ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ 10 క్యాటగిరీలు మీకు తెలుసా?

సెబీ (కొత్త నిబంధనల ప్రకారం) మార్కెట్ క్యాపిటలిజషన్ పరంగా లార్జ్ కాప్, మిడ్ కాప్, స్మాల్ కాప్ షేర్లకు నిర్వచనం తెలిపింది

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఈ 10 క్యాటగిరీలు మీకు తెలుసా?

ఇటీవలే సెబీ మ్యూచువల్ ఫండ్ల వర్గీకరణ చేసింది. దీంతో ఫండ్ నిర్వాహ‌కులు ఈక్విటీ ఫండ్లను 10 క్యాటగిరీలుగా విభ‌జించారు. మ్యూచువల్ ఫండ్లలో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ రకాలు ఉంటాయి. వీటిలో ఒకో క్యాటగిరి ఒక్కో రకమైన పెట్టుబడి సాధనాల్లో మదుపు చేస్తాయి. ఈక్విటీ ఫండ్లు ప్రధానంగా షేర్లలో మదుపు చేస్తాయి. ఈక్విటీ ఫండ్లలో కూడా వివిధ ర‌కాలు ఉంటాయి. పెట్టుబ‌డి చేసేందుకు కొన్నిఫండ్లు లార్జ్ క్యాప్ కంపెనీల్లో, కొన్ని మిడ్ క్యాప్ లలో ఇలా రకరకాల షేర్లను ఎంచుకుంటాయి. సెబీ (కొత్త నిబంధనల ప్రకారం) మార్కెట్ క్యాపిటలైజేష‌న్ పరంగా లార్జ్ , మిడ్ , స్మాల్ క్యాప్ షేర్లకు నిర్వచనం తెలిపింది. అతి పెద్ద 100 కంపెనీలు లార్జ్ క్యాప్ అని, 101-250 వరకూ కంపెనీల‌ను మిడ్ క్యాప్ , అంత కంటే చిన్నకంపెనీల‌ను స్మాల్ క్యాప్ గా ప‌రిగ‌ణిస్తారు. ఈ నిబంధనల వల్ల గతంలో లా కాకుండా మ్యూచువ‌ల్ ఫండ్ ఏఎమ్‌సీలు అన్నీ ఒకే పధ్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. దీని ద్వారా మదుపరులకు మరింత పారదర్శకత లభిస్తుందనే చెప్పాలి.

కొత్త నిబంధనల ప్రకారం ఏర్పడిన ఈక్విటీ ఫండ్ రకాల గురించి ఇప్పుడు చూద్దాం.

  1. లార్జ్ క్యాప్ ఫండ్లు

ఇవి ఫండ్ ఆస్తుల్లో కనీసం 80 శాతం పెట్టుబడులు లార్జ్ కాప్ షేర్లలో పెట్టాల్సి ఉంటుంది. అతి పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇందులో రిస్క్ కాస్త పరవాలేదని చెప్పాలి. అయితే రాబడి కూడా స్థిరంగా ఉంటుంది కానీ స్మాల్ కాప్ లాగా ఎక్కువగా ఉండకపోవచ్చు. రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదు అనుకునే వారికి ఇవి బాగుంటాయి.

  1. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లు

ఇది కొత్తగా ఏర్పడిన క్యాటగిరి. ఈ ఫండ్లు లార్జ్ కాప్ తో పాటు కొంత మిడ్ కాప్ లో కూడా మదుపు చేస్తాయి. కనీసం 35 శాతం లార్జ్ కాప్ లో, కనీసం 35 శాతం మిడ్ కాప్ షేర్లలో మదుపు చేయాల్సి ఉంటుంది. లార్జ్ కాప్ ఫండ్ల కంటే ఇందులో కాస్త రిస్క్ ఎక్కువ.

  1. మిడ్ క్యాప్ ఫండ్లు

ఇవి ప్రధానంగా మిడ్ కాప్ షేర్లను ఎంచుకుంటాయి, అంటే కనీసం 65 శాతం మిడ్ కాప్ షేర్లలో మదుపు చేస్తాయి. ఇందులో స్మాల్ కాప్ కంటే రిస్క్ తక్కువ, లార్జ్క్ కాప్ కంటే ఎక్కువ.

  1. స్మాల్ క్యాప్ ఫండ్లు

ఈ ఫండ్లు ప్రధానంగా స్మాల్ కాప్ షేర్లను వెతికి అందులో మదుపు చేస్తాయి, అంటే కనీసం 65 శాతం వీటిలో పెట్టుబడులు పెడతాయి. ఇలాంటి కంపెనీల్లో రిస్క్ చాలా ఎక్కువ. ఒకోసారి మార్కెట్ ని బట్టి అత్యంత అధికంగా రాబడి రావచ్చు లేదంటే అతి తక్కువ రాబడి రావచ్చు.

  1. మల్టీక్యాప్ లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లు

ఇది కొత్త క్యాటగిరి కాదు. ఇందులో మార్పులు కూడా లేవు. ఈ ఫండ్లు మార్కెట్ కాప్ తో కానీ, పరిశ్రమ తో కానీ సంబంధం లేకుండా అన్నింటిలో మదుపు చేస్తాయి. ఒకే ఫండ్ ద్వారా అన్ని రకాల రంగాల్లో కేటాయింపులు కోరుకునే వారికి ఇవి నువైనవి. అయితే వీటిలో రిస్క్ ఒకే లాగా ఉండదు ఎందుకంటే కొన్ని ఫండ్లు లార్జ్ కాప్ లో ఎక్కువ మదుపు చేయవచ్చు, కొన్నిమిడ్ లేదా స్మాల్ కాప్ లో ఎక్కువ చేయవచ్చు. ఎంచుకునే సమయం లో పెట్టుబడులను గమనించి నిర్ణయం తీసుకుంటే మంచిది.

  1. డివిడెండ్ ఈల్డ్ ఫండ్లు

ఇది కూడా సెబీ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ఫండ్లు తరచుగా డివిడెండ్లు అందించే షేర్లలో మదుపు చేస్తాయి. అంటే మార్కెట్ లోని సగటు డివిడెండ్ ఈల్డ్ కంటే ఎక్కువగా అందించే కంపెనీల్లో 65 నుంచి 80 శాతం వరకు పెట్టుబడులు పెట్టాలి.

  1. వ్యాల్యూ ఫండ్లు

అంతర్గత విలువ కంటే తక్కువగా ఉన్నతక్కువగా ఉన్న కంపెనీలను వేల్యూ కంపెనీలు అంటారు. ఇలాంటి మంచి కంపెనీలు కొన్ని కారణాల వల్ల తక్కువ ధర లో మార్కెట్ లో ట్రేడ్ అవుతుండచ్చు. ఇందులో కాస్త రిస్క్ ఉన్నా మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.

  1. కాంట్రా ఫండ్లు

ఇవి కనీసం 65 శాతం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫండ్ మేనేజర్ లకి మార్కెట్ కి వ్యతిరేక దిశ‌గా ఆలోచన ఉంటుంది. ఉదాహరణకి నిరాశాజనక ప్రదర్శన చూపిస్తున్న కంపెనీల్లో లేదా రంగాల్లో మదుపు చేస్తారు.

  1. ఫోకస్డ్ ఫండ్లు

ఈ ఫండ్లు గరిష్టాంగా 30 షేర్లలో మాత్రమే మదుపు చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రంగాల్లో మాత్రమే మదుపు చేస్తాయి. కనీసం 80 శాతం ఈక్విటీల్లో మదుపు చేస్తాయి. విస్తరణ తక్కువగా ఉన్నందున ఇందులో కాస్త రిస్క్ ఎక్కువనే చెప్పాలి.

  1. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్ఎస్ఎస్)

ఇందులో మదుపు చేసిన మదుపరులకు సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇవి ఓపెన్ ఎండెడ్ లేదా క్లోజ్ ఎండెడ్ కావచ్చు, చాలా వరకు ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత ఆస్తుల్లో పెట్టుబడులు పెడతాయి. వీటిలో 3 ఏళ్ళ లాక్ ఇన్ కూడా ఉంటుంది.

చివరగా:

ఈక్విటీ ఫండ్లు రిస్క్ తో కూడుకున్నాయి. కనీసం 10 ఏళ్ళు మదుపు చేయాలనుకునే వారికి మాత్రమే ఇవి అనువైనవి. ఇందులో వ్యక్తిగత రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి ఏ రకం లో మదుపు చేయాలో ఎంచుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly