యాప్ ల ద్వారా అరచేతిలో ఆరోగ్యం...

స్మార్ట్‌ఫోన్ లోని కొన్ని యాప్‌లు, గేమ్‌లు ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, మంచి నిద్ర వ‌చ్చేలా చేయ‌డంలో, ఏకాగ్ర‌త పెంపొందించ‌డంలో స‌హ‌క‌రిస్తాయి.

యాప్ ల ద్వారా అరచేతిలో ఆరోగ్యం...

మీ ఆరోగ్యాన్నిఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ద్వారా సంర‌క్షించుకోవ‌చ్చు. అదేంటి! స్మార్ట్‌ఫోన్ ఎక్కువ‌గా వాడితే ఆరోగ్యానికి హానికరం అంటారు క‌దా! మ‌రి మీరేంటి ఆరోగ్య సంర‌క్ష‌ణ స్మార్ట్ ఫోన్‌తో సాధ్యం అంటున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

కొన్ని ర‌కాల యాప్‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకునేలా, వ్యాయామాలు చేసేలా ప్రోత్స‌హిస్తుంటాయి. మ‌రి కొన్ని యాప్‌లు బుద్ధికి ప‌దును పెట్టే ఆట‌లు ఆడించేలా చేస్తాయి. కొన్ని సంగీత యాప్‌లు ఒత్తిడిని త‌గ్గించ‌డంలో స‌హాయప‌డ‌తాయి. ఆస‌క్తిగా అనిపిస్తోందా? స‌్మార్ట్ ఫోన్ యాప్‌లు అందించే మ‌రిన్ని సేవ‌ల‌ను ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం.

వీడియోగేమ్‌ల‌తో మాన‌సిక ఆరోగ్యం…

 • వీడియోగేమ్‌లు ఆడ‌టం వ‌ల్ల కొన్ని ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్న‌ట్టు ప‌రిశోధ‌న‌లు తెలుపుతున్నాయి. ఏకాగ్ర‌త‌ను పెంపొందించి, అంత‌ర్గ‌త నైపుణ్యాల మెరుగుద‌ల‌కు తోడ్ప‌డేలా చేసి ఒత్తిడిని త‌గ్గించ‌గ‌ల‌వ‌ని ఈ అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

 • స్పెయిన్‌లోని ఓపెన్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క్యాట‌లోనియో వారు నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం, క‌ళ్ల‌తో చూసినవాటి జ్ఞాపకాల ఆన‌వాళ్లు మెద‌డు పొర‌ల్లో నిక్షిప్త‌మై ఉంటాయ‌ని క‌నుగొన్నారు. విజువ‌ల్స్ లో చూసేదేదైనా ఎక్క‌వ కాలంపాటు గుర్తుండిపోతుంటుంది. వీడియోగేమ్‌లు త‌ర‌చూ ఆడేవారిలో దీన్ని ఎక్కువ‌గా గ‌మ‌నించ‌వ‌చ్చు, అస‌లు ఆడ‌నివారిలో ఈ గ్ర‌హ‌ణ శ‌క్తి అంతంత‌మాత్రంగా ఉంటుందని వారు చెబుతున్నారు.

ప‌జిల్స్ ఆడేవారి సంగ‌తి…

 • ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ గెరియాట్రిక్ సైకియాట్రీ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన విధంగా ప‌జిల్స్ ఆడేవారిలో ఆలోచ‌నా ధోర‌ణి మెరుగ్గా ఉంటుంద‌ని తెలిపారు. ఈ ఆట‌ల‌ను క్ర‌మంతప్ప‌కుండా ఆడేవారు ఏకాగ్ర‌త‌గా ఉండేదుకు, త్వ‌ర‌గా ఆలోచించేందుకు, జ్ఞాపక శ‌క్తి పెంచుకునేలా తోడ్ప‌డ‌తాయి.
 • న్యూరో నేష‌న్, ల్యూమోసిటీ లాంటి ఆన్‌లైన్ ఆట‌లు చిన్న చిన్న ప‌జిల్స్ అందిస్తుంటాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఆట‌లు ఆడేవారు త్వ‌ర‌లో స‌మాచారాన్ని ఎలా క్రోడీక‌రించాలో నేర్చుకుంటారు.

ఒత్తిడిని త‌గ్గించేవి…

 • కొన్ని యాప్‌లు ఒత్తిడిని త‌గ్గించ‌డంలో ముందుంటాయి. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో గ‌ల నార్త్ వెస్ట్ర‌న్ యూనివ‌ర్సిటీ వారు చేసిన ప‌రిశోధ‌న‌లో భాగంగా ఇంటెల్లి కేర్ అనే యాప్ ఒత్తిడిని త‌గ్గించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని క‌నుగొన్నారు. ఈ యాప్ ల‌లో ఉండే ఇంట‌ర్‌యాక్టివ్ వీడియోలు వ్య‌క్తుల ఒత్తిడిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.

ధ్యానం ద్వారా…

 • కొన్ని ర‌కాల మొబైల్ యాప్‌లు ఒత్తిడిని త‌గ్గించేందుకు ధ్యానంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటాయి. ధ్యానంతో కూడిన వ్యాయామాలు ఇవి అందిస్తాయి. ఇంతేకాకుండా గుండె ప‌నితీరును, నాణ్య‌మైన నిద్ర‌ను ఈ యాప్‌ల ద్వారా ట్రాక్ చేసేందుకు కుదురుతుంది.
 • అజుమియో సంస్థ‌ వారి ఇన్‌స్టంట్ హార్ట్ రేట్ మానిట‌ర్ అనే యాప్ … నిదానంగా ఊపిరి తీసుకునే టెక్నిక్స్‌ను యూజ‌ర్స్‌కు నేర్పిస్తుంది.
 • ఫోన్‌కున్న వెన‌క కెమెరాను చేతి వేలితో తాకి గుండె ప‌నితీరును తెలుసుకోవ‌చ్చు. నాడీ మండ‌లంలో జ‌రిగే మార్పుల వ‌ల్ల‌ వేలి కొస‌న క‌లిగే రంగుల మార్పిడితో ఇది సాధ్య‌మ‌వుతుంది.

ఫిట్‌నెస్ బ్యాండ్ల‌తోనూ…

కొన్ని ర‌కాల ఫిట్‌నెస్ బ్యాండ్ల‌తోనూ ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. షియోమీ ఎంఐ బ్యాండ్ 2, గోఖి, ఫిట్‌బిట్ చార్జ్ 2 లాంటి ప‌రిక‌రాలు గుండె ప‌నితీరును, నాణ్య‌మైన నిద్ర‌ను కొలిచి మ‌నకు తెలుపుతాయి.

 • నాణ్య‌మైన నిద్ర‌, గుండె రేటు, క‌రిగించిన క్యాల‌రీలు లాంటి స‌మాచారాన్ని వివ‌రంగా ఫిట్‌నెస్ బ్యాండ్ల‌తో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. వీటిని స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాప్‌ల‌తోనూ లింక్ చేసుకోవ‌చ్చు.
 • హెడ్‌స్పేస్, బ్రీతీ లాంటి యాప్‌లు యూజ‌ర్ల‌కు అల‌స‌ట‌, ఆందోళ‌న‌, నిద్ర‌లేమి లాంటి వాటిని అధిగ‌మించేలా ధ్యానం లాంటి వాటిని నేర్పిస్తాయి. యోగా, ధ్యానం, వ్యాయామం చేసేందుకు రిమైండ‌ర్ల‌ను ఈ యాప్‌ల స‌హాయంతో సెట్ చేసుకోవ‌చ్చు.

ఆరోగ్య‌క‌ర‌మైన డైట్‌

 • కొన్ని ర‌కాల మొబైల్‌ యాప్‌లు రుచితో పాటు త‌క్కువ క్యాల‌రీలున్న ఆహారాన్ని క‌నుగొనేందుకు స‌హాయప‌డ‌తాయి.
 • సోని సంస్థ వారి లైఫ్ లాగ్ యాప్ ఏదైనా ఆహార ప‌దార్థంలో ఎన్ని క్యాల‌రీలున్నాయి, వాటి పోష‌క విలువ‌లేమిటో తెలియ‌జేస్తాయి. ఇదంతా ఒక ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.
 • ద వెయిట్ మానిట‌ర్ అనే యాప్ యూజ‌ర్స్‌కు క‌స్ట‌మైజ్డ్ డైట్ ప్లాన్‌లు, బ‌రువు త‌గ్గించే ప్రోగ్రాములను అందిస్తుంటుంది. ఇంతేకాకుండా పోష‌కాహార నిపుణుల‌తో నేరుగా సంప్ర‌దించి మాట్లాడేందుకు అనుమ‌తిస్తుంది. ఈ యాప్‌లో స్కోరు తెలిపే విధాన‌ముంది. బ‌రువు త‌గ్గే క్ర‌మంలో ఈ రోజు ఎంత శ్ర‌మించిందీ ఈ స్కోరును బ‌ట్టి తెలుసుకోవ‌చ్చు. ఈ యాప్ నిరంత‌రం స్పూర్తి నింపుతుంది.
 • తినే ఆహారంపై త‌గిన అవ‌గాహ‌న క‌ల్పించి, క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉండే వాటిని నిరోధించేలా ఈ యాప్‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేశారు.

వ్యాయామం చేయిస్తాయి

 • స్మార్ట్‌ఫోన్లు జీపీఎస్‌, యాక్సిలోమీట‌ర్ లాంటి బిల్ట్ ఇన్ టూల్స్‌తో వ‌స్తున్నాయి. ఇవి వ్య‌క్తి శారీర‌క క‌ద‌లిక‌ల‌ను, న‌డక గ‌మ‌నాన్ని, క‌రిగించిన క్యాల‌రీల‌ను లెక్కిస్తాయి.
 • గూగుల్ ఫిట్‌, 5కే ర‌న్న‌ర్ లాంటి యాప్‌లు ఇలాంటి కోవ‌కు చెందిన‌వే.
 • 5కే ర‌న్న‌ర్ మ‌రి కాస్త ముందుకెళ్లి ప‌రుగుతో కూడిన వ్యాయామాల‌పై దృష్టి పెడుతుంది. వ్యాయామానికి సంబంధించి యూజ‌ర్లకు వివిధ లెవ‌ల్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని బ‌ట్టి ప‌రుగు వేగాన్నినిర్ణ‌యిస్తారు.
 • యాప్‌టివ్ అనే యాప్ వ‌ర్క‌వుట్ల‌ను ఎలా చేయాలో నేర్పిస్తుంది. స‌మీపంలో జిమ్‌లు లేనివారికి ఈ యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. వీడియోలు, ఆడియోల ద్వారా వివిధ ర‌కాల ఫిట్‌నెస్ ప్రోగ్రాముల‌ను ఈ యాప్ అందిస్తుంది. యాబ్స్ వ‌ర్క‌వుట్లు, ప‌రుగు లాంటివాటికి సంబంధించి కూడా వీడియోలుంటాయి. వాటిని చూసి మ‌న‌మూ చేయ‌వ‌చ్చు.

ఫిట్‌గా, హెల్దీగా ఉండేందుకు స్మార్ట్‌ఫోన్లు ఎంతో స‌హ‌క‌రిస్తున్నాయి. యాప్‌ల‌ను స‌మ‌ర్థంగా వినియోగించుకోగ‌లిగితే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌గ‌లుగుతాం. ఆరోగ్యం బాగుంటేనే ఆర్థికంగానూ బాగుంటాం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly