ఆరోగ్య‌బీమా క్లెయిమ్ చేస్తున్నారా?

పాల‌సీదారులు త‌మ ఆరోగ్య‌బీమా క్లెయిమ్ చేసేముందు కొన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాలి

ఆరోగ్య‌బీమా క్లెయిమ్ చేస్తున్నారా?

ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకున్న వారు , ఆసుప‌త్రికి బిల్లు బీమా హామీ మొత్తం కంటే ఎక్కువ అయితే ఆ ఖ‌ర్చు పాల‌సీదారులు త‌మ సొంత డ‌బ్బుతో చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి ఆరోగ్య బీమా హామీ మొత్తం రూ.2.5 ల‌క్ష‌లు అనుకుంటే, ఆసుప‌త్రిలో చేరాక ఖ‌ర్చు రూ.3.5 ల‌క్ష‌లు అయితే పై రూ.1 ల‌క్ష‌ పాల‌సీదారుడు చెల్లించాలి. అయితే ముందుగా కొన్ని జాగ్ర‌త్త‌లు, సూచ‌న‌లు తీసుకోవ‌డం ద్వారా ఇలాంటి ప‌రిస్థితి రాకుండా చూసుకునేందుకు అవ‌కాశం ఉంది.

వైద్య ఖ‌ర్చు ఎక్కువ‌వ‌కుండా: ఆరోగ్య బీమా పాల‌సీదారులు ఆసుప‌త్రులు, అవి విధించే ఛార్జీలు త‌దిత‌ర విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. ప్ర‌స్తుతం ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకున్న వారు ఎక్కువ‌గా క్యాష్‌లెస్ (న‌గ‌దు ర‌హిత) చికిత్స చేయించుకుంటున్నారు. క్ర‌మంగా బీమా కంపెనీల నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులు పెర‌గ‌డం దీనికి ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

ఆరోగ్య బీమా కంపెనీల నెట్‌వ‌ర్క్ ప‌రిధిలో ఉండే ఆసుప‌త్రుల్లో చికిత్స న‌గ‌దుర‌హితంగా ల‌భిస్తుంది. అయితే పాల‌సీదారులు త‌మ‌కు క‌లిగిన అనారోగ్యం బ‌ట్టి ఆసుప‌త్రిని ఎంపిక చేసుకోవాల‌ని బీమారంగ నిపుణులు చెబుతున్నారు. అన్నీ అని చెప్ప‌లేం కానీ చాలా వ‌ర‌కూ ఆసుప‌త్రులు బీమా క్లెయిమ్ చేసుకునే వారి హామీ మొత్తాన్ని ఏదోవిధంగా పూర్తిగా వినియోగించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. కాబ‌ట్టి పాల‌సీ దారులు ఈ విష‌యంలో కాస్త అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రాక్చ‌ర్ వంటి వాటికి సాధార‌ణంగా ఉండే ఆసుప‌త్రికి వెళ్ల‌డం న‌య‌మంటున్నారు. ఎందుకంటే ఆసుప‌త్రి ని బ‌ట్టి కొన్ని ర‌కాల ఖ‌ర్చులు ఉంటాయి. ఆసుప‌త్రిలో తీసుకునే గ‌ది మొద‌లైన వాటి ఖ‌ర్చులు ఆధారంగా మొత్తం ఖ‌ర్చు ఉంటుంది కాబ‌ట్టి చిన్న స‌మ‌స్య‌ల‌కు అన్ని సౌక‌ర్యాలు ఉండే సాధార‌ణం ఆసుప‌త్రిని ఎంచుకోవ‌డం మంచిద‌ని అంటున్నారు.

బీమా సంస్థ‌ల‌ను సంప్ర‌దించి: సాధార‌ణంగా బీమా కంపెనీలు త‌మ నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితాలో చేర్చుకునేందుకు కొన్ని ఒప్పందాలు,నియ‌మాలు పాటిస్తాయి. వీలైనంత వ‌ర‌కూ బీమా కంపెనీలు త‌క్కువ ఖ‌ర్చులు అయ్యే వాటిని త‌మ నెట్‌వ‌ర్క్ ప‌రిధిలో చేర్చుకుంటారు. కాబ‌ట్టి పాల‌సీదారులు ఈ విష‌యంలో ఏవైనా సందేహాలు ఉంటే బీమా కంపెనీల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఆసుప‌త్రుల‌ను బ‌ట్టి ఖ‌ర్చులు మారుతాయి. అన్ని ఆసుప‌త్రుల్లోనూ వైద్య ఖ‌ర్చులు ఒకేలా ఉండ‌వు. ఆ ఆసుప‌త్రిలో ఉన్న వైద్యులు, వారి నైపుణ్యాలు, సౌక‌ర్యాలు, గ‌దులు మొద‌లైన వాటి ఆధారంగా వైద్య ఖ‌ర్చులు మారుతుంటాయి. కాబ‌ట్టి ఆసుప‌త్రి ఎంపిక ద్వారా కూడా ఖ‌ర్చులు పెర‌గ‌కుండా ఉండేలా చూసుకోవ‌చ్చంటున్నారు నిపుణులు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు లేదా ప్ర‌త్యేక వైద్య‌సేవ‌లు కావాల‌నుకుంటే ఎలాగో ప్ర‌త్యేక సౌక‌ర్యాలుండే ఆసుప‌త్రుల‌కు వెళ్లాలి.

క్యాష్ లెస్ ద్వారా త‌క్కువ‌ ఖ‌ర్చులు: కొన్ని ఆసుప‌త్రులు క్యాష్ లెస్ చికిత్స‌కు త‌క్కువ వైద్య‌ఖ‌ర్చులు తీసుకుంటున్న‌ట్లు కొంద‌రు ఆరోగ్య బీమా నిపుణులు చెబుతున్నారు. దీనికి కార‌ణం ఆయా ఆసుప‌త్రులు బీమా సంస్థ‌ల‌తో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ విధంగా ఒప్పందం కుదుర్చుకునే ఆసుప‌త్రులు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే ఆరోగ్య బీమా పాల‌సీదార్ల‌కు 5-20 శాతం ఛార్జీలు త‌క్కువ‌ తీసుకుంటున్నాయ‌ని వారు చెబుతున్నారు. క్లెయిమ్‌లు ఎక్కువ‌గా వ‌స్తే ఆయా బీమా సంస్థ‌ల‌కు త‌గ్గింపు కూడా పెరుగుతుంద‌ని అంటున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly