ఆలస్యం ఎందుకు? వెంట‌నే ప్రారంభించండి

పీపీఎఫ్‌తో పెట్టుబడి భద్రం, నిశ్చిత రాబడి, సెక్షన్ 80సి ప్రకారం సంవత్సరానికి రూ 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు

ఆలస్యం ఎందుకు?  వెంట‌నే ప్రారంభించండి

కొత్తగా ఉద్యోగంలో చేరితే అదొక ఆనందం. నెల జీతం వస్తే స్వతంత్రంగా డబ్బుని వినియోగించుకునే అవకాశం. రోజువారీ ఖర్చుల కొరకు ఎవరిమీద ఆధారపడకుండా ఉండడం. అదీగాక మననే ఇతరులు డబ్బులు అడగడం ఒక అనుభూతి. వారికి ఇవ్వాలా లేదా , ఇస్తే ఎంత ఇవ్వవచ్చు వంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే , అసలు జీవితం ఇక్కడ నుంచి మొదలవుతుంది. సంపాదన మొదలైన నాటినుంచి ఏమేమి చేయాలో చూద్దాం.

టర్మ్ జీవిత బీమా పాలసీ:
ప్రతి సంపాదించే వ్యక్తి మీద ఆధారపడే కుటుంబసభ్యులు ఉంటారు. అటువంటి సంపాదించే వ్యక్తికి అనుకోని కారణాల వలన ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా, లేదా మరణం సంభవించినా , ఆధార పడ్డ వారి భవిష్యత్తు, వారి లక్ష్యాలు దెబ్బతింటాయి . కుటుంబ సభ్యులు చిన్న పిల్లలైతే వారి భవిషత్తు మరి ఇబ్బందికరంగా తయారవుతుంది . దీని నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఉన్న ఒక సదుపాయమే టర్మ్ జీవిత బీమా పాలసీ.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లేదా ఆదాయం అధికంగా పెరిగినప్పుడు తగిన బీమాను అదనంగా తీసుకోవాలి.
ముందుగా మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండే టర్మ్ జీవిత బీమా పాలసీని తీసుకోవాలి. 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించాలి . పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

పాలసీ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేయాలి. పాలసీ పత్రాలను అందుబాటులో ఉంచాలి.
దుదృష్టవశాత్తు సంపాదనాపరుడు అనుకోని కారణాలవలన మరణిస్తే, టర్మ్ జీవిత బీమా ద్వారా రావలసిన సొమ్మును కొత్త మొత్తం లంప్సం గా , మిగిలిన సొమ్మును కనీసం 5-10 సంవత్సరాలపాటు నెలవారీ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. కొన్ని సందర్భాలలో మొత్తం సొమ్ము ఒకేసారి వస్తే , ఆ సొమ్మును ఎలా వినియోగించుకోవాలో తెలియక, లేదా దగ్గరి బంధువులు, స్నేహితులు చెప్పినట్లు అనవసర పథకాలలో మదుపు చేసి నష్టపోవడమో , మొత్తం ఖర్చయిపోవడమో జరుగుతాయి .

బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

వ్యక్తిగత ప్రమాద బీమా:
ఆదాయాన్ని బట్టి , చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఉదా : ప్రమాదకర ప్రదేశాలలో పని చేయడం, ఎక్కువ దూర ప్రయాణాలను చేస్తున్న ఉద్యోగస్తులు ఈ పాలసీని తీసుకోవచ్చు. ప్రమాదం వలన అంగ వైకల్యం గాని, మరణంగానీ సంభవిస్తే ఈ పాలసీ ద్వారా సొమ్ము పొందవచ్చు. అలాగే తాత్కాలిక, కొంత శారీరక నష్టం జరిగినా, ఆదాయం కోల్పోయినా ఈ పాలసీ ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ఆరోగ్య బీమా:
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వలన తొందరగా అనారోగ్యం పాలవుతున్నాం. రోజు రోజుకి పెరుగుతున్న ఆరోగ్య పరీక్షల బిల్లులు, ఖరీదైన మందులు , ప్రతి చిన్న దానికి సర్జరీలు చేయడం, అతిగా యాంటీ బయాటిక్స్ వాడడం వంటి వాటి వలన ఆరోగ్య పరిరక్షణ చాలా ఖరీదైంది. కానీ తప్పనిసరి.
కుటుంబ సభ్యులకు పనిచేస్తున్న సంస్థ నుంచి గాని, ప్రభుతం నుంచి గాని ఎటువంటి సహాయం లేనప్పుడు , సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ పని చేస్తున్న సంస్థ ద్వారా లభిస్తున్నా , మీకుగా వేరొక పాలసీ ఉండటం మంచిది.

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
నెట్వర్క్ ఆసుపత్రులు, క్యాష్‌లెస్‌ ట్రీట్మెంట్, సహ చెల్లింపు, ఎటువంటి వ్యాధులకు చెల్లిస్తారు, ఎటువంటి చెల్లించరు, ఉన్న వ్యాధులకు చికిత్స కోసం ఎన్ని సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది , మొదలగు విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

పైన చెప్పిన వాటిని పరోక్ష పెట్టుబడులుగా భావిస్తే, ఈ కింది వాటిని ప్రత్యక్ష పెట్టుబడులుగా భావించవచ్చు.

పీఎఫ్ / విపీఎఫ్ :
మన నెలవారీ జీతం నుంచి కొంతమొత్తం పెట్టుబడి చేయాలి. అయితే వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఉదా : మన జీతం నుంచి జమ అయ్యే మొత్తం, దానిపై వచ్చే వడ్డీ . వీటిపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది . దీన్ని ప్రత్యేకంగా పదవీవిరమణ అనంతర ఆదాయం కోసం నిర్దేశించబడింది. కాబట్టి, ప్రతి నెల మరికొంత మొత్తాన్ని జమచేసి , దానికే ఉపయోగిద్దాము.

రికరింగ్ డిపాజిట్ ఖాతా:
సంపాదించే మొదటి నెల నుంచే కొంత మొత్తంలో జమ చేయాలి. స్వల్ప కాలిక లక్ష్యాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వార్షిక వడ్డీ బ్యాంకును బట్టి ఇవి 6-7శాతం వరకు ఉంటాయి. నెలకు రూ 5 వేలతో 12 నెలలు వేస్తె 7 శాతం వడ్డీ తో చివరికి రూ 62,300 వస్తుంది. దీనిని ఒక అత్యవసర నిధిగా ఫిక్సెడ్ డిపాజిట్ లో ఉంచవచ్చు. లేదా స్వల్పకాలిక లక్ష్యాలకు వినియోగించవచ్చు. మరలా రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి జమ చేయవచ్చు.

పీ పీ ఎఫ్ :
ప్రస్తుత వార్షిక వడ్డీ 8శాతం. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది. పెట్టుబడికి భద్రం, నిశ్చిత రాబడి, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం పెట్టుబడిపై సంవత్సరానికి రూ 1.50 లక్షల వరకు మినహాయింపు, ప్రతి సంవత్సరం జమ అయ్యే వడ్డీ ఫై , ఏడవ ఆర్ధిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణ ఫై పన్ను మినహాయింపు వంటి అనుకూలతలు వలన మధ్యకాలిక , దీర్ఘకాలిక లక్ష్యాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఎన్ పీ ఎస్ (NPS ):
పదవీవిరమణ నిధి కోసం మరొక మంచి పధకం. 2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 2009 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ
పీఎఫ్ఆర్ డి ఏ (PFRDA ) నియంత్రణలో ఫండ్ మేనేజర్ లు ఉంటారు. ఈక్విటీ లలో 50 శాతం వరకు మదుపు చేసే అవకాశం ఉండటం వలన దీర్ఘకాలంలో మొత్తం పెట్టుబడి ఫై 10 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. అంటే, ప్రావిడెంట్ ఫండ్ కంటే కొంచెం అధికం. దీనిలో అదనంగా రూ 50 వేల వరకు సెక్షన్ 80CCD (1బి) కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది .
60 ఏళ్ల వయసు వరకు జమ అయిన నిధి నుంచి 60 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎటువంటి పన్ను ఉండదు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ ఫండ్ ద్వారా నెలవారీ పెన్షన్ అందుతుంది .

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్:

దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే అధిక రాబడిని ఇస్తాయి. కొద్ది మొత్తం అంటే నెలకు రూ 500 లతో కూడా మదుపు ప్రారంభించవచ్చు. దీర్ఘకాలంలో , అంటే పది సంవత్సరాలు పైబడి 12శాతం అంచనాతో రాబడి ఆశించవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అలవాటు అవుతుంది.

ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్ ని అనుసరించి పెట్టుబడులు పెడతాయి కాబట్టి ఇండెక్స్ ఫండ్లలో ఇతర ఫండ్ల కంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయొచ్చు .
దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

ముగింపు:
సంపాదన మొదలైన మొదటి నెలనుంచే మదుపు మొదలుపెడితే అది ఒక అలవాటుగా మారడమే కాకుండా , ఒక ఆర్ధిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. ఆర్ధిక ఉన్నతితోపాటు మానసిక ధైర్యాన్ని కలుగచేస్తుంది. ప్రతి సంవత్సరం మదుపును పెంచుకుంటూ ఉండాలి. అన్ని పధకాలను ఒకేసారి ఆరంభించలేకపోతే, ముందుగా పరోక్ష పెట్టుబడి అయిన టర్మ్ జీవిత బీమా తో పాటు , ఒక ప్రత్యక్ష పెట్టుబడిని ఆరంభించాలి. ఎందుకంటే, ప్రతి పధకానికి కొన్ని లక్షణాలతో పాటు అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులలోను వాయిదా వేయరాదు. ఒకసారి వాయిదా వేయడానికి అలవాటు పడితే , క్రమశిక్షణ దెబ్బతింటుంది . ఇది కేవలం కొత్తగా సంపాదన మొదలుపెట్టిన వారికి మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది . ఇంకెందుకు ఆలస్యం .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly