ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే భారీ జ‌రిమానాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు

కొత్త వాహ‌న చ‌ట్టం నిబంధ‌న‌ల ప్ర‌కారం లైసెన్స్ లేకుండా వాహ‌నం న‌డిపితే రూ.5,000 జ‌రిమానా ప‌డుతుంది

ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే భారీ జ‌రిమానాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు

సెప్టెంబ‌ర్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన నూత‌న వాహ‌న చ‌ట్టం (స‌వ‌ర‌ణ‌) 2019, ప్ర‌కారం నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే భారీమొత్తంలో జ‌రిమానాలు చెల్లించుకోవాల్సిందే. వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా అన్ని ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డంతో పాటు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే ప‌త్రాలు ఒక్కోసారి మ‌రిచిపోయే ప్ర‌మాద‌ముంది. అందుకే డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో వాహ‌నానికి సంబంధించిన అన్ని ప‌త్రాల‌ను డిజిలాక‌ర్ లేదా ఎం ప‌రివాహ‌న్ యాప్‌లో భ‌ద్ర‌ప‌రిస్తే ఇక ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు.

డిజిలాకర్‌ (DigiLocker)
డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రజలు తమ ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకునేందుకు వీలుగా గతేడాది కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్‌ను యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో మన వాహనం తాలూక రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర పత్రాలను భద్రపరుచుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ లో ఈ యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మొబైల్‌ నంబర్‌, ఓటీపీతో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇందులోని అప్‌లోడ్‌ సెక్షన్‌ను ఉపయోగించి సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే మీకు ప్రభుత్వం నుంచి జారీ అయిన పత్రాలన్నీ ఆటోమేటిక్‌గా అందులో కనిపిస్తాయి.

ఎం పరివాహన్‌ (mParivahan)
వాహనదారులనుద్దేశించి ఎం పరిహవాహన్‌ యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో వాహనానానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వివరాలతో పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలను పొందుపరుచుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి ఎం పరిహవాహన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌ నంబర్‌తో యాప్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

ఆర్‌టీఏ ఎం-వ్యాలెట్‌ (RTA m-wallet)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌ లో లేదా యాప్‌ స్టోర్‌ కి వెళ్లి ఆర్టీఏ-ఎంవ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో మీ వాహన నంబరు నమోదు చేస్తే… ఆర్సీ, లైసెన్సులకు సంబంధించి స్మార్ట్‌ కార్డులు ప్రత్యక్షమవుతాయి. వీటిని పోలీసులకు చూపించి ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయట పడవచ్చు.

నూతనంగా అమల్లోకి వచ్చిన వాహన చట్టం ప్రకారం… డిజిలాకర్‌, ఎంపరివాహన్‌ యాప్‌ల్లో నిక్షిప్తం చేసిన ధ్రువపత్రాలను చూపిస్తే వాహనదారులకు ఎలాంటి జరిమానాలు విధించబోరని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. అయితే డిజిటల్ ఫార్మాట్‌లో అన్నంత మాత్రన ఫోన్‌లో ఫొటో తీసి పెట్టుకుంటే చెల్లుబాటు కాదని రవాణా శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. కేవలం డిజిలాకర్‌ లేదా ఎంపరివాహన్‌ యాప్‌లను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆర్‌టీఏ ఎంవ్యాలెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది కాబట్టి తెలంగాణలో ఇది చెల్లుబాటు అవుతుంది. 1989 కేంద్ర మోటార్‌ వాహనాల చట్టంలోని సవరించిన ప్రొవిజన్ల కింద వీటిని అమనుతిస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly