డెట్ ఫండ్లలో పెట్టుబడి చేస్తున్నారా?
డెట్ సెక్యురిటీలలో క్రెడిట్ నాణ్యతలో మార్పు దాని విలువలో పెరుగుదలకు లేదా తరుగుదలకు దారి తీస్తుంది.
మార్కెట్లో ఉండే అన్ని డెట్ ఫండ్లు ఒకే విధంగా ఉండవు. అవి ఎంచుకునే వివిధ రకాలైన పథకాలు, వాటిలో ఉండే నష్టాల మీద వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది. డెట్ ఫండ్లకు రాబడి వచ్చే మార్గాలు రెండు రకాలుగా చెప్పవచ్చు. ఫండ్ పెట్టుబడి చేసిన సెక్యూరిటీల ద్వారా సంపాదించిన కూపన్ లేదా వడ్డీ ఆదాయం, మరొకటి సెక్యూరిటీల విలువలో పెరుగుదల కారణంగా లాభం రూపంలో తిరిగి వస్తుంది. ఈ రెండు మార్గాల్లో వచ్చే రాబడిని కలిపితే మొత్తం డెట్ ఫండ్లలో లభించే ఆదాయంగా చెప్పవచ్చు. పోర్టుఫోలియోలో ఉన్న వివిధ రకాల పెట్టుబడుల ద్వారా వడ్డీ ఆదాయం పొందడం డెట్ ఫండ్లలో భాగంగా ఉంటుంది. పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం నిర్ణీత కాలపరిమితిలలో లేదా మెచ్యూరిటీ పూర్తయిన తరువాత అసలుతో కలిపి అందుకుంటారు. ఈ సెక్యురిటీల ద్వారా అందే కూపన్ దాని క్రెడిట్ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. కాలపరిమితి ఎక్కువ కలిగిన బాండ్లు సాధారణంగా ఎక్కువ సంఖ్యలోల కూపన్లు కలిగి ఉంటాయి. అదేవిధంగా, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న బాండ్లు, అధిక డిఫాల్ట్ ప్రమాదాన్ని సూచిస్తాయి. కాబట్టి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీటిలో అధిక కూపన్ రేటును అందిస్తుంటాయి. రెండోది, సెక్యూరిటీల విలువలో పెరుగుదల నుంచి వచ్చే ఆదాయం. పెట్టుబడి విలువలో పెరుగుదల కారణంగా లభించే ఆదాయం కూపన్ ద్వారా లభించే వడ్డీ ఆదాయంతో కలిసి నికర ఆస్తి విలువ (ఎన్ఎవి) పెరిగేందుకు తోడ్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పెట్టుబడుల విలువ తగ్గితే ఆ ప్రభావం ఎన్ఏవీ పై చూపుతుంది.వడ్డీగా లభించే ఆదాయంలో కోత పడే అవకాశముంటుంది. సెక్యూరిటీల విలువలో లాభాలు లేదా నష్టాలు మార్కెట్లో వడ్డీ రేట్లు మార్పులకు లోనవుతుంటాయి. వడ్డీ రేట్ల పెరుగుదల కారణం ప్రస్తుతం ఉండే సెక్యూరిటీలకు తక్కువ కూపన్లు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వాటి విలువ తగ్గిపోతుంది. వడ్డీరేట్లు పడిపోయినప్పుడు దీనికి వ్యతిరేక పరిణామం ఏర్పడుతుంది. సెక్యూరిటీల విలువలో మార్పులు ఎన్ఏవీ పై ప్రభావం చూపిస్తాయి. మార్కెట్లో వడ్డీ రేటు కదలికల ప్రభావం డెట్ సెక్యురిటీలపై ఎక్కువగా ఉంటుంది.
ఫండ్ల పెట్టుబడుల లక్ష్యాన్ని బట్టి వివిధ రకాల స్థిరాదాయ పెట్టుబడులను ఎంచుకుంటాయి. పెట్టుబడిదారులకు స్థిరమైన ఎన్ఎవి, స్థిరమైన రాబడులను అందించే లక్ష్యంగా పెట్టుకున్న ఫండ్లు, కూపన్ ఆదాయాన్ని సంపాదించటంపై దృష్టి పెట్టి, చాలా తక్కువ పరిమాణంలో స్వల్పకాలిక స్థిరాదాయ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా అస్థిరతను తగ్గించుకుంటాయి. ఇలాంటి ఫండ్ల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండవచ్చు. లిక్విడ్ ఫండ్లు, ఓవర్నైట్ ఫండ్లు ఈ కోవకు చెందినవే.
ఫండ్లు తక్కువ క్రెడిట్ రేటింగ్ కలిగిన బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూపన్ లేదా వడ్డీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ అధిక వడ్డీ ఆదాయం అధిక నష్టభయాన్ని కలిగి ఉంటుంది. డెట్ సెక్యురిటీలలో క్రెడిట్ నాణ్యతలో మార్పు దాని విలువలో పెరుగుదలకు లేదా తరుగుదలకు దారి తీస్తుంది.
క్రెడిట్ నాణ్యత తగ్గిన సందర్భంలో దాని విలువ పడిపోతుంది. దీని ప్రభావం ఎన్ఏవీ పై తీవ్రంగా ఉంటుంది. అత్యధిక నష్టభయం కలిగిన సెక్యురిటీలను ఎంచుకోవడం ద్వారా తిరిగి చెల్లించకపోయే నష్టభయం (డీఫాల్ట్) ఉంటుంది. పెట్టుబడి చేసిన సంస్థ డీఫాల్టు అయితే ఫండ్లకు అసలు వడ్డీ చెల్లింపులు అందుకపోవచ్చు, ఇది ఆ ఫండ్ లో మదుపు చేసిన పెట్టుబడిదారులకు నష్టాన్ని కలిగిస్తుంది. డెట్ ఫండ్ లో ఉండే క్రెడిట్ రిస్క్ ను క్రెడిట్ రేటింగ్ ప్రొఫైల్ నుంచి విశ్లేషించవచ్చు. డిఫాల్ట్ మదుపర్లు ఈ రకమైన నష్ట భయాన్ని తగ్గించుకోవటానికి మార్గం, ఎక్కువ సంఖ్యలో పెట్టుబడులను చేస్తూ, ఏ ఒక్క సెక్యురిటీలోనూ అధిక మొత్తం పెట్టుబడి చేయకుండా ఉండే వైవిధ్యత కలిగిన ఫండ్లను ఎంచుకోవాలి.
రాబడి అధికంగా పొందే లక్ష్యంతో ఉండే ఫండ్లు, దీర్ఘకాలిక స్థిరాదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి చేయడం ద్వారా సాధారణ కూపన్ ఆదాయంతో పాటు సెక్యురిటీల విలువలో వృద్ధి ద్వారా రాబడి పొందుతాయి. ఇలాంటి ఫండ్లలో ఎన్ఏవీలు హెచ్చుతగ్గులకు లోనవుతూ అస్థిరంగా ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యంతో పెట్టుబడి చేసే మదుపర్లకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
Comments
0