాలు నివృత్తి చేసుకోండి. వేటికి పరిహారం ఇస్తారు… వేటికి ఇవ్వరు… వేచి ఉండే సమయం ఎంత అనేది తెలుసుకోవాలి. కొన్నిసార్లు బీమా సంస్థ, బ్యాంకుల మధ్య ఉన్న ఒప్పందం రద్దు కావచ్చు. ఇలాంటప్పుడు కూడా ఈ పాలసీని వ్యక్తిగతంగా కొనసాగించుకోవచ్చా, అనేది చూసుకోండి.

  • నేను మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం మార్కెట్లు పెరుగుతూ ఉన్నాయి కదా… ఇప్పుడు సరైన సమయమేనా?
  • రవి

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. ఇక క్రమానుగత పెట్టుబడి విధానంలో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మంచి ముహూర్తమే. ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసినప్పుడు స్వల్పకాలంలో కాస్త హెచ్చుతగ్గులు ఉండవచ్చు. దీర్ఘకాల మదుపరి వీటి గురించి ఆలోచించకూడదు. వీలైనంత తొందరగా, వీలైనంత మొత్తం పెట్టుబడులు ప్రారంభించేందుకు ప్రయత్నించండి.

  • నా వయసు 40 ఏళ్లు. నా పదవీ విరమణ నిధి కోసం ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాను. దీనికన్నా అధిక రాబడి వస్తుందని 2017 జనవరి నుంచి మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేస్తున్నాను. అయితే, నాకు కేవలం 5 శాతం మాత్రమే రాబడి అందింది. దీనికన్నా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టినా… సురక్షితంగా 8శాతం వరకూ రాబడి వచ్చేది అనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి?
  • ప్రవీణ్‌

మార్కెట్‌ ఆధారంగా పనిచేసే మ్యూచువల్‌ ఫండ్లు దీర్ఘకాలంలో ఇతర సురక్షిత పథకాలకన్నా మెరుగైన రాబడిని ఇచ్చాయనే విషయం చరిత్రను చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో ఈ పథకాల్లో కాస్త హెచ్చుతగ్గులూ అధికమే. పైగా నష్టభయమూ ఉంటుంది. కాబట్టి, మీరు ఈ స్వల్పకాలంలో రాబడి తక్కువగా వచ్చిందన్న సంగతిని మర్చిపోండి. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపును కొనసాగించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఈ నష్టాన్ని భరించలేను అనుకుంటే… పీపీఎఫ్‌లో జమ చేయొచ్చు. అయితే, ఇక్కడ ఒక లెక్క చూద్దాం… మీరు నెలకు రూ.10,000 చొప్పున మదుపు చేస్తారనుకుందాం. ఇప్పటి నుంచి మీకు 60 ఏళ్ల వయసు వచ్చే వరకూ పెట్టుబడి పెడితే… అప్పుడు… మ్యూచువల్‌ ఫండ్ల నుంచి సగటున 12శాతం రాబడి అంచనాతో… రూ.91,98,573 వచ్చేందుకు అవకాశం ఉంది. అదే పీపీఎఫ్‌ నుంచి ప్రస్తుతం ఉన్న 8శాతం రాబడితో… రూ.57,26,600 వస్తాయి. అంటే… మ్యూచువల్‌ ఫండ్లలో కొనసాగడం వల్ల రూ.34,71,973 అదనంగా వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. ఈ లెక్క చూసి, మీరే ఒక అంచనాకు రండి. మార్కెట్‌లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు అధికంగానే ఉంటాయి. ముందే చెప్పినట్లు వీటి గురించి ఆలోచించకండి. దీర్ఘకాలంపైనే దృష్టి పెట్టండి. కాస్త రిస్క్ తక్కువ ఉండే ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. డైరెక్ట్ ప్లాన్లు ఎంచుకోండి.

  • నా వయసు 28 ఏళ్లు. నేను ఇప్పటి వరకూ ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు. ప్రస్తుతం నేను నెలకు రూ.6,000 మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. నాకు ఏడాదికి రూ.24,000 వరకూ పన్ను చెల్లించాల్సి రావచ్చు. పెట్టుబడికీ, పన్ను ఆదాకూ పనికొచ్చేలా ఏదైనా పథకాలు సూచించండి?
  • బాలు

మార్కెట్లో పెట్టుబడి పెడుతూ… పన్ను ఆదా కోసం కూడా ఉపయోగపడాలంటే… ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలను (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోవచ్చు. ఇందులో మూడేళ్ల పాటు లాక్ ఇన్ ఉంటుంది. అయితే ఇవి కూడా ఈక్విటీ ఫండ్లే కాబట్టి కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేసే ఉద్దేశం ఉంటేనే ఇందులో మదుపు చేయడం మంచిది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల కోసం ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ లేదా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ టాక్స్ రిలీఫ్ 96 ఫండ్లను పరిశీలించవచ్చు. ప్రత్యామ్నాయంగా ఇతర విభాగాలను ఎంచుకోవాలనుకుంటే… యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోండి. పన్ను ఆదా కోసం జీవిత బీమా(ఆన్లైన్ టర్మ్ పాలసీ), ఆరోగ్య బీమా, పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి కోసం) కూడా పరిశీలించండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly