సొంతిల్లు కొంటున్నారా? అయితే, ఈ 6 విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి

సొంతిల్లు కోసం ఎలా సిద్ధం కావాలో, ఏం చేయాలో చూద్దామా

సొంతిల్లు కొంటున్నారా? అయితే, ఈ 6 విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి

సొంతిల్లు… ప్రతి వ్యక్తి కల. దీనిద్వారా ఆర్థికంగానూ, సామాజికంగానూ ఒక భద్రత పెరుగుతుందని భావిస్తుంటారు. ఉన్నంతలో ఒక సొంత గూటిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఒక దశలో కుదురుగా ఉండనీదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది ఆందోళనగా మారుతుంది. కానీ, కొద్దిగా ప్రణాళికతో వ్యవహరించి, ముందునుంచీ జాగ్రత్తగా ఉంటే… సొంతిల్లు పెద్ద కష్టమేమీ కాదు. మరి, అందుకోసం ఎలా సిద్ధం కావాలో చూద్దామా!

ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు 30 ఏళ్లలోపే సొంతింటిని కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా దంపతులిద్దరూ ఆర్జిస్తున్న వారు సొంతింటి కలను తొందరగా నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. వివాహమైన తర్వాత కొన్నేళ్లపాటు వేచి చూసి, ఆదాయంలో స్థిరత్వం రాగానే తొలి పెట్టుబడిగా ఇంటినే ఎంచుకుంటున్న వారు చాలామంది ఉంటున్నారు. ఇప్పటికే 5-6 ఏళ్లపాటు ఉద్యోగం చేసి ఉంటారు కాబట్టి, ఖర్చులు ఎంత అవుతున్నాయి? ఎంత మిగులుతోంది అనే స్పష్టత వారికి వచ్చి ఉంటుంది. అయితే, జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఇల్లు కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి? ఇల్లు కొన్నాక భవిష్యత్తు ఆర్థిక ప్ర ణాళికలు ఎలా ఉండాలి అనే విషయాలపై స్పష్టత కూడా రావాలి…

  1. వ్యవధి ఎక్కువ… ఈఎంఐ తక్కువ…

చిన్న వయసులోనే సొంతిల్లు కోసం రుణం తీసుకోవడం వల్ల దానిని తిరిగి చెల్లించేందుకు కావాల్సినంత వ్యవధి దొరుకుతుంది. రుణ వ్యవధిని నిర్ణయించుకునేందుకు కొంత వెసులుబాటూ ఉంటుంది. వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నెలసరి వాయిదాల (ఈఎంఐ) భారం కూడా అంతగా ఉండదు. ఫలితంగా ఖర్చుల కోసం పెద్దగా ఇబ్బందీ ఉండదు.

  1. పన్ను భారం లేకుండా…

పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు ఆదాయ పన్ను నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్ను భారం తగ్గించుకునేందుకు గృహరుణం ఎంతో ఉపయోగపడుతుంది. దంపతులిద్దరూ ఉద్యోగులే అయినప్పుడు… వారిద్దరూ చెల్లించే పన్నును కలిపి చూస్తే అది అధికంగానే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గృహరుణం ఉంటే… పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24 ప్రకారం… సొంతింటి కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతోపాటు అసలును సెక్షన్‌ 80సీ కింద చూపించుకోవచ్చు. ఇందులో నిబంధనల మేరకు రూ.1,50,000 వరకూ చూపించుకునే వీలుంటుంది. మొదటిసారి ఇల్లు కొన్న వారికి అదనంగా రూ.50,000 వరకూ అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

  1. ధరలు పెరగకముందే…

భారత దేశంలో యువత సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ సగటు వయసు 27.3 ఏళ్లు. ఏటా దాదాపు 50 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మనది వేగంగా అభివృద్ధి చెందుతోంది. సామాజికంగానూ అనేక మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో స్థిరాస్తి ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇళ్ల మార్కెట్‌లో పోటీ పెరిగింది. ఇది రోజులు గడుస్తున్న కొద్దీ అధికంగానే ఉంటుంది. దేశంలో పట్టణాల సంఖ్య పెరుగుతుండటం, చిన్న కుటుంబాల సంఖ్య అధికం అవుతుండటం వంటి కారణాల వల్ల ఇల్లు కొనాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా పలు అంశాలు భవిష్యత్తులో ఇళ్ల ధరలను పెంచడంలో కీలకపాత్ర వహిస్తున్నాయి. ఇల్లు కొనాలనే ఆలోచన, అవకాశం ఉండి… ఆలస్యం చేస్తుంటే అధిక ధర పెట్టి కొనాల్సిన పరిస్థితులు రావచ్చు. కాబట్టి, ముందే జాగ్రత్తపడటం అవసరం.

  1. పెట్టుబడులూ… ఖర్చులూ…

ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలో ఖర్చులు ఎంత అవుతున్నాయనే విషయంలో పెద్దగా పట్టింపు ఉండదు. ఇది ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది కూడా. దీనికి బదులుగా ఆదాయంలో స్థిరత్వం రాగానే ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన వస్తే… రుణం తీసుకొని, అందుబాటులో ఉన్న ఇల్లును కొన్నారనుకోండి… దానికి వాయిదాలు చెల్లించడం, మిగిలిన మొత్తాన్నే ఖర్చు చేయడంలాంటి విషయంలో ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. అద్దెకు బదులుగా సొంతింటి కోసం తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించడం ద్వారా ఇదీ ఒక సుదీర్ఘ పెట్టుబడిని ప్రారంభించినట్లు అవుతుంది. దీర్ఘకాలంలో ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. పైగా సొంతిల్లు ఆర్థిక భద్రతనూ ఇస్తుంది.

  1. వడ్డీలో రాయితీ…

ఇల్లు కొనకుండా అద్దెకు ఉండవచ్చు. ఇది ఒక ప్రత్యామ్నాయమే. కానీ… సొంతిల్లు ఉండటం అనేది మానసికంగా కొండంత ధైర్యాన్ని ఇస్తుందనేది ఒక నమ్మకం. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలని ప్రభుత్వమూ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు ఆకర్షణీయమైన పథకాలను అందిస్తోంది. పన్ను ప్రయోజనాలతోపాటు… ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొదటిసారి ఇల్లు కొన్న వారికి ఇందులో భాగంగా నిబంధనల మేరకు ప్రభుత్వం చెల్లించే వడ్డీలో కొంత భాగాన్ని సబ్సిడీ రూపంలో అందిస్తుంది. దీనికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఇంటి రుణ భారం తగ్గించుకునే వీలుంది.

  1. పెట్టుబడి వృద్ధి…

భారత దేశంలో వ్యక్తికీ… భూమికీ విడదీయరాని సంబంధం ఉంది. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. అందులోనూ ఇంటి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఆదుకునేవి భూమి, ఇల్లులే. ఇక మన దేశంలో వీటి ధరలు దీర్ఘకాలంలో పెరిగేవే కానీ… తగ్గడం అంత సులభం కాదు. సొంతిల్లు మీకు ఆర్థికంగా రక్షణ ఇవ్వడంతోపాటు… పెట్టుబడి వృద్ధికీ సహాయపడుతుంది. చిన్న వయసులోనే ఇంటిపై పెట్టుబడి పెట్టినవారికి కాలం గడుస్తున్న కొద్దీ వారు పెట్టుబడి పెట్టిన మొత్తం కన్నా… అధిక ప్రయోజనం లభిస్తుందనడంలో సందేహం ఉండదు.

చివరి మాట:

ఇల్లు కొనడం అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం. అయితే, దీని కోసం ఇతర ఆర్ధిక లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకండి. వీలయితే, కొన్నేళ్ల పాటు ఇల్లు కొనడాన్ని వాయిదా వేసుకుని డౌన్ పేమెంట్ కోసం ఇప్పటి నుంచే మదుపు చేయండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly