ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలి?

మార్కెట్ క్యాపిలైజేష‌న్ లో తొలి 100 సంస్థ‌ల‌ను లార్జ్ క్యాప్ కంపెనీలుగా ప‌రిగ‌ణిస్తారు

ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలి?

ఈక్వీటీ ఫండ్లన్నింటిలో రిస్క్ ఒకే విధంగా ఉండ‌దు. కొన్ని ఈక్విటీ పండ్ల‌లో రిస్క్ త‌క్కువ‌గాను, మ‌రికొన్నింటిలో ఎక్కువ‌గానూ ఉంటుంది. యాక్టివ్ ఫండ్లలో న‌ష్ట‌ భ‌యం మ‌నం ఎంచుకునే ఫండ్, సెక్టార్ త‌దిత‌ర అంశాల పై ఆధార‌ప‌డి ఉంటుంది. ప్యాసివ్ ఫండ్లో అంటే ఇండెక్స్ ఫండ్ లో న‌ష్ట‌ భ‌యం కొంత త‌క్కువ‌గా ఉంటుంది. ఈ ఫండ్ల ప‌నితీరు ఆయా సూచీల ప‌నితీరు ఆధారంగా ఉంటుంది.

యాక్టివ్ ఫండ్ల మేనేజ‌ర్లు స‌రైన స‌మ‌యంలోమంచి షేర్ల‌ను ఎంపిక చేస్తార‌ని న‌మ్ముతాం. కాని కొన్ని సంద‌ర్భాల‌లో వారి అంచానాలు త‌ప్పు కావ‌చ్చు. మంచి ప‌థ‌కాలుగా కొన‌సాగుతున్న‌వి కూడా ఫండ్ మేనేజ‌ర్ల నిర్ణ‌యాల త‌ప్ప‌డం వ‌ల్ల రాబ‌డిలో హెచ్చ‌త‌గ్గులు ఉండొచ్చు.

ప్యాసివ్ ఫండ్ల విష‌యం చూస్తే ఈక్వీటీ ఫండ్ల‌లో ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌) త‌క్కువ రిస్క్ ఉండేందుకు అవ‌కాశం ఉన్న‌ ఫండ్లు. ఫండ్ మేనేజ‌ర్లు సంబంధిత సూచీలో ఉన్న విధంగానే మదుపు చేయడం వ‌ల్ల అవి బెంచ్‌మార్క్ సూచినీ ప్ర‌తిబింబిస్తాయి.

మార్కెట్ క్యాపిలైజేష‌న్ లో తొలి 100 సంస్థ‌ల‌ను లార్జ్ క్యాప్ కంపెనీలుగా ప‌రిగ‌ణిస్తారు. ఎక్కువ‌గా వీటి ప‌నితీరును విశ్లేషిస్తుంటారు. సాధారంగా ఇవి మార్కెట్ సూచీల‌కు అనుగుణంగా క‌ద‌లిక‌ల‌ను క‌లిగి ఉంటాయి. మార్కెట్ క్యాపిలైజేష‌న్ ప‌రంగా వీటి త‌రువాత వ‌చ్చే సంస్థ‌లు మిడ్,స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం కొంత అధికంగా ఉంటుంది. మార్కెట్ అనుకూలంగా ఉన్న‌పుడు లాభాలు అధిక‌మే, ప్ర‌తికూలంగా ఉన్న‌పుడు న‌ష్టాలు అధికంగానే ఉంటాయి.

మ‌నం మ‌దుపు చేసే ఫండ్ ఏ కేట‌గిరీల‌కు చెందిన కంపెనీల‌లో మ‌దుపు చేస్తుంద‌నేది కూడా ఫండ్ న‌ష్ట‌భ‌యాన్ని నిర్ణ‌యిస్తుంది. స్మాల్‌, మిడ్ క్యాప్ ఫండ్ల‌లో పెరుగుతున్న మార్కెట్ల‌తో పాటు అధిక రాబ‌డుల‌ను ఇస్తాయి. కానీ మార్కెట్ల ప‌త‌నం అయితే ప్ర‌మాద స్థాయి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీల‌లో పెట్టుబ‌డి పెట్టే కంపెనీలు కొంత త‌క్కువ న‌ష్ట‌భ‌యాన్ని క‌లిగి ఉంటాయి.

మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌లో థిమేటిక్, సెక్టార్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గానే ఉంటుంది. మౌళిక స‌దుపాయ‌ రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంబంధింత రంగాల్లో పెట్టుబ‌డి చేసే వాటిని సెక్టార్ ఫండ్లు అంటారు. సెక్టార్ ఫండ్ ఒక‌టి లేదా రెండు రంగాల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెడుతుంది. ఒక థీమ్ ఆధారంగా పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌ను థిమాటిక్ ఫండ్లు అంటారు.

సెక్టార్ ఫండ్లలోలా నిర్ధిష్ట రంగాల‌లోనే కాకుండా వివిధ రంగాల‌కు చెందిన కంపెనీల్లో మ‌దుపుచేసేందుకు వీలుంటుంది. ఎంచుకున్న రంగాలు,కంపెనీల షేర్లు బాగా రాణిస్తే సెక్టార్, థిమేటిక్ ఫండ్లు అధిక రాబ‌డి నిచ్చే అవ‌కాశం ఉంది. అయితే వీటిలో పెట్టుబడి చేసే వారు ఈ త‌ర‌హా ఫండ్ల‌లో ఎప్ప‌డు పెట్టుబ‌డి పెట్టాలి? ఎప్పుడు విర‌మించుకోవాలి అనే విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. ఒకే కేట‌గిరీ ఫండ్ల‌ను ఎంచుకున్నా ఫండ్ ఎంచుకునే వ్యూహం, పెట్టుబ‌డి విధానం త‌దిత‌ర అంశాల ఆధారంగా ఫండ్ రాబ‌డి, న‌ష్ట‌భ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి పెట్టే ముందు ఆ ఫండ్ ప్ర‌ధాన వ్యూహం ఏంటి? ఏ త‌ర‌హా కంపెనీల‌లో పెట్టుబ‌డి చేస్తుంది వంటి విష‌యాల‌ను ముందుగా తెలుసుకోవాలి…

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly