క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేసే అంశాలివే

క్రెడిట్ స్కోరు త‌క్కువ ఉంటే రుణం దొర‌క‌డం క‌ష్టంగా ఉంటుంది. కాబ‌ట్టి క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేసే అంశాల గురించి తెలుసుకోవ‌డం మంచిది.

క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేసే అంశాలివే

ఎప్పుడైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాల్సిన అవ‌స‌రం వ‌స్తే మ‌న క్రెడిట్ స్కోరు చాలా కీల‌కంగా ఉంటుంది. రుణాలు మంజూరు చేసేట‌ప్పుడు ద‌ర‌ఖాస్తుదారుల‌ క్రెడిట్ స్కోరును బ్యాంకులు ప‌రిశీలిస్తాయి. క‌నీస క్రెడిట్ స్కోరు లేని వారికి రుణం దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది. రుణాన్ని తిరిగి చెల్లించే సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి బ్యాంకులు రుణం ఇవ్వాలా ? వ‌ద్దా ? ఇస్తే ఎంత వ‌డ్డీ రేటుకు ఇవ్వాలి అనే నిర్ణ‌యం తీసుకుంటాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వ‌స్తాయి. త‌క్కువ క్రెడిట్ స్కోరు ఉన్న‌వారికి రుణం ల‌భించే అవ‌కాశం త‌గ్గుతుంది. క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేసే అంశాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా జాగ్ర‌త్త వ‌హించ‌వ‌చ్చు.

ఈఎమ్ఐ వాయిదాలు త‌ప్పితే ఆ ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపై ఉంటుంది. ఖ‌రీదైన వ‌స్తువుల‌ కొనుగోలుకు వాయిదాల ప‌ద్ధ‌తిని ఆశ్ర‌యిస్తుంటారు చాలా మంది. వాటి వాయిదాలను గ‌డువులోపు చెల్లించ‌కుంటే ఆ ప్ర‌భావం క్రెడిట్ స్కోరు పై చూపిస్తుంది. ఎన్ని ఎక్కువ సార్లు వాయిదాల‌ను త‌ప్పిస్తే స్కోరు అంత త‌గ్గుతూ వ‌స్తుంటుంది.

గ‌డువులోపు రుణం చెల్లించ‌క‌పోతే ఆ ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపై ఉంటుంది. వ్య‌క్తిగ‌త లేదా ఇత‌ర రుణాలు తీసుకుని గ‌డువులోపు చెల్లించ‌కుంటే ఆ ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపై ప‌డుతుంది. ఒక‌సారి రుణం తీసుకొని స‌క్ర‌మంగా చెల్లించ‌ని వారికి మ‌ళ్లీ కొత్త‌గా రుణం దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

క్రెడిట్ కార్డుల సంఖ్య ఎక్కువైనా దాని ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపై ఉంటుంది. క్రెడిట్ కార్డులు ఎక్కువ సంఖ్య‌లో ఉంటే కూడా క్రెడిట్ స్కోరు పై ఆ ప్ర‌భావం చూపుతుంది. క్రెడిట్ కార్డులు సులువుగా ఇస్తారు క‌దాని అవ‌కాశం ఉన్న ప్ర‌తి బ్యాంకు క్రెడిట్ కార్డును తీసుకోవ‌డం ఏమంత మంచిది కాదు.

ప‌రిమితంగానే రుణ ద‌ర‌ఖాస్తులు చేయాలి. రుణం మంజూరు చేయాల్సిందిగా ప్ర‌తి బ్యాంకు చుట్టూ తిరిగితే మొద‌టికే మోసం వ‌స్తుంది. బ్యాంకుల‌న్నీ అంత‌ర్లీనంగా క‌నెక్ట్ అయి ఉంటాయి. మీరు రుణం కోసం ఎన్ని బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తు చేశార‌న్న విష‌యం వారికి సుల‌భంగా తెలుస్తుంది. అదీ కాకుండా మీరు రుణాలు పొంద‌డానికి అధిక ఆస‌క్తి క‌న‌బ‌ర్చేవారిలా బ్యాంకుల‌కు త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయి.

ఎక్కువ రుణాలు తీసుకోవ‌డం అంత మంచిది కాదు. ఇది వ‌ర‌కే ఎక్కువ సంఖ్య‌లో రుణాలు తీసుకొని ఉంటే క్రెడిట్ స్కోరుపై ప్ర‌భావం ఉంటుంది. అప్ప‌టికే మీ త‌ర‌పున అధిక మొత్తంలో రుణం ఉంటే కొత్త‌గా రుణం ల‌బించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అందుకే ప్ర‌తి చిన్న దానికి రుణం తీసుకోవ‌డం త‌గ్గించాలి.

వ్య‌క్తిగ‌త రుణాలు ఎక్కువ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కొంత ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపై ఉంటుంది. ఎక్కువగా వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకునేవారి క్రెడిట్ స్కోరు త‌క్కువ‌గా ఉండేందుకు ఆస్కారం ఉంది. వ్య‌క్తిగ‌త రుణం పూచీ లేని రుణం కింద వ‌స్తుంది. గృహ‌రుణం వంటి సుర‌క్షిత రుణాలకంటే వ్య‌క్తిగ‌త‌, వాహ‌న‌రుణం వంటి భ‌ద్ర‌త లేని రుణాల ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. దీని మూలంగా క్రెడిట్ స్కోరు పై ప్ర‌భావం క‌నిపిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly