మ‌ల్టీ క్యాప్ ఫండ్లలో మ‌దుపు వ‌ల‌న‌ ప్ర‌యోజ‌నాలు

మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెట్టుబ‌డికి మ‌రింత వైవిధ్య‌త‌ను అందించ‌వ‌చ్చు.

మ‌ల్టీ క్యాప్ ఫండ్లలో మ‌దుపు వ‌ల‌న‌ ప్ర‌యోజ‌నాలు

పెట్టుబడుల పెట్టే ముందు ఏ వర్గానికి చెందిన ఫండ్ల‌ను ఎంచుకోవాల‌నే దానిపై మ‌దుప‌ర్ల‌లో కొంత సందిగ్ధ‌త ఉంటుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మ‌ల్టీ క్యాప్ లేదా సెక్టార్ ఏ ఫండ్ల‌ను ఎంచుకోవాలి? ప్ర‌తీ వర్గానికి వాటికుండే ప్రయోజనం ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్లు స్థిరత్వాన్ని అందిస్తే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి రాబ‌డిని అందించేందుకు స‌హ‌క‌రిస్తుంటాయి. మల్టీ క్యాప్ ఫండ్లు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్-క్యాప్ మూడు కేట‌గిరీల‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. దీంతో ఈ ఫండ్లు రాబ‌డిని అందించ‌డంతో స్థిర‌త్వాన్ని కూడా క‌లిగి ఉంటాయి.

వీటి ప్ర‌త్యేక‌త‌:

లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్-క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్లు వాటికుండే ప‌రిమితుల‌ను బ‌ట్టి పెట్టుబ‌డులు చేస్తుంటాయి. మార్కెట్లో అనుకూల‌త ఉన్న‌ప్ప‌టికీ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ మిడ్ స్మాల్ క్యాప్ షేర్ల‌లో పెట్టుబడులు చేసేందుకు వీలుండ‌దు. అదేవిధంగా, అనుకున్న విధంగా రాణించ‌క‌పోయినా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ల పెట్టుబ‌డులును లార్జ్ క్యాప్ కంపెనీల్లో చేసేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఇలాంటి సంద‌ర్భాల్లో మల్టీ క్యాప్ ఫండ్లు ఏ క్యాప్ కు చెందిన కంపెనీల్లో అయినా మ‌దుపు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. దీర్ఘకాలంలో మార్కెట్లో ఏర్ప‌డే వివిధ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని త‌ద‌నుగుణంగా పెట్టుబ‌డుల‌ను చేసేందుకు మల్టీ-క్యాప్ ఫండ్లకు అనుకూల‌త ఉంటుంది. మిడ్ క్యాప్ కేటగిరితో పోలిస్తే మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో అస్థిత‌రత త‌క్కువ‌గా ఉంటుంది.

న‌ష్ట‌భ‌యం ప‌రంగా చూస్తే మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌లో మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్ల కంటే త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. సాధార‌ణంగా మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో చేసే పెట్టుబ‌డితో పాటు లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబ‌డి చేస్తుంటాయి. కాబ‌ట్టి వీటిలో కొంత న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది. లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే ఎక్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో మిడ్ స్మాల్ క్యాప్ పెట్టుబ‌డుల ఉంటాయి కాబ‌ట్టి ఆ మేర‌కు వీటిలో న‌ష్ట‌భ‌యం పెరుగుతుంది.

మ‌ల్టీ క్యాప్ ఫండ్ వేర్వేరు మార్కెట్ క్యాప్ ల‌కు చెందిన సంస్థ‌ల్లో పెట్టుబడి పెడుతుంది. కాబట్టి, ఫండ్ మేనేజర్ ప‌నితీరు కీలకం. ఏ క్యాప్ లో ఎంత శాతం పెట్టుబ‌డి చేయాల‌నే నిర్ణ‌యం మార్కెట్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఫండ్ మేనేజ‌రు తీసుకుంటారు. కాబ‌ట్టి ఫండ్ రాబ‌డి ఫండ్ మేనేజ‌రు సామ‌ర్థ్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. పెట్టుబడి పెట్టేముందు మ‌దుప‌ర్లు అనుసరించాల్సిన మొట్టమొదటి నియమం వైవిధ్య‌త. మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో సాధార‌ణంగా వైవిధ్య‌త ల‌భిస్తుంది. మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో అయితే వైవిధ్య‌త మ‌రింత పెరుగుతుంది.

ప‌న్నువిధానం :

దీర్ఘ‌కాలిక మూలధన రాబ‌డి అంటే ఒక సంవ‌త్స‌రం పైబ‌డి చేసిన పెట్ట‌బ‌డి పై వ‌చ్చిన రాబ‌డి రూ.1 ల‌క్షకు మించిన దానిపై 10 శాతం ప‌న్ను ఉంటుంది. రూ. ల‌క్ష కంటే త‌క్కువ ఉంటే ప‌న్ను ఉండ‌దు.స్వ‌ల్ప‌కాలిక మూలధన రాబ‌డి అంటే ఒక సంవ‌త్స‌రం కంటే త‌క్కువ కాలం పెట్టుబ‌డి పై వ‌చ్చే ఆదాయం. స్వ‌ల్ప‌కాలిక మూలధన ఆదాయానికి 15% ప‌న్ను ఉంటుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly