పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ 2019లో చేసిన మార్పులు

పీపీఎఫ్ ప‌థ‌కం 2019లో కూడా ఖాతా తెరిచిన సంవ‌త్స‌రం నుంచి 5 ఆర్థిక సంవ‌త్స‌రాలు పూరైన త‌ర్వాత ముందుస్తు మూసివేత‌కు అనుమ‌తి ఉంటుంది

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ 2019లో చేసిన మార్పులు

ప్ర‌భుత్వం డిసెంబ‌రు 12వ తేదీన ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్‌) ప‌థ‌కం 2019 గురించి నోటిఫై చేసింది. ప్ర‌భుత్వ సేవింగ్ ప్ర‌మోష‌న్ యాక్ట్ 1873, సెక్ష‌న్ 3ఏ ప్ర‌కారం ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ స్కీమ్‌,1968 స్థానంలో ప‌బ్లిక్ ప్రావిడెండ్ ప‌థ‌కం 2019ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఈ కింది అంశాల‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది.

1.రుణంపై వ‌డ్డీ తగ్గింపు:
పీపీఎఫ్ స్కీమ్ 1968 ప్ర‌కారం, పీపీఎఫ్ ఖాతాలో రుణం తీసుకుంటే, పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేసిన మొత్తంపై వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 2 శాతం ఎక్కువ వ‌డ్డీని చెల్లించాల్సి వ‌చ్చేది. ఉదాహ‌ర‌ణ‌కు, పీపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై మీకు 8 శాతం వ‌డ్డీ వ‌స్తుంటే, తీసుకున్న రుణంపై మీరు 10 శాతం వ‌డ్డీ చెల్లించాలి. అయితే తాజా పీపీఎఫ్ స్కీమ్ 2019 ప్ర‌కారం ఈ రేటు వ‌డ్డీని 1 శాతానికి త‌గ్గించారు. అంటే పీపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై మీకు 8 శాతం వ‌డ్డీ వ‌స్తుంటే, పీపీఎఫ్‌లో తీసుకున్న రుణంపై 9 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఆ రెండు సంద‌ర్భాల‌లోనూ రుణం తీసుకున్న నెల మొద‌టి రోజు నుంచి రుణ ఆఖ‌రి వాయిదా చెల్లించిన నెల చివ‌రి రోజు వ‌ర‌కు వ‌డ్డీ విధిస్తారు.

2.ముంద‌స్తు మూసివేత‌:

  • పీపీఎఫ్ ఖాతాను కాల‌ప‌రిమితి కంటే ముందే క్లోజ్ చేసేందుకు ప్ర‌భుత్వం 2016లో అనుమ‌తించింది. ఇంత‌కు ముందు ఉన్న‌ట్లుగానే పీపీఎఫ్ ప‌థ‌కం 2019లో కూడా ఖాతా తెరిచిన సంవ‌త్స‌రం నుంచి 5 ఆర్థిక సంవ‌త్స‌రాలు పూరైన త‌ర్వాత ముందుస్తు మూసివేత‌కు అనుమ‌తి ఉంటుంది. ఇందు కోసం పీపీఎఫ్ స్కీమ్‌,2019 కింద ఫారం 5ను ప్ర‌త్యేకంగా రూపొందించారు.
  • ఖాతాదారుడు లేదా అత‌ని జీవిత భాగ‌స్వామి, అత‌ను లేదా ఆమెపై ఆధార‌ప‌డిన పిల్లలు, త‌ల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యాలు లేదా ప్రాణాంత‌క వ్యాధుల భారిన ప‌డిన‌ప్పుడు, ఖాతా ముంద‌స్తు వేసివేత‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించేది. ప్ర‌స్తుత ప‌ధ‌కంలో కూడా ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయ‌లేదు.
  • ఖాతాదారుడు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించేందుకు కావ‌ల‌సిన మొత్తం కోసం పీపీఎఫ్ ఖాతాను మూసివేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించేది. అయితే ప్ర‌స్తుతం ఈ సౌక‌ర్యాన్ని ఖాతాదారుని పిల్ల‌ల‌కు కూడా విస్త‌రించింది. ఖాతాదారుడు లేదా అత‌నిపై ఆధార‌ప‌డిన పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం ఖ‌తాను మూసివేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది. అయితే భార‌త‌దేశంలో లేదా విదేశాల‌లో గుర్తింపు పొందిన ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌లో ప్ర‌వేశాన్ని ధృవీక‌రించే ప‌త్రాలు, ఫీజుల చెల్లింపున‌కు సంబంధించిన బిల్లుల‌ను చూపించ‌డం త‌ప్ప‌నిస‌రి.
  • పీపీఎఫ్ ప‌థ‌కం 2019 లో ముంద‌స్తు మూసివేత‌కు మూడ‌వ అంశాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అది ఖాతాదారుడు రెసిడెన్సీ స్థితి(నివ‌సిస్తున్న ప్రాతం) మారిన‌ప్పుడు
  • ఒక‌వేళ పైన తెలిపిన వాటిలో ఏదైనా కార‌ణం చేత కాల‌ప‌రిమితి కంటే ముందుగానే ఖాతాను మూసివేస్తే, సాధార‌ణంగా పీపీఎఫ్ ఖాతాకు చెల్లించే వ‌డ్డీకంటే 1 శాతం త‌క్కువ వ‌డ్డీని పొందుతారు.

3.డిపాజిట్లు:
పీపీఎఫ్ ప‌థ‌కం 1968 ప్ర‌కారం రూ.5 గుణిజాల‌లో డిపాజిట్లు చేయ‌వ‌చ్చు. ఒక సంవ‌త్స‌రం కాల‌వ్య‌వ‌ధిలో గ‌రిష్టంగా 12సార్లు డిపాజిట్ చేసేందుకు అనుమ‌తించేవారు. అయితే పీపీఎఫ్ ప‌థ‌కం 2019 ప్ర‌కారం రూ.50 గుణిజాల‌లో డిపాజిట్ల‌ను అనుతిస్తారు. డిపాజిట్ల సంఖ్య‌పై గ‌రిష్ట ప‌రిమితి లేదు. మ‌రో మాట‌లో చెప్పాలంటే గ‌రిష్ట ప‌రిమితికి లోబ‌డి రూ.50 గుణిజాల‌లో ఒక సంవ‌త్స‌రం లో ఎన్ని సారైనా డిపాజిట్ చేయ‌వ‌చ్చు. వార్షికంగా క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ఒక సంవ‌త్స‌రంలో గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయవ‌చ్చు.

4.ప్ర‌వాస భార‌తీయులు(ఎన్ఆర్ఐ)ల‌కు:
పీపీఎఫ్ ప‌థ‌కం 1968 ప్ర‌కారం ప్ర‌వాస భార‌తీయులు పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు వీలులేదు. అయితే ఖాతా ప్రారంభించిన త‌రువాత ఎన్ఆర్ఐగా మారిన భార‌తీయులు మెచ్యూరిటీ పిరియ‌డ్ వ‌ర‌కు వారి ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌చ్చా…అనే విష‌య‌మై పీపీఎఫ్ ప‌థ‌కం 2019లో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అదే విధంగా పీపీఎఫ్ ఖాతా తెరిచిన త‌రువాత ఎన్ఆర్ఐలుగా మారిన వారు చందాను కొన‌సాగించవ‌చ్చా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌లేదు. అయితే ఖాతా తెరిచే వ్య‌క్తి భార‌తీయుడు… అని ఖాతా తెరిచే స‌మ‌యంలో(ఫార‌మ్‌1) డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. ఒక‌వేళ నివాసం మారితే ఖాతా తెరిచిన 5 సంవ‌త్స‌రాల త‌రువాత శాశ్వ‌తంగా ఖాతాను మూసివేసే అవ‌కాశాన్ని ప్ర‌స్తుత పీపీఎఫ్ ఫ‌థ‌కంలో క‌ల్పించారు. ఖాతా ఓపినింగ్ ఫారంలో మాత్రం కొత్త పీపీఎఫ్ ఖాతా భార‌తీయుల‌కు మాత్ర‌మే అని తెలియ‌జేశారు.

5.ఫార‌మ్ మార్పులు:
ఖాతా తెరిచేందుకు: ‘ఫార‌మ్ ఏ’ నుంచి ‘ఫారం 1’ గా మార్పు చేశారు.
కాంట్రీబ్యూష‌న్ ఫారం: ఇంత‌కు ముందు ‘ఫారం బి’ ఉండేది. ప్ర‌స్తుత కొత్త ప‌థ‌కం కింద ఫార‌మ్‌ని తెలియ‌జేయ‌లేదు.
పాక్షిక విత్‌డ్రాల‌కు: ‘ఫార‌మ్ సీ’ నుంచి ‘ఫారం 2’ గా మార్పు చేశారు.
కాల‌వ్య‌వ‌ధి పూరైన అనంత‌రం: ‘ఫార‌మ్ సీ’ నుంచి ‘ఫారం 3’ గా మార్పు చేశారు.
పీపీఎఫ్ రుణం: ‘ఫార‌మ్ డీ’ నుంచి ‘ఫారం 2’ గా మార్పు చేశారు.
కాల‌వ్య‌వ‌ధి పొడిగించుకునేందుకు: ‘ఫార‌మ్ హెచ్‌’ నుంచి ‘ఫారం 4’ గా మార్పు చేశారు.
ముంద‌స్తు మూసివేత‌కు: ఇంత‌కు ముందు ఫారం లేదు. ఇప్పుడు ‘ఫారం 5’ ని ప్రేవేశ‌పెట్టారు.
నామినీ: ‘ఫారం ఇ’ నుంచి ‘ఫారం 1’ కి మార్చారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly