ఇంట‌ర్‌నెట్ లేకుండానే.. మొబైల్ ద్వారా బ్యాంకు లావాదేవీలు

న‌గ‌దు బ‌దిలీ చేసేందుకు మీ మొబైల్‌లో *99#కు డ‌య‌ల్ చేసి కొద్ది సేపు వేచి చూస్తే స‌రిపోతుంది.

ఇంట‌ర్‌నెట్ లేకుండానే.. మొబైల్ ద్వారా బ్యాంకు లావాదేవీలు

మీరు ప‌రిమిత ఇంట‌ర్‌నెట్ లేదా అస‌లు ఇంట‌ర్‌నెట్ క‌వ‌రేజ్ లేనిచోట ఉన్నారా? అత్య‌వ‌స‌రంగా బ్యాంకు నుంచి న‌గ‌దు బ‌దిలీ చేయాలా? ఇప్పుడు ఇది సాధ్య‌మే. అయితే ఇందుకోసం మీ మొబైల్ నెంబ‌రు, బ్యాంకు వ‌ద్ద ముందుగానే రిజిస్ట‌ర్ అయివుండాలి. రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌రు నుంచి *99# డ‌య‌ల్ చేయ‌డం ద్వారా బ్యాంకు ఆర్థిక లావాదేవీల‌ను పూర్తి చేయ‌వ‌చ్చు.

ఇది ఎలాంటి స‌ర్వీస్‌?
నేష‌న‌ల్ యూనిఫైడ్ యూఎస్ఎస్‌డీ ప్లాట్‌ఫామ్‌(ఎన్‌యూయూపీ) ద్వారా ఈ స‌దుపాయం అందుబాటులో ఉంది. ఈ సేవ‌ల‌ను నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ముందుగా 2012, ఆ త‌రువాత 2014లోనూ విస్తృత శ్రేణి సేవ‌లు, క‌వ‌రేజ్‌తో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ స‌ర్వీసు యూఎస్ఎస్‌డీ(అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) క‌మ్యూనికేష‌న్ ప్రోటోకాల్‌పై ప‌నిచేస్తుంది. మొబైల్ ఫ‌క్ష‌న్‌కు, నెట్‌వ‌ర్క్‌లోని ఒక అప్లికేష‌న్ ప్రోగ్రామ్‌కు మ‌ధ్య టెక్స్ట్ మేసేజ్‌ల‌ను పంపించే ఒక క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ. ఇది జీఎస్ఎమ్ (గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్) ఫోన్‌లలో మాత్రమే పనిచేస్తుంది.

ఎలా ప‌నిచేస్తుంది?
ఇందుకోసం ఎన్‌యూయూపీ, అన్ని బ్యాంకుల‌ను, టెలికాం స‌ర్వీసు ప్రోవైడ‌ర్ల‌ను ఒక చోట చేరుస్తుంది. బ్యాంకు ఖాతాదారుడు ముందుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ)పై బ్యాంకింగ్ స‌ర్వీసును అనుమ‌తించాలి.

మీ ఫోన్‌లో *99#ను డ‌య‌ల్ చేసి కొన్ని సెక‌న్ల పాటు వేచి ఉండాలి. ఇందులో అందించే సేవలు మీ మొబైల్ స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. ఇందులో మొబైల్ నెంబ‌రు, యూపీఐ ఐడీ, ఐఎఫ్ఎస్‌సీ, బ్యాంకు ఖాతా ద్వారా… నిధుల‌ను బ‌దిలీ చేయ‌డం అనే అప్ష‌న్లు ఉంటాయి. మీరు ఏవిధంగా బ‌దిలీ చేయాల‌నుకుంటున్నారో… ఆ అప్ష‌న్ ప్ర‌క్క‌న ఉన్న నెంబ‌రును ఎంపిక చేసుకుని డ‌య‌ల్ చేసి కావ‌ల‌సిన సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. మొబైల్ నెంబ‌ర్‌, యూపీఐ ఐడీ, స్వ‌యంగా న‌గ‌దు బ‌దిలీ చేసుకోవ‌డంతో పాటు, బ్యాలెన్సును చెక్ చేసుకోవ‌చ్చు, ఇంకా యూపీఐ పిన్ జ‌న‌రేట్ చేయ‌డం, మార్చుకోవ‌డం వంటివి చేయ‌వ‌చ్చు. ఎన్‌యూయూపీ సేవ‌ల‌ను ఉప‌యోగించ‌కుండానే ఇత‌రుల‌కు ఈ సేవ ద్వారా న‌గ‌దు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. అయితే బ్యాంకు వ‌ద్ద మీ మొబైల్‌ను ముందుగానే రిజిస్ట‌ర్ చేసుకుని ఉండాలి.

లావాదేవీలు:
ఈ స‌ర్వీసును ఉప‌యోగించి అధిక మొత్తంలో లావాదేవీల‌ను నిర్వ‌హించ‌డం సాధ్యంకాదు. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం రూ. 5 వేలు లోపు లావాదేవీల‌ను మాత్ర‌మే బ్యాంకులు ఈ విధానం ద్వారా అనుమ‌తిస్తాయి. ఈ స‌ర్వీసుకు చాలా బ్యాంకులు ఎటువంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌వు. అయితే *99# స‌ర్వీసును ఉప‌యోగించుకున్నందుకు గానూ మీ టెలికాం సంస్థ చార్జీల‌ను విధిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు ఉప‌యోగించే నెట్‌వ‌ర్క్ ఎయిర్టెల్‌ అయితే ప్ర‌తీ లావాదేవీకి రూ. 0.50 ఛార్జ్ చేస్తుంది. భార‌త టెలికాం నియంత్ర‌ణ సంస్థ‌(ట్రాయ్‌) మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం టెలికాం సంస్థ‌లు ఈ సంస్థ‌ల‌పై ప్ర‌తీ లావాదేవీకి గ‌రిష్టంగా రూ.1.50 ఛార్జ్ చేయ‌వ‌చ్చు.

గుర్తించుకోవ‌ల‌సిన విష‌యాలు:

  • ఫోన్ పోయినప్ప‌టికీ ఈ సేవ‌లు దుర్వీనియోగం అయ్యే ప్ర‌మాదం లేదు. కార‌ణం లావాదేవీలు నిర్వ‌హించేందుకు మీరు యూపీఐ పిన్ నెంబ‌రును త‌ప్ప‌నిస‌రిగా ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.
  • అయిన‌ప్ప‌టికీ ఎలాంటి దుర్వీనియోగం జ‌ర‌గ‌కుండా ఫోన్ పోయిన వెంట‌నే మీ బ్యాంకుకు స‌మాచారం అందించి మొబైల్ బ్యాంకింగ్‌ను డియాక్టివేట్ చేసుకోవాలి.
  • ఇన్స్‌టెంట్ ఇంట‌ర్ బ్యాంక్ స‌ర్వీస్ అయిన ఇమ్మిడియేట్ పేమెంట్ స‌ర్వీస్‌(ఐఎమ్‌పీఎస్‌)ను ఉప‌యోగంచి చేసే సేవ‌ల‌ను ఒక్క‌సారి ప్రారంభించిన త‌రువాత వాటిని మ‌ధ్య‌లో నిలిపివేయ‌డం గానీ, ర‌ద్దు చేయ‌డం గానీ సాధ్యం కాదు.
  • ఈ స‌ర్వీసుపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే…మీరు ఎదుర్కుటుంన్న స‌మ‌స్య ఆధారంగా బ్యాంకు లేదా టెలికాం స‌ర్వీసు ప్రొవైడ‌ర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly