మ్యూచువ‌ల్ ఫండ్ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డి చేసేవారు మ్యూచువ‌ల్ ఫండ్ల సమ‌స్య ప‌రిష్కార విధానం గురించి తెలుసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబడుల విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే పెట్టుబడిదారులు తమ స‌మ‌స్య‌ల‌కు ఎలా ప‌రిష్క‌రించుకోవాలి అనే అవ‌గాహ‌న కూడా ఉండాలి. మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డి చేసేవారు మ్యూచువ‌ల్ ఫండ్ల సమ‌స్య ప‌రిష్కార విధానం గురించి తెలుసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. మ్యూచువ‌ల్ పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఏవైనా సమ‌స్య‌లు వ‌స్తే ప‌రిష్కారం పొందేందుకు రెండు ర‌కాల ప‌ద్ధ‌తులను అవ‌లంబించాలి.

  1. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ ద్వారా, 2. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్కోర్ వెబ్‌సైట్ ద్వారా ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు.
    స‌మ‌స్య‌లు త‌లెత్తిన మ‌దుప‌ర్లు ముందుగా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌కు తెలియ‌చేయాలి. వారు చూపిన పరిష్కారంతో సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యగా సెబీ ఫిర్యాదుల స్వీకరణ విభాగం (స్కోర్స్‌)లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు తమ వినియోగ‌దారుల‌కు త‌లెత్తే పెట్టుబ‌డి సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు టోల్ ఫ్రీ నంబ‌ర్లు ఇత‌ర మార్గాల్లో తెలిపేందుకు అవ‌కాశాల‌ను క‌లిపిస్తున్నాయి. కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఆన్‌లైన్‌ విధానంలో ఫిర్యాదుల‌ను తీసుకుంటున్నాయి. దీనికి మ‌దుప‌ర్లు త‌మ ఫోలియో నంబ‌రు, రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌రు, ఈ మెయిల్ త‌దిత‌ర వివ‌రాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. ఆన్ లైన్ లో స‌రైన ప‌రిష్కారం ల‌భించ‌లేద‌ని వినియోగ‌దారుడు భావిస్తే మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ వినియోగ‌దారుల సేవ‌ల విభాగానికి చెందిన‌ పై స్థాయి అధికారుల‌కు తెల‌పాలి. ఆన్‌లైన్‌ విధానంలో కుద‌ర‌ని వారు నేరుగా మ్యూచువ‌ల్ ఫండ్ కార్యాల‌యానికి వెళ్లి నేరుగా స‌మ‌స్య‌ను తెల‌పాలి.

పెట్టుబడిదారుని ఫిర్యాదుకు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ చూపిన పరిష్కారంతో సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యగా సెబీ ఫిర్యాదుల స్వీకరణ విభాగం (స్కోర్స్‌)లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. వెబ్‌ ఆధారిత కేంద్రీకృత ఫిర్యాదుల స్వీకరణ విభాగాన్నే క్లుప్తంగా స్కోర్స్‌ అంటారు. స్కోర్స్‌తో పరిచయంలేని, వెబ్‌సైట్‌కు అందుబాటులో లేని పెట్టుబడిదారులు తమ ఫిర్యాదులను స్వయంగా లేదా పోస్టు ద్వారా సెబీ కార్యాలయాలకు చేరవేసే అవకాశమూ ఉంది. ఇలాంటి ఫిర్యాదులను స్కాన్‌ చేసి స్కోర్స్‌ మాధ్యమంలో అప్‌లోడ్‌ చేసి సమస్య పరిష్కారానికి స్వీకరిస్తారు. స్కోర్స్‌ మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేసే విధానం - వెబ్‌సైట్‌ http://scores.gov.in లోకి లాగిన్‌ అవ్వాలి. అనంత‌రం complaints registration ట్యాబ్‌పై క్లిక్‌ చెయ్యాలి. అక్కడ సంబంధిత వివరాలను, డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి పీడీఎఫ్ (2 ఎమ్‌బీ కి మించ‌కుండా)ను జ‌త‌చేయాలి. అన్ని వివరాలు నమోదు చేశాక ఈమెయిల్‌ లేదా ఎస్సెమ్మెస్‌ రూపంలో ఫిర్యాదు స్వీకరించినట్టు సమాచారం అందుతుంది. ఒక ప్రత్యేకమైన ఫిర్యాదు రిజిస్ట్రేషన్‌ నంబ‌రును కేటాయిస్తారు. ఈ నంబ‌రు ద్వారా ఫిర్యాదు స్థితిని ట్రాక్‌ చేసే వీలు ఉంటుంది.

స్కోర్స్ ద్వారా వ‌చ్చిన ఫిర్యాదుల‌ను సెబీ స‌ద‌రు సంస్థ‌ల‌కు పంపిస్తుంది. 30 రోజుల్లోగా వినియోగ‌దారునికి సంబంధిత ఫండ్ సంస్థ నుంచి స‌మాధానం ల‌భించాలి. ఈ వ్య‌వ‌హారాన్ని స్కోర్స్ ట్రాక్ చేస్తుంది. అప్ప‌టికీ వినియోగ‌దారుడు స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని భావించి స్కోర్స్ అన్‌సాటిస్‌ఫ‌యిడ్ అని టిక్ చేస్తే సంబంధిత సెబీ అధికారి ఈ స‌మ‌స్య‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. స్కోర్స్ ద్వారా కూడా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని వినియోగ‌దారుడు అనుకుంటే చ‌ట్టం ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారానికి వెళ్ల‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly