క్రమపద్ధతిలో మదుపు, బదిలీ, ఉపసంహరణ

పెట్టుబడులను క్రమపద్ధతిలో నిర్వహించేందుకు మూడు విధానాలు మదుపరులకు అనుకూలంగా ఉంటాయి

క్రమపద్ధతిలో మదుపు, బదిలీ, ఉపసంహరణ

మ్యూచువ‌ల్ ఫండ్ లలో పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు క్రమబద్దమైన పద్ధతిని ఎంచుకోవడం మంచింది. ఇందులో సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ (ఎస్‌డ‌బ్ల్యూపీ),సిస్ట‌మేటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్ (ఎస్‌టీపీ) మూడు విధానాల ద్వారా మదుపును నిర్వహించవచ్చు.

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్):

సిప్‌లో కొంత క‌చ్చిత‌మైన మొత్తాన్ని నెలకు నిర్ణీత‌ కాలం వ‌ర‌కు పెట్టుబ‌డిగా పెట్టాలి. ఈ స్కీమ్‌ను ఎంచుకుంటే మీ ఖాతా నుంచి నేరుగా సిప్ ఖాతాలో ప్ర‌తి నెల జ‌మ‌వుతుంది. ఇందులో క‌నీసం రూ.100 నుంచి కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు. అయితే మ్యూచువ‌ల్‌ఫండ్ కంపెనీల మీ పెట్టుబ‌డుల‌ను నిర్వ‌హించేందుకు కొంత ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఈక్విటీ ఫండ్ల‌కు అయితే సంవ‌త్స‌రానికి 1.5-2.5 శాతం, డెట్ ఫండ్ల‌కు 0.5-1 శాతంగా వ‌సూలు చేస్తాయి. సిప్‌తో క్ర‌మంగా పొదుపు అల‌వాటు కావ‌డ‌మే కాకుండా, దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. వేత‌న జీవుల‌కు ఈ సిప్ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది.

సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ (ఎస్‌డ‌బ్ల్యూపీ):

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి స్థిరమైన సొమ్మును ఒక క్ర‌మ‌మైన వ్య‌వ‌ధిలో తీసుకోవ‌డాన్నే సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ అంటారు. ఇక్క‌డ క్ర‌మ‌మైన వ్య‌వ‌ధి నెల‌, మూడు నెల‌లు, ఆరు నెల‌లు లేదా ఏడాది కావ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌వారికి త‌మ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి నెల నెలా ఆదాయం రూపంలో పొందాలంటే ఈ సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ఎంతో అనుకూల‌మైన‌ది. మొద‌ట మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌లో ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెట్టి , ఆ త‌ర్వాత స‌మ‌యానుసారంగా కొంత మొత్తంగా రెగ్యుల‌ర్‌గా విత్‌డ్రా చేసుకోవ‌చ‌చు. అప్ప‌టికీ ఖాతాలో ఉన్న దానిపై రాబ‌డి ల‌భిస్తుంది. రెగ్యుల‌ర్‌గా ఆదాయం రాన‌ప్పుడు ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి నుంచి క్ర‌మంగా పెన్ష‌న్‌ను పొందేందుకు కూడా ఈ స్కీమ్‌ను వినియోగించుకోవ‌చ్చు.

సిస్ట‌మేటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్ (ఎస్‌టీపీ):

ఎస్‌టీపీ అనేది ఎస్‌డ‌బ్ల్యూపీ, సిప్ రెండిటి క‌ల‌యిక అని చెప్పుకోవ‌చ్చు. ఇందులో మ‌దుప‌రుల‌కు సంబంధించిన నిర్ణీత సొమ్ము మొత్తం ఒక ప‌థ‌కం నుంచి మ‌రోదానికి క్ర‌మంగా బ‌దిలీ అవుతుంది. సాధార‌ణంగా ఒకే ఫండ్ సంస్థ‌కు చెందిన డెట్ ఫండ్ ప‌థ‌కం నుంచి ఈక్విటీ ప‌థ‌కానికి సొమ్ము బ‌దిలీ అవుతుంది. ఎస్‌టీపీ ద్వారా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవ‌డానికి లేదా కొన్ని యూనిట్ల‌ను ఉప‌సంహరించుకోవ‌చ్చు. మిగిలిన మొత్తం అదే సంస్థ‌లో మరొక పథకంలో పెట్టుబడిగా పెట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా మ‌దుప‌ర్లు లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబ‌డులు పెట్టి ఈక్విటీ కోసం ఎస్‌టీపీని ఎంచుకుంటారు. ఎస్‌టీపీ అంటే ఫండ్ సంస్థ‌లో పెట్టుబ‌డుల‌ను బ‌దిలీ చేసుకోవ‌డం అని చెప్పుకోవ‌చ్చు. మార్కెట్ టైమింగ్‌ను చూసుకొని పెట్టుబ‌డి పెట్టాల్సిన‌ ఇబ్బందిని మ‌దుప‌ర్ల‌కు లేకుండా చేస్తుంది. ఫండ్ స్కీమ్ అదేవిధంగా ఫండ్ మీద ఆధార‌ప‌డి ఎస్‌టీపీ మొత్తం ఉంటుంది. క‌నీసం వెయ్యి రూపాయ‌ల నుంచి గరిష్ఠంగా ఎంతైనా ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly