నేటి నుంచి ప్రారంభ‌మైన‌ గోల్డ్ బాండ్ల స‌బ్‌స్క్రిప్షన్

ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసేవారికి గ్రాముకు రూ. 50 తగ్గింపును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది

నేటి నుంచి ప్రారంభ‌మైన‌ గోల్డ్ బాండ్ల స‌బ్‌స్క్రిప్షన్

సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల 2019-20 సిరీస్ VIII స‌బ్‌స్క్రిప్ష‌న్ నేడు ప్రారంభ‌మైంది. ప్ర‌భుత్వం త‌రపున రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఈ బాండ్ల‌ను జారీ చేస్తుంది. అందువ‌ల్ల పెట్టుబ‌డికి హామీ ఉంటుంది. గ్రాము బంగారం ధ‌ర రూ. 4,016 గా నిర్ణయించారు. అంతేకాకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో బాండ్ కొనుగోలు కోసం చెల్లింపు చేసేవారికి గ్రాముకు రూ. 50 తగ్గింపును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆన్‌లైన్‌లో స‌బ్‌స్క్రైబ్‌ చేసుకునే చందాదారుల‌కు గ్రాము బంగారం రూ.3,966 కే అందుబాటులో ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ జ‌న‌వ‌రి 17, 2020. ఒక‌ గ్రాము యూనిట్ గా ప‌రగ‌ణించి బంగారు బాండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. క‌నీసం ఒక గ్రాము నుంచి పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు.

ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) ప్రచురించిన ధ‌ర ఆధారంగా మ‌దుప‌ర్లు బాండ్ల‌లో పెట్టుబ‌డి చేయాలి. 999 స్వచ్ఛత బంగారు ధర స‌బ్‌స్క్రిప్ష‌న్ ముందు వారం చివరి మూడు పని దినాలలో ఉన్న ధ‌ర‌కు స‌గ‌టు లెక్కించి ధ‌ర నిర్ణ‌యిస్తారు. పెట్టుబడిదారులకు బాండ్లపై 2.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. 9 వ విడ‌త‌ ప‌సిడి బాండ్లను ఫిబ్ర‌వ‌రి 03 నుంచి 07 వర‌కు, 10 విడుత ప‌సిడి బాండ్లను మార్చి 02 నుంచి 06 వర‌కు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు ఆర్‌బీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

ప‌సిడి ప‌థ‌కాల‌పై ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు:

  • ప్రస్తుతం, సావరిన్ బంగారు బాండ్లు పెట్టుబడి మొత్తంపై వార్షికంగా 2.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ప్ర‌తీ ఆరు నెల‌ల‌కు ఒక‌సారి చందాదారుని బ్యాంక్ ఖాతాకు వ‌డ్డీ జమ అవుతుంది. చివ‌రి ఆరునెల‌ల వ‌డ్డీని మెచ్యూరిటీ స‌మ‌యంలో అస‌లు మొత్తంతో క‌లిపి చెల్లిస్తారు. ప‌సిడి బాండ్ల‌పై అందుకున్న వడ్డీకి పన్ను వ‌ర్తిస్తుంది. వడ్డీ ఆదాయాన్ని, వ్య‌క్తిగ‌త‌ ఆదాయంతో క‌లిపి వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) విధించరు.

  • సావరిన్ బంగారు బాండ్లకు ఎనిమిది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన రాబ‌డిపై పన్ను వర్తించదు. మూలధన రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపు ప‌సిడి బాండ్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్స్, భౌతిక బంగారం వంటి ఇత‌ర పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు.

  • మెచ్యూరిటీ స‌మ‌యంలో ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాలలో ఉన్న ధ‌ర‌కు స‌గ‌టు లెక్కించి దాని ప్ర‌కారం చెల్లింపులు చేస్తారు.

  • భౌతికంగా బంగారం కొనుగోలు చేసేవారికి 3 శాతం జీఎస్‌టీతో పాటు, త‌యారీ ఛార్జీలు వంటి అద‌నుపు రుస‌ములు వ‌ర్తిస్తాయి. అయితే సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌పై జీఎస్‌టీ వ‌ర్తించ‌దు.

ఇత‌ర వివ‌రాలు:
భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేయ‌డం కంటే బాండ్ల‌ను కొనుగోలు చేయ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా బంగారం దాచిపెట్ట‌డానికి అయ్యే ఖ‌ర్చు, అద‌న‌పు రిస్క్‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

చందాదారులు 8 సంవ‌త్స‌రాల కంటే ముందుగానే ప‌థ‌కం నుంచి నిష్క్ర‌మించే అవ‌కాశం కూడా ఉంది. విత్‌డ్రా చేసే స‌మ‌యానికి ఉన్న బంగారం ధ‌ర‌ల ఆధారంగా రాబ‌డి ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్‌ల‌ ద్వారా బాండ్ల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు లేదా జారీ చేసిన తేదీ నుంచి 5వ సంవ‌త్స‌రంలో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈ రెండు విధానాల‌లోనూ మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly