ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి చేసేముందు గమనించాల్సిన విషయాలు
ఈటీఎఫ్ లను ఎంచుకునేందుకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
మన దేశంలో చాలా రకాల ఈటీఎఫ్ లు అందుబాటులో ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఆధారిత ఇండెక్స్ ఫండ్లు నిఫ్టీ 100, ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100 ఈటీఎఫ్ మొదలైనవి. సెక్టార్, థీమ్ ఆధారిత, మౌలికరంగాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి చేసే ఈటీఎఫ్ లు, కమోడిటీ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈటీఎఫ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్స్చేంజీలో ట్రేడ్ అవుతుంది. రియల్ టైమ్ ఎన్ఏవీ పద్ధతి అందుబాటులో ఉంటుంది. మార్కెట్ సమయంలో వీటి క్రయవిక్రయాలు చేసేందుకు వీలుంటుంది.
ఈటీఎఫ్ లను ఎంచుకునేందుకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
పెట్టుబడి వర్గం:
అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి వర్గాలకు చెందిన ఈటీఎఫ్ ల్లో తమకు అనుగుణంగా ఉండే పెట్టుబడి వర్గానికి చెందిన ఈటీఎఫ్ మదుపర్లు ఎంచుకోవాలి. వైవిధ్యత ఎక్కువగా ఉన్న బ్రాడ్ ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్ లో పెట్టుబడి చేయడం ఏదైనా రంగాలకు చెందిన సెక్టార్ ఈటీఎఫ్ లో పెట్టుబడి చేయడం కంటే మంచిది.
లిక్విడిటీ ఎక్కువగా ఉండాలి:
ఈటీఎఫ్ లో పెట్టుబడి చేసేటపుడు లిక్విడిటీ ఉండే విధంగా చూసుకోవాలి. ట్రేడింగ్ యాక్టివ్ గా జరిగే ఈటీఎఫ్ లను ఎంచుకోవాలి. ఎక్స్ఛేంజీ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూనిట్లను విక్రయించవచ్చు.
ట్రాకింగ్ ఎర్రర్ స్వల్పంగా ఉండాలి:
ఈటీఎఫ్ పనితీరుకు కొలమానంగా ట్రాకింగ్ ఎర్రర్ ను పరిగణిస్తారు. ఇండీస్ ఆధారంగా ఉంటాయి కాబట్టి వాటి పనితీరు ను బెంచ్ మార్క్ తో పోల్చిచూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈటీఎఫ్ అనుకరిస్తున్న సూచీకి, ఈటీఎఫ్ కు మధ్య రాబడిలో గల తేడానే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ఎందుకంటే ఈటీఎఫ్ పై వచ్చే రాబడి సూచీపై వచ్చిన రాబడికి దగ్గరగా ఉంటుంది. మదుపర్లు ఈటీఎఫ్‌లో పెట్టుబడి చేసేముందు దీర్ఘకాలంలో నూ తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉండే వాటిని ఎంచుకోవాలి.
ఇంపాక్ట్ కాస్ట్ తక్కువ ఉండాలి:
ఇంపాక్ట్ కాస్ట్ అంటే ఎక్స్ఛేంజీ ద్వారా క్రయవిక్రయాలు జరిపేటపుడు పరోక్షంగా చెల్లించే రుసుము. ఈటీఎఫ్ కు ఎక్కువ లిక్విడిటీ ఉంటే తక్కువ ఇంపాక్ట్ కాస్ట్ ఉంటుంది. తక్కువ లిక్విడిటీ ఉంటే ఎక్కువ ఇంపాక్ట్ కాస్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ కాస్ట్ నేరుగా కాకుండా అంతర్లీనంగా పడే చార్జీలు. ఇంపాక్ట్ కాస్ట్ తక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలి.
నిర్వహాణరసుం తక్కువగా ఉండేవి ఎంచుకోవాలి:
ఈటీఎఫ్‌లు వార్షిక రుసుమును ఎక్స్పెన్స్ నిష్పత్తిలో చూపిస్తారు. దీంట్లో ఫండ్ నిర్వహణ ఖర్చులైన నిర్వహాణ బృందం ఫీజు, అడ్మినిస్ట్రేటివ్, ఆపరేటింగ్ ఖర్చులు ఇంకా ఇతర ఖర్చులు ఏవైనా ఉంటే వాటిని చూపిస్తారు. ప్రస్తుతం నిఫ్టీ,సెన్సెక్స్ ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్ లు 0.5 - 1 % రుసుము వసూలు చేస్తున్నారు.
Comments
0