ప్రతీ ఉద్యోగి సూప‌ర్‌యాన్యుయేష‌న్ గురించి తెలుసుకోవాల్సిందే!

ఉద్యోగుల సూప‌ర్‌యాన్యుయేష‌న్ ప‌థ‌కం గురించి తెలుసుకుందాం

ప్రతీ ఉద్యోగి సూప‌ర్‌యాన్యుయేష‌న్ గురించి తెలుసుకోవాల్సిందే!

ప‌ద‌వీ విరమణ ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందు గుర్తొచ్చే పథకాలు ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, పీపీఎఫ్ లు. అయితే వీటితో పాటు మ‌రొక‌ పథకం సూపర్ యాన్యుషన్ గురించి తెలుసుకున్నారా? మీరు ఉద్యోగం చేసే సంస్థ ఎల్ఐసీ తో సూప‌ర్‌యాన్యుయేష‌న్ ప‌థ‌కాన్ని నిర్వహిస్తే మీ ఖాతాలో ఉండే మొత్తాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం . సాధార‌ణంగా చాలా మంది ఉద్యోగులు ఈ మొత్తం ఎంత‌నేది తెలుసుకోక‌పోవ‌డ‌మో లేదా ఇలాంటిది ఒక‌టి ఉన్న‌ట్లు తెలియ‌క‌పోవ‌చ్చు. ఈ ప‌థ‌కం ద్వారా వ‌చ్చే మొత్తాన్ని తెలుసుకోవ‌డం ద్వారా మీ ప‌ద‌వీవిర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ను మ‌రింత క‌చ్చితంగా అమ‌లు చేయోచ్చు. ఈ మొత్తం మీ పోర్ట్ఫోలియో లో ఒక పెద్ద భాగం అవ‌చ్చు. ఉద్యోగుల‌కు త‌మ సంస్థ‌ల ద్వారా అందే బెన్‌ఫిట్‌గా దీన్ని చెప్ప‌వ‌చ్చు. ఉద్యోగి తరపున సంస్థ ఈ ప‌థ‌కంలో ప్ర‌తీ ఏటా కొంత మొత్తం చెల్లింపులు చేస్తారు. పదవీ విరమణ నిధికి ఈ మొత్తం ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్ర‌త్యేక‌త‌లు:

 • సూప‌ర్‌యాన్యుయేష‌న్ ఫండ్ కంపెనీ త‌మ ఉద్యోగులకు ఇచ్చే పదవీ విరమణ ప్రయోజనం.
 • సాధారణంగా సంస్థ‌లు ఎల్ఐసీ సూప‌ర్‌యాన్యుయేష‌న్ ఫండ్ లాంటి వాటితో అనుసంధాన‌మై ఉంటాయి.

 • సంస్థ‌లు బేసిక్ శాల‌రీ లో 15% చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఏ విధ‌మైన చెల్లింపులు చేయన‌వ‌స‌రం లేదు.

 • ముందుగా నిర్ణ‌యించిన నమూనా ప్రకారం ఈ మొత్తాన్ని వివిధ పెట్టుబ‌డుల్లో ఫండ్ మ‌దుపు చేస్తుంది.

 • దీనిపై ల‌భించే వడ్డీ రేటు, పీఎఫ్ వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది.

 • పదవీ విరమణ వ‌య‌సు రాగానే, త‌మ ఖాతా ద్వారా లభించే మొత్తం లో 25% పన్ను మినహాయింపు ప్రయోజనం పొందేందుకు అర్హులు. 75% యాన్యూటీ ఫండ్ లో పెట్టుబ‌డి చేస్తారు. యాన్యుటీ రాబ‌డి సభ్యుని ఎంపిక చేసుకునే దాన్ని బ‌ట్టి నెలసరి/త్రైమాసికానికి ఉంటుంది. ఈ మొత్తంపై పన్ను ఉంటుంది.

 • ఉద్యోగం మారిన‌పుడు ఆ ఖాతానే త‌రువాత కూడా కొన‌సాగించ‌వ‌చ్చు. ఉద్యోగి తన మొత్తాన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవ‌చ్చు. కొత్తగా వెళ్లే సంస్థ‌లో సూపర్ యాన్యుయేషన్ పథకం లేక‌పోతే, అప్పుడు ఉద్యోగి ఖాతాలో మొత్తం సొమ్ముని ఉపసంహరించుకోవచ్చు, ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆమోదంతో పన్ను మినహాయింపుతో నిధులు పొంద‌వ‌చ్చు. వ‌య‌సు పూర్త‌య్యే వ‌ర‌కూ ఈ ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు.

పదవీ విరమణ తర్వాత సూప‌ర్‌యాన్యూయేష‌న్ ఏమ‌వుతుంది?

మీరు ప‌ద‌వీవిర‌మ‌ణ చేశాక‌ మొత్తాన్ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు:

 • మొద‌టి విధానంలో పూర్తిగా ఒకేసారి మొత్తం తీసుకోవ‌చ్చు. అలాంట‌పుడు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

 • రెండో విధానంలో 1/3 వ వంతు ప‌న్ను లేకుండా తీసుకుని మిగిలిన మొత్తం 2/3 రెగ్యులర్ పెన్షన్ పథకం లో పెట్టుబ‌డిగా ఉంచొచ్చు. పన్ను చెల్లింపులో 2/3 వంతు పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా వ‌చ్చే రాబ‌డిపై ప‌న్ను చెల్లించాలి.

ఉద్యోగం మారితే?

చాలామంది ఉద్యోగుల‌కు ఎదుర‌య్యే ప్ర‌శ్న‌. మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు, మీ సూపర్ యాన్యుయేషన్నుపాత సంస్థ‌ నుంచి కొత్త సంస్థ‌కు బదిలీ చేయవచ్చు . ఆ ప‌థ‌కాన్ని పదవీ విరమణ వరకు కొనసాగించవచ్చు.

కొత్త‌గా చేరే సంస్థ‌లో సూప‌ర్ యాన్యూయేష‌న్ లేన‌ట్ట‌యితే 2 మార్గాలు ఉన్నాయి.

డ‌బ్బును తీసుకోవ‌డం (ప‌న్ను ఉంటుంది.) లేదా ఆ ఫండ్లో ప‌థ‌కాన్ని కొన‌సాగించ‌డం. మీ పదవీ విరమణ తర్వాత ఆ మొత్తాన్ని తీసుకోవ‌డం .

ఎలా లెక్కిస్తారు?

సూపర్ యాన్యుయేషన్ పై వడ్డీ రేటు పీపీఎఫ్‌ లో వర్తించే వడ్డీ రేటులానే ఉంటుంది. బీమా సంస్థ ,కంపెనీ తీసుకున్న సూప‌ర్‌యాన్యుయేష‌న్ పథకాన్ని బట్టి రాబ‌డులు విభిన్నంగా ఉండవచ్చు. ఈ ప‌థ‌కంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తంపై వార్షికంగా వ‌డ్డీని లెక్కిస్తుంటారు.

సూప‌ర్ యాన్యుయేష‌న్ చార్టు:

superannuation.png

వ‌డ్డీ మొత్తం:

ఇది సంస్థ‌లు చెల్లించే మొత్తంపై ప్ర‌తీ సంవత్సరం ఎల్ఐసీ వారు చెల్లించే వడ్డీ.

మెచ్యూరిటీ నియమాలు:

ఉద్యోగి మూడేళ్ల స‌ర్వీసు పూర్తిచేసి, ప‌ద‌వీవిర‌మ‌ణ చేసే వ‌ర‌కూ కొన‌సాగితే సూప‌ర్‌యాన్యూయేష‌న్ ద్వారా క‌లిగే మొత్తాన్ని ఫించ‌నుగా పొంద‌వ‌చ్చు.
ఉద్యోగి పదవీ విరమణ తర్వాత 1 / 3 వంతు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని జీవించి ఉండేవ‌ర‌కూ నెలసరి పెన్షన్ గా పొందవచ్చు.

ఆన్‌లైన్ లో సూపర్‌యాన్యూయే షన్ బ్యాలెన్స్ తనిఖీ ఎలా?

 1. Licindia.com వెబ్‌సైట్ కి వెళ్లాలి.
 2. యూజర్ ఐడీ, పాస్వర్డ్ కోసం రిజిస్టర్ చేయండి.
 3. లాగిన్.
 4. గ్రూప్ పథకం వివరాల ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 5. మెంబ‌ర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
 6. మీ కంపెనీ పేరోల్ డిపార్టుమెంట్ నుంచి సూప‌ర్ యాన్యుయేష‌న్ పాలసీ నంబ‌రును పొందండి. వైబ్‌సైట్ లో సూచించిన విధంగా ఆ సంఖ్య‌ను ఎంటర్ చేసి క్లిక్ చేయండి. సంస్థలో ఉద్యోగులంద‌రికి వేర్వేరు నంబ‌ర్లు ప్ర‌త్యేకంగా ఉంటాయి.
 7. ఎల్ఐసీ ఐడీ నంబ‌రు పుట్టిన తేదీని అడుగుతుంది.
 8. ఎల్ఐసీ ఐడీని పొందడానికి, మీ సంస్థ‌ సూపర్ యాన్యుయేష‌న్ ఖాతాను కలిగి ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్‌ని సంప్ర‌దించండి. వారు మీ ఎల్ఐసీ ఐడీ నంబర్ ఇస్తారు.
 9. సంస్థ‌లు ఉద్యోగుల పుట్టిన‌తేదీ వివరాలను ఎల్ఐసీ వారికి అందిన ప‌క్షంలో పుట్టిన తేదీ బాక్స్ లో ‘01/07/1960’ / ‘07/01/1960’ లో నమోదు చేయండి.
 10. మీ పాల‌సీ వివ‌రాలు నమోద‌వుతాయి. వివరాలను చూసేందుకు మీ పాలసీ నంబర్ పై క్లిక్ చేయండి.

గత ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న మొత్తం వివరాలు ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీ సంస్థ‌లు చెల్లించిన మొత్తాన్ని చూపిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly