కొత్త ఐటీఆర్ ఫారంలను విడుదల చేసిన ఆదాయ పన్ను శాఖ..

పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతని తగ్గించాలనే లక్ష్యంతో ఆదాయ పన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది

కొత్త ఐటీఆర్ ఫారంలను విడుదల చేసిన ఆదాయ పన్ను శాఖ..

2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను వ్యక్తులు లేదా వ్యాపారస్తులు ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు వారి ప్రొఫెషనల్, నివాస స్థలం, అలాగే వారి ఆదాయానికి సంబంధించిన మరిన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఆదాయ పన్ను శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియచేసింది. దాని కోసం కొత్త ఐటీఆర్ ఫారంలను అందుబాటులోకి తెచ్చింది. పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతని తగ్గించాలనే లక్ష్యంతో ఆదాయ పన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, సంస్థల్లో వాటాలను కలిగి ఉన్న వ్యక్తులు లేదా గత ఆర్థిక సంవత్సరంలో నమోదు కాని సంస్థల షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్ -4 ఫారంలను ఉపయోగించకూడదు. అలాంటి వారు ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3 ఫారంలను ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యక్తులు వారి నివాసానికి (మన దేశంలో, విదేశాలలో ఎన్ని రోజులు గడిపారు వంటివి) సంబంధించిన మరిన్ని వివరాలను నూతన ఐటీఆర్ ఫారంలలో బహిర్గతం చేయవలసి ఉంటుంది. అలాగే వారి విదేశీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సంబంధించిన సమాచారాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్లెయిమ్ చేసుకునే వారు వ్యవసాయ భూమి ఎక్కడ ఉంది, దాని విస్తీర్ణం ఎంత, దీనిని సాగునీటి ద్వారా పండిస్తున్నారా లేదా వర్షంపై ఆధారపడి పండిస్తున్నారా, అలాగే వారు భూమిని సొంతగా కలిగి ఉన్నారా లేదా లీజుకు తీసుకున్నారా అనే విషయాలను కూడా బహిర్గతం చేయవలసి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, మీకు సంబంధించిన అదనపు సమాచారాన్ని ముందుగానే దాఖలు చేయడం మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం భౌతిక రూపంలో పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసే అవకాశం 80 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. వారు సులభమైన ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారంలను దాఖలు చేస్తున్నారు.

ఆస్తి లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గత పరచాల్సిన అవసరాన్ని పెంచడానికి కొత్త ఐటీఆర్ ఫారంలు ప్రయత్నిస్తున్నాయని క్లియర్ ట్యాక్స్.కామ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్చిత్ గుప్తా తెలిపారు.

స్వల్ప కాల, దీర్ఘ కాల మూలధన లాభాలను సంపాదించిన విక్రేతలు తమ ఐటీఆర్ ఫారంలలో వారి పేరు, పాన్ నెంబర్, చిరునామా (పిన్ కోడ్ తో సహా) నమోదు చేయడం ఇప్పుడు తప్పనిసరి అని గుప్తా తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly