బీమా కొనుగోలుకు స‌రైన వ‌య‌సు ఏది?

బీమా కొనుగోలు చేసే వ్య‌క్తి వ‌య‌సు పెరిగిన కొద్ది ప్రీమియం పెరుగుతూ ఉంటుంది

బీమా కొనుగోలుకు స‌రైన వ‌య‌సు ఏది?

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో, ఎప్పుడు ఏ ఊహించ‌ని న‌ష్టం సంభ‌విస్తుందో ఎవ‌రికి తెలియ‌దు. ఊహించ‌ని న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకునేందుకు ప్ర‌తీ దానికి బీమా చేయించ‌డం అవ‌స‌రం. అనుకోకుండా వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడు గొడుగు ఎలా కాపాడుతుందో అదే విధంగా అనుకోని ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు బీమా మ‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఉంటుంది. మార్కెట్లో చాలా ర‌కాలైన బీమా ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులు చెప్పిన ప్ర‌కారం బీమా పాల‌సీల‌ను స‌రైన స‌మ‌యంలో తీసుకోవ‌డం చాలా ముఖ్యం. బీమాను కొనుగోలు చేసేప్పుడు మీ వ‌య‌సు, ఆదాయం మొద‌లైన వాటిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలి. స‌రైన బీమా ప‌థ‌కాన్ని ఎలా ఎంచుకోవాలి? ఏ వ‌య‌సులో కొనుగోలు చేయాలి? సాధార‌ణంగా బీమా ప‌థ‌కాలు వ్య‌క్తిగ‌తంగా ఉంటాయి కాబ‌ట్టి పాల‌సీదారులు త‌మ జీవ‌న‌ శైలి,ఆదాయానికి త‌గిన విధంగా హామీ ఉండేట్లు చూసుకోవాలి. బీమా ప‌థ‌కాల‌ను కొనుగోలు చేసేప్పుడు ఈ విష‌యం త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. మీ 20 సంవ‌త్స‌రాల వ‌య‌సులో కొనుగోలు చేయ‌వ‌ల‌సిన ముఖ్య‌మైన ప్ర‌ణాళిక‌ల్లో జీవిత బీమా పాల‌సీ ఒక‌టి. ఇది ఊహించ‌ని ప్ర‌మాదాల నుంచి మిమ్మ‌ల్ని మీరు కాపాడుకొనేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ట‌ర్మ్ పాల‌సీని చిన్న వ‌య‌సులోనే కొనుగోలు చేయండం వ‌ల‌న క‌లిగే ముఖ్య ప్ర‌యోజ‌నం, ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. 25 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ్య‌క్తి, 30 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి, రూ.7 వేల ప్ర‌మీయం చెల్లిస్తే, అదే పాల‌సీకి 30 సంవ‌త్స‌రాల వ్య‌క్తి రూ.9 వేల ప్రీమియం చెల్లించాలి.

చిన్న వ‌య‌సులో కొనుగోలు చేయ‌వ‌ల‌సిన మ‌రో ముఖ్య‌మైన పాల‌సీ ఆరోగ్య బీమా పాల‌సీ. మ‌న‌లో ఎక్కువ మంది స్థాన‌బ‌ద్ధ‌మైన (ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ప‌ని చేయటం) జీవ‌న శైలిని అనుస‌రిస్తున్నాము. దీని కార‌ణంగా వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. అంతేకాకుండా ఎప్పుడు అనారోగ్యం క‌లుగుతుందో తెలియ‌దు. స‌రైన ఆరోగ్య బీమా పాల‌సీ ద్వారా ఏ వ్యాధి, ప్ర‌మాదం జ‌రిగినా చికిత్స చేయించుకునేందుకు కావ‌ల‌సిన హామీని అందిస్తుంది. ఆరోగ్య బీమా పాల‌సీతో ప్ర‌మాద‌క‌ర‌మైన అనారోగ్య హామీ, ప్ర‌సూతి హామీ మొద‌లైన‌ రైడ‌ర్ల‌ను క‌ల‌ప‌డం ద్వారా మ‌రింత మెరుగైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. సాధార‌ణంగా చాలా మంది వారి 20 సంవ‌త్స‌రాల వ‌య‌సులో స్వంత‌ కారు లేదా బైక్ కావాల‌ని కోరుకోరుకుంటారు. అయితే అటువంటి వారు ఆ వాహ‌నాన్ని న‌డ‌ప‌డానికి లైసెన్స్‌, వాహ‌న బీమా రెండూ చాలా ముఖ్య‌మ‌ని ఎల్ల‌ప్పుడు గుర్తుంచుకోవాలి. రెండు చ‌క్రాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు బీమా ప్రీమియం వాహ‌నం కొన‌గోలు చేసిన సంవ‌త్స‌రం, త‌యారీ, మోడ‌ల్‌, ఇంజ‌న్ సామ‌ర్ధ్యం వంటి వాటిపై ఆధార‌ప‌డ‌తాయి.

30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో జీవితంలో స్థిర‌ప‌డ‌డానికి, మీ భ‌విష్య‌త్తు, మీ కుటుంబాన్ని ఉన్న‌త స్థానానికి తీసుకువెళ్ళడం వంటి వాటికి అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. వీటిని నెర్చ‌వేర్చేందుకు అద‌న‌పు భాద్య‌త వ‌హించాలి. మీకు, మీ కుటుంబ ర‌క్ష‌ణ కోసం ఆరోగ్య బీమా, జీవిత బీమా, వైక‌ల్య బీమా, గృహ బీమా వంటి కొన్ని ముఖ్య‌మైన బీమా ప‌థ‌కాల‌ను త‌ప్ప‌క తీసుకోవాల‌ని గుర్తించుకోండి.

భార‌తదేశంలో, స‌రైన బీమా లేకుండా వైద్య చేయించుకోవ‌డం చాలా మందికి, వారి శ‌క్తికి మించిందిగా ఉంది. ఒక వేళ మీరు మీ 20 ఏళ్ళ వ‌య‌స్సులో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌క‌పోతే క‌నీసం ఇప్పుడైనా కొనుగోలు చేయండి. త‌క్కువ హామీని ఇచ్చే పాల‌సీల‌ను కాకుండా మీ కుటుంబం అంత‌టికి ఉత్తమంగా ప‌నిచేసే పాల‌సీని కొనుగోలు చేయండి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, మాదిరిగానే గృహ బీమా కూడా చాలా ముఖ్య‌మైన‌ది. గృహ బీమా కొనుగోలు చేసేప్పుడు మీ వ‌స్తువుల స‌రైన విలువ‌ను లెక్కించాలి. అప్పుడే ఉత్త‌మ విలువ‌ను హామీగా పొంద‌వ‌చ్చు.

మీ 40 సంవ‌త్స‌రాల వ‌య‌సులో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌ల‌సి ఉండొచ్చు. ఈ వ‌య‌సులో మీ కుటుంబం పెద్ద‌దై ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. అందువ‌ల్ల కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ వంటివి తీసుకోవ‌చ్చు. దీనితో పాటు ప్ర‌మాద‌క‌ర‌మైన‌ అనారోగ్యం, పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ‌, పీఓడీ క‌వ‌ర్‌, వంటి వివిధ రైడ‌ర్ల‌ను మీ ఆరోగ్య బీమా పాల‌సీకి క‌ల‌ప‌డం ద్వారా పూర్తి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. ఇందులో ఎక్కువ పాల‌సీలు ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల‌ను నిర్ధార‌ణ చేసిన వెంట‌నే మొత్తం హామీని ఒకేసారి చెల్లిస్తాయి.

వైద్య ఖ‌ర్చులు చాలా ఎక్కువ‌గా ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆరోగ్య బీమా ప్ర‌తీ ఒక్క‌రూ తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. ఆరోగ్య స్థితి ఆధారంగా, మీ అవసరాలకు త‌గిన పాల‌సీని ఎంచుకోవాలి. పాల‌సీదారుని వ‌య‌సు పెరిగే కొల‌దీ ప్రీమియం పెరుగుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly