టర్మ్ పాలసీ లో ముందస్తుగా ప్రీమియం చెల్లించడం మంచిదా?

టర్మ్ పాలసీ లో ఏ విధంగా ప్రీమియం చెల్లించడం మంచిది?

టర్మ్ పాలసీ లో  ముందస్తుగా ప్రీమియం చెల్లించడం మంచిదా?
  • నా వయసు 35 ఏళ్లు. నేను రూ.కోటి విలువైన టర్మ్‌ పాలసీని, నాకు 75 ఏళ్ల వయసు వచ్చేదాకా వ్యవధి ఉండేలా తీసుకోవాలని అనుకున్నాను. దీనికోసం కొన్ని పాలసీలను గమనిస్తే… ప్రీమియం చెల్లించేందుకు మూడు రకాల
    ఆప్షన్లు కనిపించాయి. 1) ఏడాదికి రూ.12,340 చెల్లిస్తూ వెళ్లడం. 2) ఐదేళ్లపాటు ఏడాదికి రూ.53,630 చెల్లిస్తే చాలు. 3) 10 ఏళ్లపాటు ఏడాదికి రూ.29,854 చెల్లించాలి. నేను లెక్కలేసి చూస్తే… ఏడాదికోసారి ప్రీమియం చెల్లిస్తూ వెళ్తే… మొత్తం రూ.5,05,940 అవుతున్నాయి. రెండో ఆప్షన్‌లో రూ.2,68,150, మూడోదానిలో రూ.2,98,540 ఖర్చవుతోంది. ఈ మూడింటిలో రెండో ఆప్షన్‌ నాకు ఉత్తమం అనిపిస్తోంది… మీ సలహా ఏమిటి?

– సతీశ్‌

అధిక మొత్తానికి టర్మ్‌ బీమా తీసుకోవాలని ఆలోచించడమే కాకుండా… దానిపై అవగాహన కోసం పాలసీలను పరిశీలించడం నిజంగా అభినందనీయం. మీ విషయానికి వస్తే… పరిమిత కాలం ప్రీమియం చెల్లిస్తే చాలు అనే పాలసీలను ఎంచుకోకపోవడమే మంచిది. చూడ్డానికి ఇది తక్కువగానే అనిపించినా… వాస్తవంగా ఇది అధికంగా ఉంటుంది.

ముందుగా 1, 2 ఆప్షన్లను పరిశీలిద్దాం… మీరు రెండో ఆప్షన్‌ ఎంచుకుంటే… ఐదేళ్ల పాటు ఏడాదికి రూ.53,630 చెల్లించాలి. దీనికి బదులుగా ఏడాదికి రూ.12,340 చెల్లించి, మిగతా రూ.41,290ని వచ్చే ఐదేళ్లపాటు 8శాతం రాబడి వచ్చే డెట్‌ పథకాల్లో మదుపు చేశారనుకుందాం… అప్పుడు 40 ఏళ్లలో మీరు నెలకు రూ.12,340 చెల్లించిన మొత్తం తీసేసినా… మీ దగ్గర రూ.16,83,892 మిగులుతాయి. ఇక 1, 3 ఆప్షన్లను పోల్చి చూద్దాం… పదేళ్లపాటు ఏడాదికి రూ.29,854కు బదులుగా సాధారణ ప్రీమియం ఏడాదికి రూ.12,340 చెల్లించి, మిగిలిన మొత్తం రూ.17,514 పదేళ్లపాటు డెట్‌ పథకాల్లో మదుపు చేశారనుకుందాం. అప్పుడు 40 ఏళ్లకు మీరు ఏడాదికి చెల్లించే ప్రీమియం పోను ఇంకా రూ.13,34,050 మిగులుతాయి. మీరు మిగులు మొత్తాన్ని ఈక్విటీల్లో మదుపు చేస్తే… ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. కాబట్టి, ఏది సరైన పద్ధతి అనేది చూసి ఎంచుకోండి.

  • మా మిత్రుడు సూచన మేరకు రికరింగ్‌ డిపాజిట్‌కు బదులుగా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌లో సిప్‌ చేయడం ప్రారంభించాను. ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు చూస్తే… ఇందులో లాభం 6శాతానికి మించి లేదు. ఆర్‌డీలో జమ చేసినా 7శాతం వడ్డీ వచ్చేది. ఇప్పుడు నేను ఈ సిప్‌ను కొనసాగించాలా? లేదా ఆర్‌డీకి మారిపోవాలా? అనే గందరగోళంలో ఉన్నాను. నాకు నాలుగేళ్ల తర్వాత డబ్బుతో అవసరం. నష్టం వచ్చే పథకాలలో పెట్టుబడి వద్దనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.

– Y శ్రీనివాస్‌

డెట్‌ ఫండ్లు, ఆర్‌డీ సమాన వడ్డీ రేటు ఇస్తున్నప్పుడు… ఫండ్లను ఎందుకు ఎంచుకోవాలి? వడ్డీ రేట్లు… బాండ్‌ మార్కెట్‌ వ్యతిరేక దిశలో పనిచేస్తుంటాయి. వడ్డీ రేట్లు పెరుగుతుంటే… బాండు మార్కెట్ల నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే… బాండ్‌ మార్కెట్‌ మెరుగైన పనితీరు చూపిస్తుంది. గత 12 నెలల్లో వడ్డీ రేట్లు వృద్ధి చెందడం ప్రారంభించాయి. దీంతోపాటు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ లాంటి పరిణామాలు బాండ్‌ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్న దాన్ని బట్టి డెట్ ఫండ్ల రాబడి ఆధార పడి ఉంటుంది. డెట్ ఫండ్లలో కూడా రిస్క్ ఉంటుందని మీకు అర్ధం అయ్యే ఉంటుంది. ఈ మేరకు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే ఇందులో కొనసాగడం మంచిది. ఈ మధ్య చాలా బ్యాంకులు రికరింగ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఆర్బీఎల్, ఎస్ బ్యాంకుల వడ్డీ రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోండి… అయితే, ఆదాయపు పన్ను పరంగా ఇవి కలిసొస్తాయి.

  • మా అమ్మాయికి ఇటీవలే కూతురు పుట్టింది. చిన్నారి పేరుమీద నెలకు రూ.2వేలు జమ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఈ డబ్బుతో ఇప్పటికిప్పుడు అవసరాలేమీ లేవు… ఎక్కడ మదుపు చేయాలి?

– సుబ్బారావు

దీర్ఘకాలిక పెట్టుబడి మీ ఆలోచన అయితే… అంటే… 10 ఏళ్లకు మించి మీరు మదుపు చేయాలనుకుంటే… ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. దీనికోసం మీరు యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ని ఎంచుకోండి.

  • నేను ఇటీవలే ఉద్యోగం మారాను. పాత ఉద్యోగంలో 20 నెలలు ఉన్నాను. కొత్త యాజమాన్యం నా పాత పీఎఫ్‌ వివరాలను అడుగుతోంది. నేను పీఎఫ్‌ను రద్దు చేసుకోవాలనుకుంటున్నాను. ఆ డబ్బుతో పెద్దగా అవసరం కూడా లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి?

– Y సురేశ్‌

మీరు ఉద్యోగంలో కొనసాగుతున్నందున ఈపీఎఫ్‌ను పూర్తిగా రద్దు చేసుకోవడానికి నిబంధనలు అంగీకరించకపోవచ్చు. మీకు డబ్బుతో పెద్దగా అవసరం కూడా లేదంటున్నారు కాబట్టి, మీ పీఎఫ్‌ను అలాగే కొనసాగించండి. మీ పాత యూఏఎన్‌ ను కొత్త యాజమాన్యానికి తెలియజేసి, ఈపీఎఫ్‌ను కొనసాగించడమే మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly