ఇల్లు నిర్మించాలనుకునే వారు పరిగణించాల్సిన విషయాలు..

చ‌ద‌ర‌పు అడుగు ఆధారంగా గాని, లేబ‌ర్ స‌ర‌ఫ‌రా ఆధారంగా గాని కాంట్రాక్ట‌ర్‌ను నియ‌మించుకోవాలి

ఇల్లు నిర్మించాలనుకునే వారు పరిగణించాల్సిన విషయాలు..

ఒక ఇండిపెండెంట్‌ గృహాన్ని నిర్మించడం లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి. సాదార‌ణంగా ప్ర‌జ‌లు తాము నివ‌సించేందుకు లేదా త‌మ త‌ల్లిదండ్రులు నివ‌సించేందుకు ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. మ‌రికొంతమంది అద్దెకు ఇచ్చేందుకు, పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న‌ప్పుడు, రుణం తీసుకోవ‌డం ద్వారా ఇల్లు నిర్మించాల‌నుకునేవారు, ఇంటికి య‌జ‌మానులు కావాల‌నే కోరిక‌ ఉన్న వారు ఇల్లు నిర్మించ‌డం లేదా కొనుగోలు చేయ‌డం చేస్తుంటారు.

ఇల్లు నిర్మాణంలో ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ఈ కింది విధానాలు మీకు స‌హాయ‌ప‌డ‌తాయి.

కాంట్రాక్ట‌ర్‌ :

చ‌ద‌ర‌పు అడుగు (ఎస్ఎఫ్‌టీ) ఆధారంగా గాని, లేబ‌ర్ స‌ర‌ఫ‌రా ఆధారంగా గాని కాంట్రాక్ట‌ర్‌ను నియ‌మించుకోవాలి. ఒకవేళ లేబ‌ర్‌ను స‌ర‌ఫ‌రా చేసే విధంగా కాంట్రాక్ట‌ర్‌ను నియ‌మించుకుంటే, నిర్మాణానికి అవ‌స‌ర‌మైన మెటీరియ‌ల్స్ (ముడిస‌రుకు, ప‌నిముట్లు) విష‌యంలో మీరు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించుకోవాలి. చ‌ద‌రపు అడుగు ఆధారంగా నియ‌మిస్తే మొత్తం భాద్య‌త కాంట్రాక్ట‌ర్‌పైనే ఉంటుంది.

అనుమతులు :

భవన ప్రణాళిక , విద్యుత్, నీరు, మురుగు నీరు వంటి వాటి కోసం వివిధ ప్రభుత్వ అధికారుల నుంచి మీరు స్వ‌యంగా గాని, మీ కాంట్రాక్ట‌ర్ ద్వారా గాని త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తులు పొందాలి.

బ‌డ్జెట్ :

మీ ఆర్ధిక వ‌న‌రుల‌ను, ప‌రిమితుల‌ను తెలుసుకోవాలి. ఇల్లు నిర్మించేందుకు కావ‌ల‌సిన మొత్తం మీ వద్ద సిద్ధంగా ఉందా, లేదంటే లోను తీసుకుంటున్నారా? ఒకవేళ రుణం తీసుకుంటే, అందుకు కావ‌ల‌సిన‌ అర్హ‌త‌లు, రుణ‌కాల ప‌రిమితి, వ‌డ్డీ రుసుములు, ప్రాసెసింగ్ ఫీజు, ఈఎమ్ఐ మొద‌లైన వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

మీరు ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించుకోవాల‌నుకుంటే, నిర్మాణం జ‌రుగుతున్న మొత్తం ఎస్ఎఫ్‌టీ స్థ‌లం, ఇంటి రూప‌క‌ల్ప‌న‌(డిజైన్‌), ఎన్ని గ‌దులు నిర్మించాలి, గ‌దుల ప‌రిమాణం, ఫ్లోరింగ్ పేయింట్స్‌, బాత్‌రూమ్ ఫిట్టింగులు, ఉప‌క‌ర‌ణాలు, విద్యుత్ అమరికలు, వంట గది అమరికలు, తలుపులు, అల్మారాలు వంటి వాటిలో ఉప‌యోగించే ముడిస‌రుకుల(మెటీరియ‌ల్స్‌) విష‌యంలో జాగ్ర‌త్త‌గా, క‌చ్చితంగా వ్య‌వ‌హ‌రించాలి.

ఇల్లు ప్రారంభ స‌మ‌యంలో నిర్ణ‌యించిన‌ట్లుగా మెటీరియ‌ల్స్ నాణ్య‌త ప్ర‌మాణాలు ఉండేలా చూసుకోవాలి. త‌ర‌చూ మార్పులు చేస్తుంటే అద‌న‌పు భారం ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఇంటి నిర్మాణంలో ఉప‌యోగించే ప్ర‌తీ వ‌స్తువు ధ‌ర‌, చెల్లింపు నిబంధ‌న‌లు, వాయిదాలు, మెటీరియ‌ల్ ఎక్క‌డ కొనుగోలు చేయాలి, మెటీరియ‌ల్స్ ప్ర‌మాణాలు, ప్ర‌తీ ద‌శ పూర్తి చేసేందుకు ప‌ట్టే స‌మ‌యం, నిర్మాణం పూర్తైన అనంత‌రం శుభ్ర‌ప‌ర‌చి ఇవ్వ‌డం, వాచ్‌మేన్‌(అవ‌స‌ర‌మైతే) వంటి వాటి గురించి కాంట్రాక్ట‌ర్‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాలి.

ముఖ్య‌విష‌యం :

ఒక‌వేళ మీరు అద‌నంగా ఫ్లోర్స్ నిర్మించాలనుకుంటే ముందుగా గ్రౌండ్ కానీ, ఫ‌స్ట్ ఫ్లోర్ కానీ పూర్తి చేసిన అనంత‌రం మాత్ర‌మే అద‌న‌పు ఫ్లోర్‌ల గురించి ఆలోచించాలి. లేదంటే ఏకార‌ణం చేత‌నైనా మీ డ‌బ్బు బ్లాక్‌ అయితే ఏ ఫ్లోరు కూడా పూర్తిగా నిర్మించ‌లేక‌పోవ‌చ్చు. ఈ కార‌ణంగా అసంపూర్తిగా మిగిలిపోయిన భ‌వ‌నాలు మ‌నం చూస్తుంటాం.

భ‌విష్య‌త్తు క్లెయిమ్‌ల దృష్ట్య అన్ని వారెంటీ, గ్యారెంటీ కార్డుల‌ను భ‌ద్ర‌ప‌రచుకోవాలి. మీరు దాదాపు 10 సంవ‌త్స‌రాలు ఆ ఇంటిలో నివ‌సించాల‌నుకుంటే ఇల్లు నిర్మించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉంటుంది. ఒక‌వేళ ఉద్యోగ రీత్యా వేరే ప్ర‌దేశాలకు వెళితే మీరు తిరిగి వ‌చ్చే స‌రికి ఇల్లు పాత‌ది కావ‌డం వ‌ల్ల మ‌ర‌మ్మ‌త్తుల నిమిత్తం మ‌రొక‌సారి పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. మీ వ‌య‌సు, చేసే ప‌ని(ఉద్యోగం/ వ్యాపారం), ఆదాయం, అవ‌స‌రాల ఆధారంగా ఇల్లు నిర్మించుకోవాలి. ఇల్లు నిర్మించేందుకు కావ‌ల‌సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవ‌డం, ప్ర‌ణాళిక రూపొందించుకోవ‌డం, నిర్మాణంలో ప‌ర్య‌వేక్ష‌ణ‌, ఖ‌ర్చుల‌ను నియంత్రించుకోవ‌డం, అన్ని ముఖ్య‌మే.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly