కార్డు పరిమితి పెంచుకోవాలా?

గతంలో చిన్న మొత్తం పరిమితితో కార్డులు తీసుకున్న వారు ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు.

కార్డు పరిమితి పెంచుకోవాలా?

చేతిలో నగదు ఉన్నా… లేకపోయినా అనుకున్న వస్తువును అనుకున్న క్షణంలో కొనేందుకు వీలు కల్పించేవి క్రెడిట్‌ కార్డులు. గతంలో చిన్న మొత్తం పరిమితితో కార్డులు తీసుకున్న వారు ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ క్రమంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాంకులు ఏం పరిశీలిస్తాయో చూద్దామా! క్రెడిట్‌ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకు అనేక విషయాలను పరిగణనలోనికి తీసుకుంటుంది.

మీ వార్షికాదాయం, ఉద్యోగంతో పాటు మీ రుణ చరిత్ర, సిబిల్‌ స్కోరు తదితరాలను పరిశీలిస్తుంది. మీరు గతంలో తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, మీ క్రెడిట్‌ స్కోరును చూసిన తర్వాత ఎంత మొత్తానికి కార్డు ఇవ్వాలని నిర్ణయిస్తుంది. ఒకసారి మీకు కార్డు పరిమితిని నిర్ణయించిందంటే… ఆ నెలలో మీకు బ్యాంకు అంత మేరకు అప్పు ఇవ్వడానికి అంగీకరించినట్లే. కొన్ని క్రెడిట్‌ కార్డు సంస్థలు సిబిల్‌ స్కోరు, రుణ చరిత్ర ఆధారంగా కూడా పరిమితిని నిర్ణయిస్తాయి. మీ ఆదాయం ఆధారంగా ఎంత పరిమితి ఉంటే మీరు సులువుగా అప్పు తీర్చగలరో నిర్ణయిస్తూ కార్డులను ఇస్తారు. అధికంగా పరిమితి ఇచ్చి ఖాతాదారు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చూస్తాయి బ్యాంకులు.

క్రెడిట్‌ కార్డును ఇచ్చే విషయంలో ఒక్కో బ్యాంకు, కార్డు సంస్థ ఒక్కో విధానాన్ని అనుసరిస్తాయి. పరిమితి విషయంలోనూ అంతే. ముఖ్యంగా ఆదాయ మార్గం ఏమిటనేది ప్రతి సంస్థా పరిశీలించే విషయమే. ఆదాయాన్ని గుర్తించేందుకు మీ వేతన ఖాతా వివరాలు, ఆదాయపు పన్ను రిటర్నులు, వేతన పత్రాలను చూస్తాయి. అంతేకాకుండా, మీరు పనిచేస్తున్న సంస్థ, ఉద్యోగ రకం కూడా మీకు కార్డు వస్తుందా లేదా అనేది ఆధారపడుతుంది. కొన్ని కార్డు సంస్థలు దరఖాస్తుదారుడి ఆదాయం:అప్పుల నిష్పత్తిని కూడా చూస్తాయి. అప్పులు మరీ ఎక్కువగా ఉన్నవారికి కార్డును నిరాకరించే అవకాశమూ లేకపోలేదు.

అధికంగానూ ఖర్చు చేయొచ్చు:

చాలామటుకు క్రెడిట్‌ కార్డు సంస్థలు నిర్ణీత పరిమితికి మించి కూడా ఖర్చు చేసేందుకు అనుమతిస్తాయి. అయితే, ఇలా వినియోగించుకునేందుకు కొన్ని రుసుములు, అదనపు ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. అందుకే, వీలైనంత వరకూ మీ కార్డు పరిమితికి మించి ఖర్చు చేయకుండా జాగ్రత్తపడాలి. పరిమితికి మించి ఖర్చు చేసినప్పుడు సిబిల్‌ స్కోరు మీద చాలా సందర్భాల్లో ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే, ప్రతిసారీ ఇలాగే జరుగుతుంటే మాత్రం మీ కార్డు పరిమితిని పెంచుకునేందుకు అవకాశాన్ని పరిశీలించడమే మేలు.

నిర్ణీత కాలం తర్వాతే…

ఒకసారి కార్డు తీసుకున్న తర్వాత 6 నుంచి 18 నెలల తర్వాత మాత్రమే మీ కార్డు పరిమితిని పెంచే విషయాన్ని ఆలోచిస్తాయి బ్యాంకులు. అయితే, ఇక్కడ రెండు విషయాలను పరిశీలిస్తాయి. మీరు ఇప్పటికే తీసుకున్న కార్డు తాలూకు, ఇతర రుణాలకు సంబంధించిన చెల్లింపులు ఎలా ఉన్నాయన్నదీ గమనిస్తాయి. ఆ తర్వాతే మీ కార్డు పరిమితిని పెంచాలా వద్దా అనేది నిర్ణయిస్తాయి.

అరుదుగా కొన్నిసార్లు బ్యాంకులు క్రెడిట్‌ కార్డు పరిమితిని కూడా తగ్గిస్తుంటాయి. క్రెడిట్‌ కార్డు సంస్థలు తమ ఖాతాదారులను నిశితంగా పరీక్షిస్తుంటాయి. ఒకవేళ ఖాతాదారు ఏదైనా రుణాన్ని తీర్చకుండా ఉన్నప్పుడు సిబిల్‌ స్కోరుపై ఆ ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు కార్డు సంస్థలు పరిమితిని తగ్గించే అవకాశం ఉంది.

కార్డు పరిమితి పెంచుకోవాలనుకున్నప్పుడు ముందుగా రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు తెలుసుకోవడం ఎంతో అవసరం. మీకు ఆదాయం పెరిగి, మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడు బ్యాంకును సంప్రదిస్తే సులువుగా మీ క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు వీలుంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly